స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్‌ఎస్‌ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు.
► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి!
► బీజేపీ, కాంగ్రెస్‌లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా!
► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ రెండో సర్‌సంఘ్‌చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు.
► ఆర్‌ఎస్‌ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు.
► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్‌పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది.
► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి.
► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్‌స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్‌ఎస్‌ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్‌ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు!
► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్‌గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు.
► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కంచె ఐలయ్య షెపర్డ్
– వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment