మద్యం దుకాణాలను తొలగించండి: పీవోడబ్ల్యూ
ముషీరాబాద్(హైదరాబాద్‌సిటీ): రహదారులపై మద్యం షాపులను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) డిమాండ్ చేసింది. గురువారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పీవోడబ్ల్యూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి, ఝాన్సి మాట్లాడుతూ... రహదారులకు 500మీటర్ల దూరంలో షాపులకు అనుమతి ఇవ్వరాదని, మార్చి వరకు రహదారులపైన ఉన్న మద్యం షాపులను అన్నింటిని ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు.
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఆదాయం కోసమే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రహదారుల వెంబడి, బస్టాప్‌ల పక్కనే గత ఆగస్ట్ నెలలో ప్రభుత్వం అనేక మద్యం షాపులకు అనుమతులిచ్చిందని ధ్వజమెత్తారు. రక్తమోడుతున్న రహదారుల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయని, స్త్రీలపై హింస పెరుగుతుందని అన్నారు. అనంతరం సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్‌కు వినతిపత్రం సమర్పించారు.