Gouri Lankesh
-
ఆ ముగ్గురి హత్యల వెనుక ఒకే సంస్థ
ముంబై: హేతువాదులు నరేంద్ర దబోల్కర్, ఎంఎం కలబురిగి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యలకు ఒకే అతివాద సంస్థ కారణమని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యతో ఈ సంస్థకు లింకులున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు. ‘దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యల్లో ఒకే రకమైన భావాలున్న వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించాం. ఆ సంస్థలోని దాదాపు అందరు సభ్యులకూ సనాతన్ సంస్థతోనూ దాని అనుబంధ ‘హిందూ జనజాగృతి సమితి’తోనూ సంబంధాలున్నాయని తేలింది. పాల్ఘర్ జిల్లా నల్లసోపారలో ఇటీవల ఆయుధాలు, పేలుడు సామగ్రితోపాటు అరెస్టయిన వారికి దబోల్కర్, లంకేశ్, కలబురిగిల హత్యలతో ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే దబోల్కర్ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అరెస్టు చేశాం. దీంతోపాటు ఈ ముగ్గురి హత్యలకు కీలక సూత్రధారి వీరేంద్ర సింగ్ తవాడేను కూడా పట్టుకున్నాం’ అని తెలిపారు. -
సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్‌పై ఫిర్యాదులు
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్‌పై వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. గిరీష్ కర్నాడ్‌కు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది, శ్రీరామ సేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ ప్రథమ వర్థంతి (సెప్టెంబర్ 5) సందర్భంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ అన్న ప్లకార్డు ధరించడాన్ని తప్పుపడుతూ ఈ కేసు నమోదు చేశారు. వీరిలో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎన్పీ అమృతేశ్ ఒకరు కావడం గమనార్హం. హిందూ జన జాగృతి సమితి సభ్యులు కూడా కర్నాడ్‌పై నగర పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నక్సలిజాన్ని సమర్ధిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. గిరీష్ కర్నాడ్‌పై హైకోర్టు న్యాయవాది ఎన్పీ అమృతేశ్ విధానసౌదా పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిషేధానికి గురైన సంస్థ బ్యానర్‌ను ఎవరైనా ఎలా ధరిస్తారు అని ఆయన ప్రశ్నించారు. గిరీష్ కర్నాడ్, అతని అనుచరులకు మావోయిస్టు సంబంధాలున్నారని ఆరోపించారు. ఈ ప్లకార్డును ధరించడం ద్వారా కర్నాడ్ నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాలను ప్రచారం చేశారని, అందుకు ఆయనను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ దేశంపై తిరుగుబాటు చేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నాడ్‌కు మద్దతుగా ప్రకాశ్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ కూడా ఉన్నారనీ, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నక్సల్స్‌తో సంబంధాలతోపాటు భీమా కోరెగావ్ కేసులో గిరీష్‌కు ప్రమేయం ఉందని, ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై గిరీష్ కర్నాడ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. కేసు దాఖలు చేసే హక్కు అతనికి ఉంది. అలాగే తాననుకున్నది స్వేచ్ఛగా పాటించే హక్కు తనకూ వుంద’ని చెప్పారు. న్యాయాన్యాయాలను చట్టం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
లౌకికవాద ఖడ్గధార గౌరీ లంకేష్
సమాజం కోసం తమ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు చాలా అరుదు. వారిలో గౌరీ లంకేష్ ఒకరు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5వ తేదీన అమానుషంగా హిందూత్వ శక్తులు హత్య చేశాయి. భిన్న భావజాలం కలిగిన వాళ్ళపైన దాడి చేయవచ్చునని, చంపవచ్చుననే హిందూత్వ రాజకీయాలు పట్టు సాధించినప్పటి నుంచి ఇలాంటి హత్యలు కొనసాగుతున్నాయి. ప్రొ‘‘ కల్బుర్గి, డా‘‘ నరేంద్ర, దబోల్కర్, గోవిందరావు పన్సారే లాంటి మేధావుల్ని హత్య చేశారు. హిందూత్వ మూకల అసత్య ప్రచారాలకు, ఉన్మాదానికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించినందుకే గౌరీ లంకేష్ బలయ్యారు. ‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్’ శీర్షికతో తన చివరి సంపాదకీయంలో అసత్యాల గుట్టును రట్టు చేశారు. గౌరీ కర్ణాటక రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛపైన, జీవించే హక్కుపైన దాడులు చేస్తున్న హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సమస్త ప్రజానీకాన్ని ఒకే తాటిపైకి తేవడానికి తన శక్తియుక్తులను దారపోశారు. దాన్ని హిందూత్వ ఫాసిస్టు మూకలు సహించలేక పోయాయి. అంతం చేయడానికి ప్లాన్ వేసి హత్య చేశాయి. గౌరీ ఆంగ్లంలో బాగా రాయగలిగిన పాత్రికేయురాలు. ఢిల్లీలోని టైమ్స్ ఆఫ్ ఇండియా, సండే తదితర పత్రికల్లో పనిచేశారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని రాజకీయ నాయకుల వ్యవహారాలనూ, అవకతవకలను ఎండగట్టారు. తండ్రి పాల్యాద్ లంకేష్ మరణానంతరం అతను నడుపుతున్న లంకేష్ పత్రిక బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తండ్రి నిబద్ధతను పుణికిపుచ్చుకున్న గౌరీ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సమస్యల వేదికగా పత్రికను నడపడానికి చివరికంటా కృషి చేశారు. లంకేష్ వారపత్రికలో 850 సంపాదకీయ వ్యాసాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు, స్థానిక వైరుధ్యాలు, పుస్తక సమీక్షలు, జీవిత చరిత్రలతోపాటుగా హిందూత్వ ఏకశీల అఖండ భావనకు వ్యతిరేకంగా భిన్నజాతుల, భావాల సమాహారంగా ప్రజాస్వామిక విలువలకై రచనలు చేశారు. లౌకికవాదం, శాంతి యుత సహజీవనం, స్త్రీ, పురుష సమానత్వం అంశాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. మహిళల, ఆదివాసీల, దళితుల, మైనార్టీల హక్కుల గొంతుకగా ఉంటూ తన పత్రికను తీర్చిదిద్దారు. విప్లవోద్యమ రాజకీయాల గురించి 2004లో తన పాఠకులకు పరిచయం చేశారు. నక్సలైట్లు తుపాకులు ఎందుకు పట్టాల్సి వచ్చిందనే విషయంపై సాకేత్‌రాజన్ పెట్టిన అజ్ఞాత ప్రెస్‌మీట్‌కు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా హాజరయ్యారు. చర్చల ద్వారా పరిష్కారమయితే సాయుధ పోరాటం అవసరం ఉండదనే సాకేత్ రాజన్ సమాధానం గౌరీని ప్రభావితం చేసింది. దీనితో ‘‘శాంతి కోసం వేది క’’ను ఏర్పాటు చేసుకొని నక్సలైట్లతో చర్చించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆనాటి సీఎం ధరమ్‌సింగ్ కూంబింగ్‌ను ఆపివేసి, చర్చలకు ఆహ్వానిస్తానని చెప్పి.. ఆ మాట నిలబెట్టుకోలేదు. పైగా ప్రభుత్వం సాకేత్ రాజన్‌ను ఎన్కౌంటర్ చేసింది. ఈ చర్యపై చలించిన గౌరి నిజాయితీలేని కాంగ్రెసు ప్రభుత్వంపై సంపాదకీయం రాశారు. గుజరాత్ ఉనా పోరాటంలో దళిత నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ నేవాని, జేఎన్ యూలో కన్హయ్ కుమార్, ఉమర్ ఖలీద్‌ల మీద దాడులు, వీటికి వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనల్ని గమనించి భవిష్యత్ తరానికి వీరంతా నాయకత్వం వహించాల్సిన బాధ్యతలను వారికి గుర్తింపజేశారు. తన కొడుకులుగా వారిని ప్రకటించారు. ఆమె ప్రారంభించిన సంఘటిత కార్యక్రమాలను అడ్డగించేందుకు హిందూత్వ శక్తులు ఆమెను పాశవికంగా హత్య చేశాయి. ఈనాడు ప్రభుత్వం దళితుల, ఆదివాసీల, అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడుతున్న మేధావులను, ప్రజాస్వామిక వాదులను మోదీ హత్యకు కుట్రదారులుగా ప్రకటిస్తోంది. అడ్వొకేట్ సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, విరసం వరవరరావు, జర్నలిస్ట్ క్రాంతిలను కుట్రదారులుగా ప్రకటించి అక్రమ అరెస్టులకు పాల్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో గృహనిర్బంధంలో ఉన్న హక్కుల నేతలపై మహారాష్ట్ర పోలీసుల వాదనను విశ్వసించకుండా వారి గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు వారంరోజులు వాయిదా వేసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పేరుతో అందరి భావ ప్రకటన హక్కును కాలరాసే వైపు బీజేపీ ప్రభుత్వ పయనం కొనసాగుతోంది. అర్బన్ నక్సల్‌గా ప్రకటిస్తో్తంది. గౌరీ హత్యకు వ్యతిరేకంగా నాను గౌరీ అని నినదించిట్లే నేడు ‘‘నేను అర్బన్ నక్సల్’’ అంటూ వేలాదిమంది ప్రకటిస్తున్నారు. ఏ ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడారో అలాంటి విలువల కోసం నిలబడిన మేధావులను ప్రజలతో వేరు చేసి బంధించాలని చూస్తోంది. అలాంటి ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటమే గౌరీ లంకేష్‌కు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి. జి.ఝాన్సీ వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, పి.ఓ.డబ్ల్యూ మొబైల్ : 94907 00942 -
అమెరికా కాంగ్రెస్‌లో కంచ ఐలయ్య ప్రస్తావన
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యతో పాటు ప్రముఖ రచయిత కంచ ఐలయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపులు అమెరికా కాంగ్రెస్‌లో ప్రస్తావనకు వచ్చాయి. హరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ అనే సభ్యుడు ప్రతినిధుల సభలో ఈ ఘటనల్ని లేవనెత్తారు. ‘గౌరవనీయులైన స్పీకర్ గారు.. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ విమర్శను పోస్ట్ చేసిన వారిని లేదా తమ అభిప్రాయాలను ఇంటర్నెట్లో స్వేచ్ఛగా వ్యక్తీకరించిన వారిని శిక్షించాలనే, వీలైతే చంపేయాలనే ధోరణి పెరిగిపోతోంది. భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీల అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా, ధైర్యంగా విమర్శలు గుప్పించిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను ఇటీవలే దారుణంగా హతమార్చారు. హేతువాదులు పన్సారే, ఎంఎం కల్బుర్గీ, నరేంద్ర దబోల్కర్లతో పాటు లంకేశ్ హత్యకు దారితీసిన పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’ అని తెలిపారు. కంచ ఐలయ్యపై తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ..‘లంకేశ్ హత్య జరిగిన కొద్ది రోజుల తర్వాత భారత్‌లో కుల, సామాజిక వ్యవస్థలపై పోరాడుతున్న కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరితీయాలని హిందూ మతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు అన్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఆ సభ్యుడు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదొక్కటే కాదు ఐలయ్యకు ఇంకా చాలా బెదిరింపులు వచ్చాయి. ఓ సమావేశానికి వెళుతున్న ఆయనపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలు ఐలయ్యపై ఎంతగా ప్రభావం చూపాయంటే.. ప్రాణ రక్షణ కోసం ఆయన ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహనిర్బంధంలో ఉంటున్నారు’ అని ఫ్రాంక్స్ వెల్లడించారు.‘స్పీకర్ గారు.. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తం ఐలయ్య రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధుల సభ సాక్షిగా నేను తెలుపుతున్నాను. కంచ ఐలయ్య హక్కులు, వాక్ స్వాతంత్య్రాన్ని హరించకూడదని, ఐలయ్యతో పాటు ఆయన లాంటి వ్యక్తుల ప్రాణాల రక్షణను అత్యంత ప్రాధాన్యత కల్గిన అంశంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నాం’ అని ఫ్రాంక్స్ పేర్కొన్నారు. -
గౌరీ లంకేశ్‌కు రష్యా పురస్కారం
బెంగళూరు: ఇటీవల హత్యకు గురైన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్‌కు రష్యా అన్నా పొలిట్‌కోవస్కయా అవార్డు (మరణానంతరం)ను ప్రకటించింది. ఈ సమాచారం గురువారం తమకు ఈ–మెయిల్ ద్వారా అందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అవార్డు పొందనున్న తొలి భారతీయురాలిగా లంకేశ్ నిలవనున్నారు. 2006లో మాస్కోలో హత్యకు గురైన ప్రముఖ మహిళా జర్నలిస్టు పొలిట్‌కోవస్కయా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును లంకేశ్, పాకిస్తాన్ హక్కుల కార్యకర్త గులాలాయ్ ఇస్మాయిల్‌లకు ఈ ఏడాది సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి చెచెన్యాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై కథనాలు ప్రచురించినందుకు పొలిట్‌కోవస్కయాను విషమిచ్చి హత్య చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకే ప్రత్యేకంగా ఆమె పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. -
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రకాశ్ రాజ్
-
మోదీపై కామెంట్స్.. ప్రకాశ్ రాజ్‌కు కేసు సెగ!
లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై లక్నో కోర్టులో కేసు నమోదైంది. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ తాజాగా వ్యంగ్యాస్త్రాలను సంధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక లాయర్ లక్నో కోర్టులో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 7న ఈ కేసు విచారణకు రానుంది. బెంగళూరులో జరిగిన డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) సదస్సులో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కన్నా పెద్ద నటులు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేశ్ హత్య ఘటనపై మోదీ మౌనాన్ని నిరసిస్తూ తన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ప్రకాశ్ రాజ్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ.. జాతీయ అవార్డులన తిరిగి ఇవ్వడానికి తానేమైనా పిచ్చోడినా అని ట్వీట్ చేశారు. -
పాలక భావజాలం చేసిన హత్య
విశ్లేషణ తండ్రికంటే గౌరి ఎక్కువ వామపక్షవాది. కానీ, ఆమె లౌకికవాదం బసవన్న నాటి నుంచి కన్నడనాట సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న సమానత్వవాద సాంప్రదాయపు కొనసాగింపే. ఇలాంటి లౌకికవాద సంప్రదాయం అంటేనే సంఘ్‌పరివార్‌కు భయం ఎక్కువ. దాన్ని పాశ్చాత్య మేధోవాదంగా తోసిపారేయలేరు. భావమయ జీవితాన్ని జీవించిన గౌరి అందుకు తగ్గట్టే ఒక భావజాలం చేతుల్లో హత్యకు గురయ్యారు. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, హిందూ మతంలోని వివిధ శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది. గౌరీ లంకేశ్‌ను చంపింది ఏమిటి? ‘‘గౌరీ లంకేశ్‌ను చంపింది ఎవరు?’’ అనే ప్రశ్నా ఒక్కటే కావు. లంకేశ్‌ను చంపింది ఏమిటి? అనేది మరింత లోతైన, మరింత ఉపయుక్తమైన ప్రశ్న. బహిరంగ చర్చలో మనం అర్థవంతమైన సమాధానం చెప్పగల ప్రశ్న ఇది మాత్రమే. ఒక హత్య నాలుగు రకాల అపరాధాలతో కూడినదిగా ఉంటుంది: హత్యను చేసిన వారు ఎవరు, అందుకు కుట్ర పన్నినది ఎవరు, దానిని ప్రోత్సహించినవారు లేదా దాని వల్ల లబ్ధి పొందేవారు ఎవరు, అందుకు ఆమోదం తెలిపినవారు ఎవరు అనేవి. ఇందులో మొదటి రెండు అంశాలను మనం పోలీసులకు వదిలి పెట్టేయాలి. హంతకులు, కుట్రదారుల గురించి హడావుడిగా నిర్ధారణలు చేసేయాలని ప్రయత్నిం^è వద్దు. అందుకు బదులు, ఆమె హత్యకు ప్రేరేపించిన, అనుమతించిన మరింత విస్తృత నేపథ్యంపై దృష్టిని కేంద్రీకరిద్దాం. నోళ్లు మూస్తారా? లేకపోతే... ఈ వైఖరి, ప్రత్యేకించి గౌరీ లంకేశ్ విషయంలో మరింత సందర్భోచితమైనది. ఆమె కేవలం ఒక వ్యక్తి కాదు. ఆమె ఒక భావానికి ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఆమె హత్య ఆ భావాన్ని కడతేర్చాలని చేసిన ప్రయత్నమనే అనుకోవాలి. అంతే కాదు, నోళ్లు మూయండి లేదంటే చూస్కోండి అని మిగతా వాళ్లందరికీ సంకేతాన్ని పంపడమని కూడా అర్థం. ఈ సంకేతాలు బహిరంగంగా పంపినవి కాబట్టి, ఆమె హత్యకు దారి తీసిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి వాటి అంతరార్థాన్ని విప్పి చూడటం అవసరం. ‘ఎవరు చేశారు’ అనే దానికి సంబంధించి ఓ మాట. ఇంతవరకైతే, దీనికి సంబంధించి మనకు కొన్ని వాస్తవాలు తెలుసు. గౌరీ లంకేశ్ ఒక పాత్రికేయురాలు. లంకేశ్ పత్రికె అనే ఓ అసాధారణ పత్రికకు భయమెరుగని సంపాదకురాలు. తన సంపాదకత్వంలోని పత్రిక ద్వారా, కొము సౌహార్ద వేదికె వంటి సంస్థల ద్వారా బీజేపీ, దాని మిత్రపక్షాల హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆమె అవిశ్రాంత పోరాటాన్ని సాగిస్తున్నారు. గత ఏడాది ఒక బీజేపీ నేత ఆమెపై వేసిన పరువు నష్టం దావాలో ఆమె ఓడిపోయారు. ఆమె ఆ కేసులో చేసిన అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉంది. సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల బెదింపులకు ఆమె పలుమార్లు గురయ్యారు. మనకు తెలిసినంత వరకు ఈ హత్యకు సంబంధించి వ్యక్తిగత కక్ష కోణం లేనే లేదు. ఈ సమాచారం, ఆమెను చంపడానికి కారణం ఆమె భావాలు, తన ఆలోచనలను బహిరంగంగా వెల్లడించాలనే ఆమె సంకల్పమే అనే తార్కిక నిర్ధారణకు రావడానికి చక్కగా సరిపోతుంది. అయితే ఆమె హంతకులు, హత్య కుట్రదారులకు సంబంధించి ఈ సమాచారం కచ్చితమైన నిర్ధారణలకు చేర్చలేదు. అందువల్ల ఆ నేర పరిశోధనను చేయాల్సినది టీవీ స్టూడియోలలో ఎంత మాత్రమూ కాదు. అలా అని పోలీసులపై విశ్వాసం ఉంచాలని కాదు. కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది అధికారంలో ఉన్నాగానీ ఇలాంటి కేసుల్లో పోలీసు దర్యాప్తు నిర్లక్ష్యపూరితమైనదిగా ఉంటున్న మాట నిజమే. అయినాగానీ మనం దర్యాప్తును ముందే కాదన కూడదు. అ తర్వాత మనం దానిపై నిశిత పరిశీలన జరపవచ్చు. గౌరీ లంకేశ్ హత్యకు పథకం పన్నినది ఎవరో చెప్పే ఆధారాలు మనకు లేవుగానీ, ఆమె హత్యకు సంబరాలు చేసుకున్నవారు, దాన్ని సమర్థించినవారు ఎవరో చెప్పే ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి. కొన్ని గంటల క్రితమే హత్యకు గురైన ఆ మహిళ గురించి వెక్కిరింతలు, తిట్లు, నిందలతో కూడిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా మోత మోగిపోయింది. వాటిలో చాలా వరకు బాగా సుపరిచితమైన బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యాతలవే. వారిలో కొందరిని ప్రధాన మంత్రి అంతటివారే ఫాలో అవుతున్నారు. ఈ హత్య సందర్భంగా, ఈ దుష్ప్రచార కార్యక్రమానికి, తమకు సంబంధం లేదని చెప్పుకోవడం అధికార పార్టీకి కీలకమైనది. కానీ, ఒక్క రవిశంకర ప్రసాద్ తప్ప మరే సీనియర్ బీజేపీ నేతా అలా నిర్ద్వంద్వంగా మాట్లాడింది లేదు. అసహ్యకరమైన వ్యాఖ్యానాలను చేస్తున్నవారిని ప్రధాని ఇంతవరకు ‘అన్ ఫాలో’ చేయలేదు. సంఘ్ భావజాల ప్రత్యర్థుల వరస హత్యలు లంకేశ్ హత్యకు ముందు జరిగిన మూడు హత్యలు ఇదే భయానకమైన పద్ధతిలో పునరావృతం అయ్యాయని కూడా మనకు తెలుసు. 2013లో జరిగిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్య, మూఢ నమ్మకాలను వ్యతిరేకించే మరో ఉద్యమకారుడు కామ్రేడ్ గోవింద్ పన్సారే హత్య, వాటిని వెన్నంటి 2016లో జరిగిన విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గీ హత్య ఒకేవిధమైన పద్ధతిలో జరిగాయి. వీటిలో ప్రతి కేసులోనూ గుర్తు తెలియని హంతకులు సంఘ్ పరివార్ భావజాలానికి విరుద్ధమైన భావజాలాన్ని గలిగిన నిర్విరామ మేధో యోధులను కాల్చి చంపారు. ఇవేవీ మరేదో హింసా చర్యకు ప్రతీకారంగా జరిగిన హత్యలు కావు. రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించాలని చేసిన ప్రయత్నాలూ కావు. ఇవన్నీ ఒక భావాన్ని తుదముట్టించాలనే లక్ష్యంతో జరిగినవే. ఈ ముగ్గురు ‘హేతువాదులు’ ప్రచారం చేస్తున్నది ఏదో విపరీతపు ఆలోచన కాదు. ‘శాస్త్రీయ చింతన’ను పెంపొందింపజేయడం పూర్తిగా మన రాజ్యాంగబద్ధమైన ఆదర్శం. మన రాజ్యాంగానికి విరుద్ధమైన భావజాలం వారిని హత్య చేసింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తేనే, గౌరీ లంకేశ్ హత్య ఈ క్రమంలో సరిగ్గా ఇమిడి పోతుంది. ఆమె భావాలు, మిగతా ముగ్గురి భావాలు ఒక్కటి కాని మాట నిజమే. కానీ, ఆమె మద్దతుదార్లు, ఆమెను నిందించేవారు అంతా కూడా ఆమెను ‘వామపక్షవాది’గా భావించారు. ఆమె నక్సలైట్ అనే బాధ్యతారహితమైన మాట సైతం కొంత వినిపించింది. ఇదేదీ వాస్తవం కాదు. కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ మేధో సంప్రదాయానికి గౌరి ప్రాతినిధ్యం వహించారు. అది ఈ వర్గాలు వేటిలోనూ ఇమిడేది కాదు. ‘గౌరీ లంకేశ్ పత్రికె’ సంపాదకురాలిగా ఆమె తన తండ్రి పీ లంకేశ్ వారసత్వాన్ని కొనసాగించారు. ఆయన, కన్నడ సాహిత్యంలోని ‘నవ్య’ సాంప్రదాయానికి చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఒకరు. షిమోగాకు చెందిన ఈ ముగ్గురు రచయితలు, పీ లంకేశ్, పూర్ణచంద్ర తేజస్వి, యూఆర్ అనంతమూర్తి రామ్మనోహర్ లోహియా నుంచి ప్రేరణ పొందినవారు. దృÉý మైన కులవ్యతిరేక వైఖరిని సోషలిస్టు బ్రాండు రాజకీయాలు, సాంస్కృతికంగా వేళ్లూనుకుని ఉన్న లౌకికవాదాన్ని సమ్మిళితం చేశారు. తమ రచనలతో కర్ణాటకలోని ‘అభ్యుదయ’ కార్యకర్తలందరికీ ఉత్తేజాన్ని ఇచ్చిన దేవనార్ మహదేవ, సిద్ధలింగయ్య, డీఆర్ నాగరాజ్ వంటి తర్వాతి తరం కన్నడ మేధావులను వారు తీర్చిదిద్దారు. పరివార్‌ను భయపెట్టే లంకేశ్ లౌకికవాదం వారి సోషలిస్టు సాంప్రదాయం పేదలకు అనుకూలమైనది, సమానత్వవాదం అనే అర్థంలో ‘వామపక్షవాదం’. అయితే అది దాని సాంస్కృతిక ప్రాతిపదిక రీత్యా కమ్యూనిస్టు వామపక్షవాదం కంటే చాలా విభిన్నమైనది. ఈ సంప్రదాయం బసవన్న నాటి కాలం నుంచి వేళ్లూనికుని ఉన్న కన్నడ సమానత్వవాదంలో వేళ్లూనుకుని ఉన్నది. కొన్ని విషయాలలో గౌరి తమ తండ్రికంటే ఎక్కువగా సాంప్రదాయక వామపక్షవాది అయినా, ఆమె లౌకికవాదం మాత్రం ఈ సంప్రదాయపు కొనసాగింపే. తన తండ్రిలాగే ఆమె కూడా కన్నడంలోనే రాయాలని ఎంచుకున్నారు. సాంస్కృతికంగా వేళ్లూనుకున్న ఈ రూపంలోని లౌకికవాదం మన స్వాతంత్య్రోద్యమ కాలపు లౌకికవాద రూపానికి అనుగుణమైనది. ఈ సంప్రదాయం అంటేనే సంఘ్‌పరివార్ ఎక్కువగా భయపడుతుంది. ఈ రూపంలోని లౌకికవాదాన్ని ఈ నేలలో వేళ్లూనుకోనిదిగా, పాశ్చాత్య మేధోవాదంగా అది తోసిపారేయలేరు. నేటి శివశక్తుల కలయికను ఆపే యత్నమా? గౌరి పేరులోనే, హిందుత్వగా ఇప్పుడు మనకు అందిస్తున్నదానికి సవాలుంది. ఇది ఈ ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో దుర్గ, పార్వతి, భవానియర్గా కూడా పిలిచే ‘‘గౌరి’’ రాకను ఆహ్వానించే సమయం. ‘‘లంకేశ్’’ అంటేనే పరమ శివునికి పరమభక్తుడైన రావణుడు. గౌరీ లంకేశ్ పేరు శైవులలో ఉన్న రావణుని పూజించే సంప్రదాయాన్ని గుర్తుకుతెచ్చేదిగా ఉంటుంది. ఆ ఆచారం, ఏకరూపపైన హిందుత్వ బృహత్ లక్ష్యాన్ని భగ్నం చేస్తుంది. అలాంటప్పుడు, శరద్ మాసానికి (తెలుగు ఆశ్వయుజ మాసం) సరిగ్గా ముందు ఆమెను హతమార్చడం ద్వారా హంతకులు... శక్తిగా మహిళ ప్రవేశంచడాన్ని, మన కాలపు శివపార్వతుల కలయికను నివారించాలనే మరింత పెద్ద ప్రాజెక్టులో అనుకోకుండానే భాగస్వాములయ్యారా? గౌరీ లంకేశ్ భావమయ జీవితాన్ని గడిపారు. ఒక భావజాలం ఆమెను చంపడం అందుకు సరిగ్గా తగ్గట్టుగానే ఉంది. ఆ భావజాలం మన రాజ్యాంగానికి విరుద్ధమైనది, మన స్వాతంత్య్రోద్యమ విలువలను నిరాకరించేది, మన మేధో సాంప్రదాయలంటే భయపడేది, హిందూమతంలోని బహురూపాల శాఖలను తన అస్తిత్వానికి ముప్పుగా భావించేది. ఆమె మన కాలపు పాలక భావజాలం చేతిలో హత్యకు గురయ్యారు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ ఇండియా అధ్యక్షులు, జైకిసాన్ సంస్థ సభ్యులు మొబైల్ : 98688 88986