
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో పాటు ప్రముఖ రచయిత కంచ ఐలయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపులు అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చాయి. హరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ అనే సభ్యుడు ప్రతినిధుల సభలో ఈ ఘటనల్ని లేవనెత్తారు. ‘గౌరవనీయులైన స్పీకర్ గారు.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ విమర్శను పోస్ట్ చేసిన వారిని లేదా తమ అభిప్రాయాలను ఇంటర్నెట్‌లో స్వేచ్ఛగా వ్యక్తీకరించిన వారిని శిక్షించాలనే, వీలైతే చంపేయాలనే ధోరణి పెరిగిపోతోంది.
భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా, ధైర్యంగా విమర్శలు గుప్పించిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను ఇటీవలే దారుణంగా హతమార్చారు. హేతువాదులు పన్సారే, ఎంఎం కల్బుర్గీ, నరేంద్ర దబోల్కర్‌లతో పాటు లంకేశ్ హత్యకు దారితీసిన పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’ అని తెలిపారు. కంచ ఐలయ్యపై తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..‘లంకేశ్ హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత భారత్‌లో కుల, సామాజిక వ్యవస్థలపై పోరాడుతున్న కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరితీయాలని హిందూ మతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు అన్నారు.
కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆ సభ్యుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదొక్కటే కాదు ఐలయ్యకు ఇంకా చాలా బెదిరింపులు వచ్చాయి. ఓ సమావేశానికి వెళుతున్న ఆయనపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలు ఐలయ్యపై ఎంతగా ప్రభావం చూపాయంటే.. ప్రాణ రక్షణ కోసం ఆయన ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహనిర్బంధంలో ఉంటున్నారు’ అని ఫ్రాంక్స్ వెల్లడించారు.‘స్పీకర్ గారు.. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం ఐలయ్య రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధుల సభ సాక్షిగా నేను తెలుపుతున్నాను. కంచ ఐలయ్య హక్కులు, వాక్ స్వాతంత్య్రాన్ని హరించకూడదని, ఐలయ్యతో పాటు ఆయన లాంటి వ్యక్తుల ప్రాణాల రక్షణను అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నాం’ అని ఫ్రాంక్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment