‘జీఎం’ ఎండమావుల వెంట... | center govt recently approved genetics crops | Sakshi
Sakshi News home page

‘జీఎం’ ఎండమావుల వెంట...

Published Wed, Jul 23 2014 12:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

‘జీఎం’ ఎండమావుల వెంట... - Sakshi

‘జీఎం’ ఎండమావుల వెంట...

సుప్రీం కోర్టు సాంకేతిక కమిటీ పదేళ్ల పాటూ నిషేధం విధింపును సూచించినా కేంద్రం ఇటీవల జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలకు అనుమతినిచ్చింది. జీఎం పంటల వల్ల సుసంపన్నమైన మన జీవ వైవిధ్యానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుంది. రైతాంగం బహుళజాతి కంపెనీల కోరల్లో చిక్కుకుంటుంది.

రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల తీవ్ర వ్యతిరే కతను బేఖాతరు చేసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇటీవలే జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలకు అనుమతిని మంజూరు చేసింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు నియమించిన సాంకేతిక కమిటీ... జన్యు మార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరిశోధనలను పదేళ్ల పాటూ నిషేధించాలని సూచించింది. అలాగే గత లోక్‌సభ నియమించిన పార్లమెంటరీ కమిటీ చేసిన సూచనలు సైతం అనుమతులను నిరాకరించాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యా వరణవేత్తలు, రైతులు, ప్రజా సంఘాల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా జీఎం సాంకేతికత అత్యంత వివాదాస్పదమైనదిగా మారింది. మన దేశంలో హరిత విప్లవ కాలం తదుపరి పంటల దిగుబడుల పెరుగుదల, ఉత్పత్తుల వృద్ధి స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసా య ఉత్పత్తులలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం బయో టెక్నాలజీ, జన్యుమార్పిడి మాత్రమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సాంకేతికత అతి వేగంగా విస్తరిస్తోంది.

ప్రపంచ వ్యవసాయ బయోటెక్ రంగాన్ని శాసిస్తున్న మోన్సాంటో, అపెంటిస్ సింజెంటా, డ్యుపాంట్, బేయర్ అనే ఐదు కంపెనీలే వ్యవసాయ బయోటెక్ రంగాన్ని శాసిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర సంస్థల  పేరిట అవి జన్యు మార్పిడి సాంకేతిక పరి జ్ఞానాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. చీడపీడలు సోకని వంగడా లను గాక, క్రిమి సంహారక, కలుపు మందులను తట్టుకునే వంగడాలను ప్రవేశపెడుతున్నాయి. ఇంతవరకు ఏ వంగడమూ అధిక దిగుబడి కోసం రూపొందించినది కాకపోవడం విశేషం. ఫలితంగా రైతు రసాయనిక ఎరు వులు, క్రిమి నాశనుల వ్యయాల పెను భారాన్ని మోయాల్సివస్తోంది. అంత కుమించి పర్యావరణ శాస్త్రవేత్తలంతా నిషేధించాలని కోరుతున్నారు రసాయ నిక ఎరువులు, క్రిమి నాశనుల వాడకం పెరుగుతోంది. ఆ రెండు రంగాలను శాసిస్తున్న బహుళ జాతి కంపెనీలే బయో టెక్నాలజీ, జీఎం సాంకేతికతపై గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. జీఎం వంగడాల పేటెంట్ హక్కుల పేరిట విత్తనంపై రైతుకు ఉన్న సహజ హక్కులను హరిస్తున్నాయి. ఇదంతా అధిక దిగుబడుల పేరిట జరుగుతున్న దగా. ఆ ఆశతోనే మన రైతాంగం బీటీ పత్తిని విస్తృతంగా పండిస్తోంది. కానీ బీటీ పత్తి విస్తరించే కొద్దీ దిగుబడులు క్షీణిస్తున్నాయనే కఠోర వాస్తవాన్ని మోన్సాంటో, జీఎం వత్తాసుదార్లు దాట వేస్తున్నారు. కేంద్ర జౌళి శాఖ విడుదల చేసిన ఈ గణాంకాలే సాక్ష్యం.

ప్రపంచ వ్యాప్తంగా ఇలాగే రైతులు జీఎం విత్తనాలు, క్రిమిసంహారక మందులు బహుళజాతి కంపెనీల కోరల్లో చిక్కుకుంటున్నారు. ఆ వినాశకర దుష్ఫలితాలను మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఏటా వేలాదిగా జరుగు తున్న రైతుల ఆత్మహత్యల్లో అత్యధికం బీటీ పత్తి రైతులవే కావడం యాదృచ్ఛికం కాదు. మోన్సాంటోను (బీటీ పత్తి) ఆహ్వానించి చేజేతులారా మనం కొని తెచ్చుకున్న ఉపద్రవం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విడుదల చేసిన సమాచారాన్ని చూస్తే (పక్కన ఉన్న పట్టికలో) పత్తి దిగుబడి పెరుగుదల క్షీణత బీటీ చలవేనని స్పష్టమౌతుంది. బీటీ పత్తి విస్తరణతో పాటే పత్తి దిగుబడుల పెరుగుదల క్షీణించడం కనిపిస్తుంది.

హరిత విప్లవం పర్యావరణానికి హాని కలగజేయగా, బయోటెక్ బహు ళజాతి కంపెనీలు జీవావరణాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారి జన్యు మార్పిడి చేసిన జీవిని నియంత్రించడం అసాధ్యమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ బయోటెక్ పరిశోధనల వ్యయంలో 70 శాతాన్ని చేస్తున్న పైన పేర్కొన్న ఐదు బహుళజాతి సంస్థలు ఈ హెచ్చరికలను పెడ చెవినిపెట్టి జీఎం పంటల విస్తరణతో ప్రపంచ విత్తనాల మార్కెట్‌తోపాటూ వ్యవసాయ మార్కెట్లను మొత్తంగా గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తు న్నాయి. ఇప్పటికే జీఎం సాంకేతికతను ప్రపంచ వాణి జ్యసంస్థ (డబ్ల్యూటీఓ) ఎజెండాకు ఎక్కించిన ఆ సంస్థలు జీఎం పంటల ప్రపంచీకరణ దిశగా సాగు తున్నాయి. మోన్సాంటో, డ్యుపాంట్, సింజెంటా అనే మూడు కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌ను శాసిస్తున్నాయి (55 శాతం). పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వంటి పంటలు పూర్తిగా ఆ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. అధిక పెట్టుబడుల ఆధునిక వ్యవసాయంతో ఇప్పటికే మన రైతాంగం దివా లా తీసింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మన  రైతాంగం బహుళ జాతి కంపెనీల ప్రపంచ విత్తన మార్కెట్ బలి పశువువుగా మారుతుంది. మోన్సాంటోకు ఏటా రూ. 1,800 కోట్లు రాయల్టీలుగా చెల్లిస్తోంది. జీఎం మిగతా పంటలకు కూడా విస్తరిస్తే పరిస్థితిని ఊహించుకోవచ్చు.

బీటీ కంపెనీలు తమ పరిశోధనలను అతి రహస్యంగా ఉంచుతున్నాయి. ఉదాహరణకు బీటీ పత్తి ‘బాసిల్లస్ తురంజనిసిస్’ అనే విషపూరిత జన్యు వును ప్రవేశపెట్టి సృష్టించినది. అందుకే బీటీ పత్తి చేలల్లో మేసిన పశువులు, మేకలు గణనీయమైన సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే ‘బాసిల్లస్ తురంజనిసిస్’తో బీటీ వంగ విత్తనాలను  తయారు చేశారు! భారత ఆహార భద్రత దృష్ట్యా మన దేశంలో జీఎం వరిపై జరుగుతున్న క్షేత్ర స్థాయి పరీక్షల ఫలితాలను వెల్లడించాలంటూ ‘గ్రీన్ పీస్’ కోర్టును ఆశ్రయించింది. జీఎం పంటల విస్తరణతో పాటే కొత్త కొత్త ఆరోగ్యసమస్యలు పుట్టుకొస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గి కొత్త ఎలర్జీలు పుట్టుకొస్తున్నట్టు పలు అధ్యయనాలు రుజువు చేశాయి. కీటకాలను నాశనం చేసే విషపూరిత జన్యువులున్న ఆహారం వల్ల ఇప్పటికి ఉన్న యాంటీ బయోటిక్ మందులన్నీ నిర్వీర్యమై, సరికొత్త యాంటీ బయోటిక్స్‌ను కనిపెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ దుష్ఫలితాల వల్లనే రష్యా, స్విట్జర్లాండ్ సహా 25 దేశాలు జీఎం పంటలను, పరిశోధనను, ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించాయి. అమెరికా, కెనడా, అర్జెంటీనా వంటి ఆహార ఎగుమతుల దేశాల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను కోల్పోతున్నాయి. ఒకవంక ప్రపంచ వ్యాప్తంగా జీఎం పంటలకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతుంటే... మరోవంక జీఎం పంటల ఆహార భద్రతను పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలపై దాడులు జరుగుతుండటం విశేషం.   
  భారత్ వంటి వాతావరణ, జీవ వైవిధ్యం గల దేశంలో జీఎం సాంకేతికత వల్ల అనాదిగా మన రైతాంగం సేకరించి, అభివృద్ధి చెందిన స్థానిక వంగడాలు సహజత్వాన్ని కోల్పోతాయి, జన్యుపరంగా కలుషిత మవుతాయి. మన  జీవ వైవిధ్యానికి శాశ్వతంగా నష్టం వాటిల్లుతుంది. బీటీ పత్తి వచ్చిన కొద్ది రోజులకే స్థానిక పత్తి రకాలన్నీ అదృశ్యమయ్యాయి ! ఇప్పుడిక బీటీ పత్తి తప్ప రైతుకు గత్యంతరం లేదు. అదే దుస్థితి మిగతా పంటలకు రాకముందే మేలుకోవడం అవసరం. ఇప్పటికైనా మన పాలకులు కళ్లు తెరచి స్వజాతి విత్తన సంపద పరిరక్షణకు నడుం బిగించి, జన్యుమార్పిడి పంటలను, పరిశోధనలను నిషేధించాలి.

(వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ నిపుణులు) డాక్టర్ కె.క్రాంతికుమార్ రెడ్డి     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement