POW
-
లౌకికవాద ఖడ్గధార గౌరీ లంకేష్
సమాజం కోసం తమ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళు చాలా అరుదు. వారిలో గౌరీ లంకేష్ ఒకరు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్ 5వ తేదీన అమానుషంగా హిందూత్వ శక్తులు హత్య చేశాయి. భిన్న భావజాలం కలిగిన వాళ్ళపైన దాడి చేయవచ్చునని, చంపవచ్చుననే హిందూత్వ రాజకీయాలు పట్టు సాధించినప్పటి నుంచి ఇలాంటి హత్యలు కొనసాగుతున్నాయి. ప్రొ‘‘ కల్బుర్గి, డా‘‘ నరేంద్ర, దబోల్కర్, గోవిందరావు పన్సారే లాంటి మేధావుల్ని హత్య చేశారు. హిందూత్వ మూకల అసత్య ప్రచారాలకు, ఉన్మాదానికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించినందుకే గౌరీ లంకేష్ బలయ్యారు. ‘అబద్ధాల ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్’ శీర్షికతో తన చివరి సంపాదకీయంలో అసత్యాల గుట్టును రట్టు చేశారు. గౌరీ కర్ణాటక రాష్ట్రంలో భావ ప్రకటనా స్వేచ్ఛపైన, జీవించే హక్కుపైన దాడులు చేస్తున్న హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సమస్త ప్రజానీకాన్ని ఒకే తాటిపైకి తేవడానికి తన శక్తియుక్తులను దారపోశారు. దాన్ని హిందూత్వ ఫాసిస్టు మూకలు సహించలేక పోయాయి. అంతం చేయడానికి ప్లాన్ వేసి హత్య చేశాయి. గౌరీ ఆంగ్లంలో బాగా రాయగలిగిన పాత్రికేయురాలు. ఢిల్లీలోని టైమ్స్ ఆఫ్ ఇండియా, సండే తదితర పత్రికల్లో పనిచేశారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని రాజకీయ నాయకుల వ్యవహారాలనూ, అవకతవకలను ఎండగట్టారు. తండ్రి పాల్యాద్ లంకేష్ మరణానంతరం అతను నడుపుతున్న లంకేష్ పత్రిక బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తండ్రి నిబద్ధతను పుణికిపుచ్చుకున్న గౌరీ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సమస్యల వేదికగా పత్రికను నడపడానికి చివరికంటా కృషి చేశారు. లంకేష్ వారపత్రికలో 850 సంపాదకీయ వ్యాసాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు, స్థానిక వైరుధ్యాలు, పుస్తక సమీక్షలు, జీవిత చరిత్రలతోపాటుగా హిందూత్వ ఏకశీల అఖండ భావనకు వ్యతిరేకంగా భిన్నజాతుల, భావాల సమాహారంగా ప్రజాస్వామిక విలువలకై రచనలు చేశారు. లౌకికవాదం, శాంతి యుత సహజీవనం, స్త్రీ, పురుష సమానత్వం అంశాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. మహిళల, ఆదివాసీల, దళితుల, మైనార్టీల హక్కుల గొంతుకగా ఉంటూ తన పత్రికను తీర్చిదిద్దారు. విప్లవోద్యమ రాజకీయాల గురించి 2004లో తన పాఠకులకు పరిచయం చేశారు. నక్సలైట్లు తుపాకులు ఎందుకు పట్టాల్సి వచ్చిందనే విషయంపై సాకేత్‌రాజన్ పెట్టిన అజ్ఞాత ప్రెస్‌మీట్‌కు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా హాజరయ్యారు. చర్చల ద్వారా పరిష్కారమయితే సాయుధ పోరాటం అవసరం ఉండదనే సాకేత్ రాజన్ సమాధానం గౌరీని ప్రభావితం చేసింది. దీనితో ‘‘శాంతి కోసం వేది క’’ను ఏర్పాటు చేసుకొని నక్సలైట్లతో చర్చించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆనాటి సీఎం ధరమ్‌సింగ్ కూంబింగ్‌ను ఆపివేసి, చర్చలకు ఆహ్వానిస్తానని చెప్పి.. ఆ మాట నిలబెట్టుకోలేదు. పైగా ప్రభుత్వం సాకేత్ రాజన్‌ను ఎన్కౌంటర్ చేసింది. ఈ చర్యపై చలించిన గౌరి నిజాయితీలేని కాంగ్రెసు ప్రభుత్వంపై సంపాదకీయం రాశారు. గుజరాత్ ఉనా పోరాటంలో దళిత నాయకుడిగా ఎదిగిన జిగ్నేష్ నేవాని, జేఎన్ యూలో కన్హయ్ కుమార్, ఉమర్ ఖలీద్‌ల మీద దాడులు, వీటికి వ్యతిరేకంగా జరుపుతున్న ఆందోళనల్ని గమనించి భవిష్యత్ తరానికి వీరంతా నాయకత్వం వహించాల్సిన బాధ్యతలను వారికి గుర్తింపజేశారు. తన కొడుకులుగా వారిని ప్రకటించారు. ఆమె ప్రారంభించిన సంఘటిత కార్యక్రమాలను అడ్డగించేందుకు హిందూత్వ శక్తులు ఆమెను పాశవికంగా హత్య చేశాయి. ఈనాడు ప్రభుత్వం దళితుల, ఆదివాసీల, అణగారిన వర్గాల హక్కుల కోసం మాట్లాడుతున్న మేధావులను, ప్రజాస్వామిక వాదులను మోదీ హత్యకు కుట్రదారులుగా ప్రకటిస్తోంది. అడ్వొకేట్ సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, విరసం వరవరరావు, జర్నలిస్ట్ క్రాంతిలను కుట్రదారులుగా ప్రకటించి అక్రమ అరెస్టులకు పాల్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో గృహనిర్బంధంలో ఉన్న హక్కుల నేతలపై మహారాష్ట్ర పోలీసుల వాదనను విశ్వసించకుండా వారి గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు వారంరోజులు వాయిదా వేసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పేరుతో అందరి భావ ప్రకటన హక్కును కాలరాసే వైపు బీజేపీ ప్రభుత్వ పయనం కొనసాగుతోంది. అర్బన్ నక్సల్‌గా ప్రకటిస్తో్తంది. గౌరీ హత్యకు వ్యతిరేకంగా నాను గౌరీ అని నినదించిట్లే నేడు ‘‘నేను అర్బన్ నక్సల్’’ అంటూ వేలాదిమంది ప్రకటిస్తున్నారు. ఏ ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడారో అలాంటి విలువల కోసం నిలబడిన మేధావులను ప్రజలతో వేరు చేసి బంధించాలని చూస్తోంది. అలాంటి ప్రభుత్వ ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటమే గౌరీ లంకేష్‌కు మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి. జి.ఝాన్సీ వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, పి.ఓ.డబ్ల్యూ మొబైల్ : 94907 00942 -
అవి హిందుత్వ కుట్రలే
హైదరాబాద్: నాలుగు దశాబ్దాలుగా సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎందరో మహిళలకు అండగా ఉంటున్న ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్యపై సోషల్ మీడియాలో దాడులు హిందుత్వ కుట్రేనని విరసం నేత వరవరరావు విమర్శించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులను నిరసిస్తూ గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ దాడుల వెనకాల మోదీ ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులు, అశ్లీల మాటలను పోలీసులు సైబర్ నేరం కింద పరిగణించకపోవటాన్ని బట్టి ఈ వ్యవస్థ ఎవరి అధీనంలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ను హత్య చేశారని, సంధ్య, సూరెపల్లి సుజాత, దేవి వంటి సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగాప్రజల హక్కులను కాలరాస్తున్నారని, స్వామి అగ్నివేశ్‌పై దాడి చేయటం దుర్మార్గమని ప్రొఫెసర్ రమా మెల్కొటే అన్నారు. రేటింగుల కోసం దేవి, సంధ్యలను చానళ్లు పిలుస్తాయే తప్ప, వారిపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవని దేవి విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ‘ఆంధ్రజ్యోతి’ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. రాజ్యం తనపై ఎన్నోసార్లు దాడులు చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే తన ఉద్యోగాన్ని సైతం తీసేశారని సంధ్య గుర్తుచేశారు. దాడులు, అణచివేతలు కొత్త కాదని, హిందుత్వ కుట్రలను సైతం ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సామాజిక కార్యకర్త సజయ, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మణ్, టఫ్ అధ్యక్షురాలు విమల, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మహిళలపై జరుగుతున్నదాడులను అరికట్టాలి
ఖమ్మంమయూరిసెంటర్ : సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చిన్నారులపై, బాలికలపై, మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని నివారించే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జి.లలిత అన్నారు. బుధవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లలిత మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, బీజేపీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అశ్లీల సాహిత్యాన్ని పెంచిపోషిస్తున్న వారికి ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తున్నాయని, మహిళలపై దాడులు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 25వ తేదీన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పీవైఎల్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శులు కె.శ్రీనివాస్, సీహెచ్ శిరోమణి, నాయకులు ఝాన్సీ, మంగతాయి, ఎం.జగన్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణాలను తొలగించండి: పీవోడబ్ల్యూ
ముషీరాబాద్(హైదరాబాద్‌సిటీ): రహదారులపై మద్యం షాపులను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డిమాండ్ చేసింది. గురువారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీవోడబ్ల్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి, ఝాన్సి మాట్లాడుతూ... రహదారులకు 500మీటర్ల దూరంలో షాపులకు అనుమతి ఇవ్వరాదని, మార్చి వరకు రహదారులపైన ఉన్న మద్యం షాపులను అన్నింటిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఆదాయం కోసమే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రహదారుల వెంబడి, బస్టాప్‌ల పక్కనే గత ఆగస్ట్ నెలలో ప్రభుత్వం అనేక మద్యం షాపులకు అనుమతులిచ్చిందని ధ్వజమెత్తారు. రక్తమోడుతున్న రహదారుల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయని, స్త్రీలపై హింస పెరుగుతుందని అన్నారు. అనంతరం సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్‌కు వినతిపత్రం సమర్పించారు. -
నేటి నుంచి పీవోడ బ్ల్యూ రాష్ట్ర 6వ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర 6వ మహాసభలు శనివారం నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్నాయి. శనివారం ఉదయం 11 గంట లకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకూ 10 వేల మంది మహిళలతో భారీ ప్రదర్శన జరుగుతుంది. అనంతరం జరిగే బహిరంగ సభలో మాజీ ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు టాన్యా, విప్లవ ప్రజా రచయిత విమల, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ ప్రసంగిస్తారు. 2న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ప్రారంభోపన్యాసం, అనంతరం విద్యా గోష్ఠి ఉంటుంది. 3న ప్రతినిధుల మహాసభ జరుగనుంది.