మాట్లాడుతున్న లలిత
ఖమ్మంమయూరిసెంటర్ : సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చిన్నారులపై, బాలికలపై, మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని నివారించే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జి.లలిత అన్నారు. బుధవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లలిత మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, బీజేపీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అశ్లీల సాహిత్యాన్ని పెంచిపోషిస్తున్న వారికి ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తున్నాయని, మహిళలపై దాడులు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని పేర్కొన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 25వ తేదీన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పీవైఎల్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శులు కె.శ్రీనివాస్, సీహెచ్ శిరోమణి, నాయకులు ఝాన్సీ, మంగతాయి, ఎం.జగన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment