బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. కానీ ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. క్రైస్తవులకు ప్రాధాన్యత ఉన్న బ్రిటన్‌లో రిషీ సునాక్ తనది హిందూమతం అని చెబుతూ, ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అక్కడి ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నించడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ అదే భారత్‌లో ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్‌ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించి, సమానత్వం గురించి ఇండియాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది.
భారత సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నేత రిషీ సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంవత్స రాల క్రితం అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత రాజకీయ ఉన్నత పదవిని అందుకోవడానికి పశ్చిమ దేశాల్లోని భారత సంతతి వలస ప్రజల్లో ఇటీవల వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి రిషీ సునాక్.
బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. భారతీయ కోణం నుంచి చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి అంటే దోపిడీ సామ్రాజ్యానికి చారిత్రాత్మకమైన రాజకీయ ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తారు. అదే సమయంలో అది సంస్కరణల సామ్రాజ్యం కూడా అని గుర్తుంచుకుందాం. మరి బ్రిటిష్ వలస పాలనా కోణం నుంచి చూస్తే, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం హక్కుల ప్రాతి పదికన పోరాటం చేసి ఉండకపోతే, భారతదేశం 1947లో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ రిపబ్లిక్ అయి ఉండేదికాదు. హిందూ లేదా బౌద్ధం... అది ఏదైనా కావచ్చు, మన ప్రాచీన నిర్మాణాలలోనే మన ప్రజాస్వామ్యానికి మూలాలు ఉన్నాయని మనం ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ.
చర్చలో మతం లేదు
మన స్వాతంత్య్ర పోరాటం, వలస జీవితానికి సంబంధించిన అన్ని కీలక అంశాలూ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థతో అనుసంధానమై ఉండేవి. ప్రత్యేకించి 20వ శతాబ్ది ప్రారంభం నుంచి బ్రిటిష్ ప్రధాని అంటే వలసపాలనా చిహ్నంగానే భారతీయ ఆందోళనాకారులు భావించేవారు. దూషించడానికైనా, అభ్యర్థించడానికైనా బ్రిటిష్ ప్రధానే మన తలపుల్లో ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యంలో, ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. హిందూ– జాతీయవాదం ప్రేరేపిస్తున్న వివక్షను భారత్ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో క్రైస్తవులకు ప్రాధా న్యత ఉన్న బ్రిటన్‌లో ఒక వ్యక్తి తనది హిందూ మతం అని చెబుతూ, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. బ్రిటన్ పార్ల మెంటు సభ్యుడిగా, తర్వాత ఆర్థిక మంత్రిగా ఆయన గతంలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారని మనం గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు అదే హిందూ సునాక్... బ్రిటన్ ప్రధాని అధికారిక నివాస భవనమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లాలని కోరుకుంటున్నారు. సునాక్ భార్య అక్షత హిందూ భారతీయ కోటీశ్వరుల కుమార్తె. సునాక్ సంపద ఇప్పుడు ప్రజల్లో చర్చించుకునే అంశమైంది. ఎందుకంటే ఆర్థిక, సామాజిక వర్గాలు చాలాకాలంగా బ్రిటిష్ రాజకీయాల్లో భాగంగా ఉంటున్నాయి. అయితే సునాక్ మతం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా కనిపించడం లేదు. బ్రిటన్ ఓటర్లు, రాజకీయ వర్గంలో గణనీయంగా గుర్తించదగిన బహుళ సాంస్కృతిక సహన స్థాయిని ఇది సూచిస్తోంది. ఈ కోణంలో, అమెరికా కంటే మరింత లౌకికమైన, బహుళ సాంస్కృతిక దేశం బ్రిటనే అని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ గనక తనను తాను హిందువు అని బహిరంగంగా చెప్పుకునివుంటే, డెమొక్రాటిక్ పార్టీ టికెట్‌ని గెల్చుకునేవారు కాదని నా అనుమానం. ఆంగ్లికన్ క్రిస్టియానిటీ బ్రిటన్ అధికార మతం. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ హెడ్ ఎలిజబెత్ రాణి. అయినా సరే బ్రిటన్ ప్రధానమంత్రి కావాలన్న రిషీ సునాక్ కోరికను మత ప్రాతిపదికన అసంగతమైన అంశంగా అక్కడ ఎవరూ చూడటం లేదు.
ఇదేనా సహనం?
అదే భారతదేశం విషయానికి వస్తే, బ్రిటన్‌కు కాబోయే ప్రధానిగా అవకాశమున్న, దానికి అక్కడి సమాజ ఆమోదం పొందిన భారత సంతతి హిందువు గురించి ఆరెస్సెస్, బీజేపీ ఏమని ఆలోచిస్తాయో ఊహించగలరా? ఎందుకంటే వీళ్లు భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను మతపరమైన మెజారిటీవాద అజెండాతో అట్టడుగున పడేశారు. పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే భారత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. (అదే బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఆయన మంత్రి వర్గంలో భారత్ కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు.)
హిందూయిజం ప్రపంచానికే విశ్వగురువుగా ఉందంటూ ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పదేపదే ఎత్తిపడుతున్నాయి. ఇక ఆరెస్సెస్ సాహిత్యమంతా బ్రిటిష్ వారిపై, క్రిస్టియన్ నాగరికతా చరిత్రపై మతయుద్ధ వీరులు, వలసవాద విస్తరణవాదులు అంటూ దాడులతో నిండిపోయింది. దేశంలో ఇప్ప టికీ కొనసాగుతున్న కుల అంతరాలు, దళితులపై దౌర్జన్యాలు వంటి సామాజిక దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోని ఈ కూటమి, ప్రపంచం లోనే అత్యంత సహనభావం కలిగినది హిందూ మతమేనని మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. మరోవైపున వీరి తాజా చరిత్ర వర్ణనలో స్థానిక భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను కూడా శత్రువులుగా పరిగణిస్తున్నారు.
నేడు బ్రిటన్‌లో హిందువులు చిన్న మైనారిటీగా ఉంటున్నారు. జనాభాలో వీరి వాటా 1.6 శాతం మాత్రమే. వీరు బ్రిటన్‌కి ఇటీవలే వలస వచ్చినవారు, వారి వారసులతో కూడి ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీవాదం బ్రిటన్ ప్రజా స్వామిక పోటీలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఆరెస్సెస్, బీజేపీ భారత్‌లో గానీ, చివరకు గతకాలపు కాంగ్రెస్ హయాంలో గానీ ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్‌ని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. ఇలా హిందూయిజం సహనభావం గురించి చెప్పుకోవ లసింది చాలానే ఉంది మరి.
ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్నలు ఇవే...
క్రిస్టియన్ వలసవాద సామ్రాజ్యాన్ని బ్రిటన్ సర్వవ్యాప్తం చేసింది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ అత్యున్నత పదవికి సునాక్ పోటీ చేయడాన్ని అనుమతిస్తోంది. బ్రిటన్‌లోని ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నిం చడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అతడి భార్య పన్ను ఎగవేత గురించి ప్రశ్నిస్తు న్నారు. ప్రజాస్వామ్యంలో సంధించవలసిన అసలు సిసలైన ప్రశ్నలు ఇవే. కానీ ఇలాంటి ప్రశ్నలు భారత్‌లో అరుదుగానే అడుగుతుంటారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ వేసిన అభ్యర్థిత్వ ఫలితం పట్ల నేను అజ్ఞేయవాదిగానే ఉంటాను. బ్రిటన్ భావి ప్రధాని ఎంపికలో ఫలితాలు ఎలా అయినా ఉండనివ్వండి... కానీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించీ, సమానత్వం గురించీ భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పు తోందని నాకు తెలుసు. కానీ భారతదేశం మాత్రం ఆ పాఠాన్ని నేర్చుకునే దేశంగా మాత్రం ఉండటం లేదని నా భావన.
వ్యాసకర్త ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
Comments
Please login to add a commentAdd a comment