జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు.
అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు.
సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment