లౌకికవాద ఖడ్గధార గౌరీ లంకేష్‌ | Article On Gauri Lankesh In Sakshi | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 7 2018 1:00 AM | Last Updated on Fri, Sep 7 2018 1:00 AM

Article On Gauri Lankesh In Sakshi

సమాజం కోసం తమ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు చాలా అరుదు. వారిలో గౌరీ లంకేష్‌ ఒకరు. సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్‌ 5వ తేదీన అమానుషంగా హిందూత్వ శక్తులు హత్య చేశాయి. భిన్న భావజాలం కలిగిన వాళ్ళపైన దాడి చేయవచ్చునని, చంపవచ్చుననే హిందూత్వ రాజకీయాలు పట్టు సాధించినప్పటి నుంచి ఇలాంటి హత్యలు కొనసాగుతున్నాయి. ప్రొ‘‘ కల్బుర్గి, డా‘‘ నరేంద్ర, దబోల్కర్, గోవిందరావు పన్సారే లాంటి మేధావుల్ని హత్య చేశారు. హిందూత్వ మూకల అసత్య ప్రచారాలకు, ఉన్మాదానికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించినందుకే గౌరీ లంకేష్‌ బలయ్యారు. ‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌’ శీర్షికతో తన చివరి సంపాదకీయంలో అసత్యాల గుట్టును రట్టు చేశారు. గౌరీ కర్ణాటక రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛపైన, జీవించే హక్కుపైన దాడులు చేస్తున్న హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సమస్త ప్రజానీకాన్ని ఒకే తాటిపైకి తేవడానికి తన శక్తియుక్తులను దారపోశారు. దాన్ని హిందూత్వ ఫాసిస్టు మూకలు సహించలేక పోయాయి. అంతం చేయడానికి ప్లాన్‌ వేసి హత్య చేశాయి.  

గౌరీ ఆంగ్లంలో బాగా రాయగలిగిన పాత్రికేయురాలు. ఢిల్లీలోని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, సండే తదితర పత్రికల్లో పనిచేశారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని రాజకీయ నాయకుల వ్యవహారాలనూ, అవకతవకలను ఎండగట్టారు. తండ్రి పాల్యాద్‌ లంకేష్‌ మరణానంతరం అతను నడుపుతున్న లంకేష్‌ పత్రిక బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తండ్రి నిబద్ధతను పుణికిపుచ్చుకున్న గౌరీ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సమస్యల వేదికగా పత్రికను నడపడానికి చివరికంటా కృషి చేశారు. లంకేష్‌ వారపత్రికలో 850 సంపాదకీయ వ్యాసాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు, స్థానిక వైరుధ్యాలు, పుస్తక సమీక్షలు, జీవిత చరిత్రలతోపాటుగా హిందూత్వ ఏకశీల అఖండ భావనకు వ్యతిరేకంగా భిన్నజాతుల, భావాల సమాహారంగా ప్రజాస్వామిక విలువలకై రచనలు చేశారు. లౌకికవాదం, శాంతి యుత సహజీవనం, స్త్రీ, పురుష సమానత్వం అంశాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. మహిళల, ఆదివాసీల, దళితుల, మైనార్టీల హక్కుల గొంతుకగా ఉంటూ తన పత్రికను తీర్చిదిద్దారు. 

విప్లవోద్యమ రాజకీయాల గురించి 2004లో తన పాఠకులకు పరిచయం చేశారు. నక్సలైట్లు తుపాకులు ఎందుకు పట్టాల్సి వచ్చిందనే విషయంపై సాకేత్‌రాజన్‌ పెట్టిన అజ్ఞాత ప్రెస్‌మీట్‌కు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా హాజరయ్యారు. చర్చల ద్వారా పరిష్కారమయితే సాయుధ పోరాటం అవసరం ఉండదనే సాకేత్‌ రాజన్‌ సమాధానం గౌరీని ప్రభావితం చేసింది. దీనితో ‘‘శాంతి కోసం వేది క’’ను ఏర్పాటు చేసుకొని నక్సలైట్లతో చర్చించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆనాటి సీఎం ధరమ్‌సింగ్‌ కూంబింగ్‌ను ఆపివేసి, చర్చలకు ఆహ్వానిస్తానని చెప్పి.. ఆ మాట నిలబెట్టుకోలేదు. పైగా ప్రభుత్వం సాకేత్‌ రాజన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసింది. ఈ చర్యపై చలించిన గౌరి నిజాయితీలేని కాంగ్రెసు ప్రభుత్వంపై సంపాదకీయం రాశారు. గుజరాత్‌ ఉనా పోరాటంలో దళిత నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్‌ నేవాని, జేఎన్‌ యూలో కన్హయ్‌ కుమార్, ఉమర్‌ ఖలీద్‌ల మీద దాడులు, వీటికి వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనల్ని గమనించి భవిష్యత్‌ తరానికి వీరంతా నాయకత్వం వహించాల్సిన బాధ్యతలను వారికి గుర్తింపజేశారు. తన కొడుకులుగా వారిని ప్రకటించారు. ఆమె ప్రారంభించిన సంఘటిత కార్యక్రమాలను అడ్డగించేందుకు హిందూత్వ శక్తులు ఆమెను పాశవికంగా హత్య చేశాయి.  

ఈనాడు ప్రభుత్వం దళితుల, ఆదివాసీల, అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడుతున్న మేధావులను, ప్రజాస్వామిక వాదులను మోదీ హత్యకు కుట్రదారులుగా ప్రకటిస్తోంది. అడ్వొకేట్‌ సుధా భరద్వాజ్, గౌతమ్‌ నవలఖా, విరసం వరవరరావు, జర్నలిస్ట్‌ క్రాంతిలను కుట్రదారులుగా ప్రకటించి అక్రమ అరెస్టులకు పాల్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో గృహనిర్బంధంలో ఉన్న హక్కుల నేతలపై మహారాష్ట్ర పోలీసుల వాదనను విశ్వసించకుండా వారి గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు వారంరోజులు వాయిదా వేసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పేరుతో అందరి భావ ప్రకటన హక్కును కాలరాసే వైపు బీజేపీ ప్రభుత్వ పయనం కొనసాగుతోంది. అర్బన్‌ నక్సల్‌గా ప్రకటిస్తో్తంది. గౌరీ హత్యకు వ్యతిరేకంగా నాను గౌరీ అని నినదించిట్లే నేడు ‘‘నేను అర్బన్‌ నక్సల్‌’’ అంటూ వేలాదిమంది ప్రకటిస్తున్నారు. ఏ ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడారో అలాంటి విలువల కోసం నిలబడిన మేధావులను ప్రజలతో వేరు చేసి బంధించాలని చూస్తోంది. అలాంటి ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటమే గౌరీ లంకేష్‌కు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి.


జి.ఝాన్సీ
వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, పి.ఓ.డబ్ల్యూ
మొబైల్‌ : 94907 00942

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement