భిన్నత్వంలో ఏకత్వమే రక్ష! | Unity In diversity is salvation RSS Mohan Bhagwat | Sakshi
Sakshi News home page

భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!

Published Mon, Aug 15 2022 12:45 AM | Last Updated on Mon, Aug 15 2022 12:50 AM

Unity In diversity is salvation - Sakshi

నేటితో భారత్‌ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. 

ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్‌ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్‌ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. 

విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. 

స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘చిత్త్‌ జేథా భయశూన్య ఉన్నత్‌ జతో శిర్‌’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్‌ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్‌ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్‌ స్వరాజ్‌’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. 

భారత్‌ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది.

కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. 

ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. 

కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి.  రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. 


డా. మోహన్‌ భాగవత్‌

వ్యాసకర్త సర్‌ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement