బ్రిటన్‌లో మార్పుకు సారథి
లేబర్ పారీ్టకి ఘనవిజయం సాధించి పెడతారంటూ అంచనాలు
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్‌లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు
బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్
నిరుపేద నేపథ్యం..
దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్‌గా బదులిస్తారు స్టార్మర్.
కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్‌దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు.
‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్‌మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం.
ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్‌గా నిలిచేందుకు సాయపడిందంటారు.
50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం
50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్‌గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం.
ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్‌కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్‌వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు.
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి.
విజయమే లక్ష్యంగా...
కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు.
తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్‌లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.
కొసమెరుపు
లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్‌కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!
ప్రస్తుత బలాబలాలు
బ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.
పార్టీ స్థానాలు
కన్జర్వేటివ్ 344
లేబర్ 205
ఎస్ ఎన్ పీ 43
లిబరల్ డెమొక్రాట్స్ 15
ఇతరులు 43
Comments
Please login to add a commentAdd a comment