రాజ్యాంగ పఠనమే ప్రాణవాయువు | Kancha Ilaiah Article On Constitution | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పఠనమే ప్రాణవాయువు

Published Wed, Jan 29 2020 12:21 AM | Last Updated on Wed, Jan 29 2020 12:21 AM

Kancha Ilaiah Article On Constitution - Sakshi

మహాత్మాగాంధీని, ఆయన్ని హత్యచేసిన నాథూరాం గాడ్సేని సరిసమాన దేశభక్తిపరులుగా పరిగణించినట్లయితే మన జాతి కానీ భారత ప్రజాస్వామ్యం కానీ మనలేవు. హంతకుడు, హత్యకు గురైనవాడు ఎన్నటికీ సమానులు కారని మన పిల్లలు నేర్చుకోవాలి. అహింసా ప్రబోధకుడిని, క్రూర హింస సమర్థకుడిని ఒకే స్థాయిలో గౌరవించకూడదని వారు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మన జాతి గాంధీని, గాడ్సేని సమానం చేసి చూస్తున్న ఒకరకమైన మానసిక జాడ్యంలో కూరుకుపోతోంది. మనుషులు జన్మరీత్యా సమానులు కారని చెబుతున్న ప్రాచీన పరంపర స్థానంలో భారతీయులందరూ సమానులే అని ప్రకటించిన కొత్త పరంపరను భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది. పిల్లలు ప్రతిరోజూ రాజ్యాంగ పీఠికను పఠించడం, ప్రతి యువతీయువకుడూ రాజ్యాంగాన్ని పఠించడం మాత్రమే భారతదేశాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడగలదు.

ప్రతిరోజూ పాఠశాల ప్రార్థనా సమావేశంలో భారత రాజ్యాంగ పీఠికను తప్పకుండా చదివి వినిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులందరూ తాము రాజ్యాంగం పరిధిలో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని విద్యార్థులు తప్పక గుర్తుంచుకోవాలి. ఇది గొప్ప జాతీయవాద ముందడుగు. దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ ప్రస్తుత మన జాతీయ సంక్షోభ సంధిదశలో దీన్ని తప్పక పాటించాల్సిన అవసరముంది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని ప్రదర్శనలూ రాజ్యాంగ పీఠికను, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్తరువును తమ ఉద్యమ చిహ్నాలుగా మార్చుకున్నాయి. మహిళలూ, ఇంటిబయటకు సాధారణంగా రాని ముస్లిం మహిళలతోపాటు విశ్వవిద్యాలయాల విద్యార్థులూ వీధుల్లోకి వచ్చి అరాచకంలోకి జారిపోతున్న జాతిని కాపాడారు. ప్రజాస్వామ్యం కోసం, సమానత్వం కోసం పోరాటంలో  రాజ్యాంగ పీఠికను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను సమర సంకేతాలుగా ఎత్తిపట్టిన వీరు.. భారతీయ ప్రజాస్వామ్యం, దాని పనివిధానం గురించి అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ప్రతి కూల భావం నుంచి కూడా భారతదేశాన్ని కాపాడారు. 

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక రూపంలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక భయంకరమైన భారత వ్యతిరేక జాడ్యం నేపథ్యంలో రాజ్యాంగ పీఠిక అనేది ప్రజలందరికీ ఒక ఆక్సిజన్‌ మాస్క్‌లాంటింది. ప్రజాస్వామిక ప్రభుత్వం, సమాజానికి సంబంధించిన జాతీయ స్ఫూర్తి, జీవ ధాతువుగా మన జాతి నిర్మాతలు మనకు ప్రసాదించిన రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ నీతిని విశ్వసించే ప్రస్తుత తరం పిల్లలపైనే మన రాజ్యాంగం భవిష్యత్‌ మనుగడ ఆధారపడి ఉంది. మహాత్మాగాంధీని, ఆయన్ని హత్యచేసిన నాథూరాం గాడ్సేని సరిసమాన దేశభక్తిపరులుగా పరిగణించినట్లయితే మన జాతి కానీ భారత ప్రజాస్వామ్యం కానీ మనలేవు. జీవితం తొలి దశలోనే మన పిల్లలు మంచికీ చెడుకీ మధ్య తేడాని గుర్తించగలగాలి. హంతకుడు, హత్యకు గురైనవాడు ఎన్నటికీ సమానులు కారని వారు నేర్చుకోవాలి. అహింసా ప్రబోధకుడిని, క్రూర హింస సమర్థకుడిని ఒకే స్థాయిలో గౌరవించకూడదని వారు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మన జాతి గాంధీని, గాడ్సేని సమానం చేసి చూస్తున్న ఒకరకమైన మానసిక జాడ్యంలో కూరుకుపోతోంది. 

‘భారతప్రజలమైన మేము, మా మతం, కులం, జాతి, లింగం వంటివి చూసుకోకుండానే ఈ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న మాకు మేముగా ఇచ్చుకుంటున్నాము’ అని రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. ఆరోజు నుంచి అన్నిరకాల కులపరమైన, మతపరమైన, వలసవాద, లింగపరమైన అసమానతలన్నింటి ప్రాతిపదికన నడుస్తున్న ప్రాచీన భారతదేశ వారసత్వ పరంపర స్థానంలో అంబేడ్కర్‌ పేర్కొన్నటువంటి ప్రతి వ్యక్తికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రం వచ్చి చేరింది. ఈ హక్కులు దేశంలోని ప్రతి కులం, మతం, జాతి, లింగ భేదంతో పనిలేకుండా అందరికీ వేరుపర్చలేని హక్కులుగా ఉంటాయి. ఈ హక్కుల్ని జాతీయ పౌరసత్వ పట్టిక తొలగించలేదు. ఏదైనా కారణాల వల్ల ఇతర దేశాలనుంచి వలస వచ్చినవారికి కూడా మనం రక్షణ, జీవనాన్ని కల్పించాలని భావిస్తే, మతంతో పనిలేకుండా అలాంటి వారందరికీ మన దేశ పౌరసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా వలస వచ్చిన వారిలో మానవత్వాన్నే తప్ప వారి మతాన్ని మనం చూడకూడదు. భారతదేశం లౌకికదేశం అని రాజ్యాంగ పీఠిక ప్రకటిస్తోంది. మతం అనేది వ్యక్తిగతమైన ఎంపిక అని ఒక ప్రైవేట్‌ వ్యవహారమని ప్రాథమిక పాఠశాల దశనుంచి మన పిల్లలు తెలుసుకోవాలి. పౌరసత్వం ఇవ్వడానికి మతం పునాదిగా మారినట్లయితే అది రాజ్యాంగం హామీపడిన లౌకికవాదాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. జాతిమొత్తం మీద తమ వ్యక్తిగత మతాన్ని రుద్దాలని చూస్తున్నవారు మన రాజ్యాంగ నీతినే వ్యతిరేకిస్తున్నట్లు లెక్క.

రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన సోషలిజం భావన వాస్తవానికి కమ్యూనిస్టు సామ్యవాదం గురించి చెప్పడం లేదు కానీ, అది  ఆధునిక ప్రజాస్వామిక సంక్షేమ వ్యవస్థకు గట్టి పునాదిని కల్పిం చింది. విద్యా హక్కు, ఉపాధి హక్కు, శ్రమను గౌరవించే హక్కు, గృహవసతి హక్కు, వృద్ధాప్య íపింఛన్లు వంటి ప్రభుత్వాలు ఇవ్వాళ అందిస్తున్న హక్కులన్నింటికీ మన రాజ్యాంగ పీఠికే హామీ ఇస్తోంది. కాబట్టి భవిష్యత్‌ తరాల పౌరులు ప్రజాస్వామ్యాన్ని, గణతంత్ర ప్రభుత్వ వ్యవస్థ రూపాన్ని కాపాడే విషయంలో పోరాడకపోతే మన మొత్తం వ్యవస్థ ఏ మార్గంలోనైనా పయనించవచ్చు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం రద్దయి నియంతృత్వం ముందుకురావచ్చు కూడా. మన పాలకుల ఆలోచనలు మన అంచనాలకు అందకుండా పోతున్నప్పుడు, ప్రస్తుత ప్రజాస్వామిక, గణతంత్ర వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే మన ఏకైక ఆశాదీపంగా ఉంటున్నాయి. ఇక్కడే మన యువతీయువకులు మన స్వాతంత్య్ర యోధుల పోరాటాలు, వలస పాలకులకు వ్యతిరేకంగా వారు చేసిన త్యాగాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని స్థాపించుకోవడం కోసం వేలాదిమంది ప్రాణత్యాగాలు చేశారని మన పిల్లలు తెలుసుకోవాలి.

మన రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు కాపాడతాయని, ప్రజలు దీనిగురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించడం సరైంది కాదు. న్యాయవ్యవస్థ కూడా తమ సొంత అభిప్రాయాలు, భావజాలాలు కలిగి ఉన్న మనుషుల నాయకత్వంలోనే ఉంటున్నాయి. ప్రజల అప్రమత్తత న్యాయవ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మలిచి రాజ్యాంగ సంరక్షణ ప్రక్రియను కాపాడగలుగుతుంది. చారిత్రకంగా చూస్తే భారతీయులు క్రమంతప్పకుండా పుస్తకాలు చదివే అలవాటు కానీ, ఇళ్లలో పుస్తకాలు భద్రపరచుకునే అలవాటు కానీ కలిగి లేరు. ప్రతి భారతీయుడూ రాజ్యాంగాన్ని చదవడం తమ విధిగా భావిం చాల్సి ఉంటుందని మన పిల్లలకు తెలియజెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా  రాజ్యాంగాన్ని చదవడం అనేది న్యాయవాదులు, రాజనీతి శాస్త్రం అధ్యాపకులకు సంబంధించిన పనిగా ప్రజలు భావిస్తుంటారు. కానీ ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు.  ప్రతి భారతీ యుడూ పాఠశాల విద్యా దశలోనూ, తదనంతర జీవితంలోనూ రాజ్యాంగాన్ని తప్పకుండా పఠించవలసిన అవసరం ఉంది. 

మత గ్రంథాలను ఆ మతానికి చెందిన ప్రజలు మాత్రమే చదువుతారు. కాని ఏ మతానికి, భాషకు చెందిన వారైనా సరే.. ప్రతి ఒక్క భారతీయుడూ చదవాల్సిన గ్రంథమే భారత రాజ్యాంగం. రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని భాషల ప్రజానీకానికి రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా అందించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 మధ్య కాలంలో రాజ్యాంగంపై కాస్త చర్చ చోటు చేసుకుంది కానీ ఆ సమయంలో విద్యావంతులైన ప్రజల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు మనకు ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నాటి భారతదేశంలో ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.విద్యావంతులు స్వార్థ దృక్పథంతో వ్యవహరించినప్పుడు, వారు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నపరిచే కార్యకలాపాలలో మునిగితేలుతారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ సూత్రం సారాం శానికి విద్య మాత్రమే హామీ ఇవ్వలేదు.

విద్యావంతులే భారత్‌లో కులాన్ని, అస్పృశ్యతను సృష్టించిపెట్టారు. వారు ఇతరులను కూడా మన ఈ వారసత్వాన్ని ఆచరించాలని కోరుతూ వచ్చారు. కానీ మన రాజ్యాంగం ఆ పరంపరను వ్యతిరేకిస్తోంది. భారతీయులందరూ సమానులే అని అది ప్రకటిస్తోంది. సమానత్వానికి సంబంధించిన సరికొత్త పరంపరను అది ప్రారంభిం చింది. కానీ ఈ రాజ్యాంగ సూత్రాన్ని ఇప్పుడు అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి దుష్ట శక్తులను మనం వ్యతిరేకించి తీరాలి. ప్రస్తుతం విద్యావంతులు సంపన్నులకు, శక్తిమంతులకు మాత్రమే సర్వస్వం అనే భావనకు బదులుగా అందరికీ మంచి, అందరికీ సమానత్వం, అందరికీ సంక్షేమం అనే భావనలను గురించి ఆలోచించాలి. ప్రజలందరి మేలుకోసం ప్రజలు జీవించడమే రాజ్యాంగానికి అసలైన అర్థం. భారతీయ పిల్లలు ప్రతిరోజూ రాజ్యాంగ పీఠికను పఠించడం, ప్రతి యువతీయువకుడూ మన రాజ్యాంగాన్ని పఠించడం అనేది మాత్రమే భారతదేశాన్ని అనేక ప్రమాదాల నుంచి కాపాడగలదు.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ KANCHE

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement