చిన్న నగరాలే శ్రేయస్కరం | Kancha Ilaiah Writes Guest Column About Telangana Secretariat | Sakshi
Sakshi News home page

చిన్న నగరాలే శ్రేయస్కరం

Published Wed, Jul 15 2020 12:51 AM | Last Updated on Wed, Jul 15 2020 1:06 AM

Kancha Ilaiah Writes Guest Column About Telangana Secretariat - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటినుంచి, రాజధానుల వికేంద్రీకరణపై చర్చ సాగు తూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సచివాలయ భవంతుల కూల్చివేత కార్యక్రమం మొదలెట్టినందున తెలంగాణలోనూ శాసన రాజధానిని వరంగల్‌కి మార్చడం భేషైన పని. కేసీఆర్‌ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తే దేశవ్యాప్తంగా ఇది చర్చకు తావిస్తుంది. భారతీయ నగరాల్లో జనాభా సాంద్రీకరణ విపరీతంగా చోటు చేసుకోవడానికి ఒకే రాజధాని భావనతో సాగిన అభివృద్ధే కారణం. చిన్ననగరాలే ఇకముందు ప్రపంచానికి శ్రేయస్కరం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌ని శాసన రాజధానిగా నెలకొల్పడం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. వరంగల్‌లో అసెంబ్లీని ఏర్పాటు చేయడం గురించి కేసీఆర్‌ గతంలోనే ప్రతిపాదించారు కాబట్టి ప్రభుత్వం పూనుకంటే ఇదేమంత అసాధ్యమైన పని కాదు.

అమరావతిని శాసన రాజధానిగా, విశాఖ పట్నంని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధాని గురించి ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర రాజధానులు, చివరకు దేశ రాజధాని కూడా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పర్చాలా వద్దా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరుతోసహా దేశంలోని మహానగరాలలో కోట్లాది ప్రజలు కోవిడ్‌–19 క్రమంలో భయంకరమైన హింసలకు, కడగండ్లకు గురికావడాన్ని చూశాక, మన రాజధానులను ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నెలకొల్పడమే మంచిదని నేను భావించాను.  దాదాపుగా మన ప్రధాన నగరాలన్నీ భారీ స్థాయిలో జనం కేంద్రీకృతమై నివసించాల్సిన రీతిలో అభివృద్ధి చెందాయి. ఇలా జనాభా భారీగా కేంద్రీకరించిన జోన్లలోనే పారిశ్రామిక, సంస్థాగతమైన క్లస్టర్ల అభివృద్ధి కూడా జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ఒకే రాజధాని భావనవల్లే మన నగరాల్లో జనాభా సాంద్రీకరణ విపరీతమైంది. 

కోవిడ్‌ అనంతర భారతదేశం కానీ, తక్కిన ప్రపంచం కానీ తమ నగరాభివృద్ధి నమూనాలపై పునరాలోచించక తప్పదు. అవాంఛితమైన జనారణ్యాలు, అధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోయే మురికివాడలు లేకుండా, మన పిల్లలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం పొందాలంటే మన అభివృద్ధి నమూనాను మళ్లీ పరిశీలించుకోవడం తప్పనిసరి. ఇప్పటికే కరోనా వైరస్‌ ప్రబల వ్యాప్తి కారణంగా చిన్న పట్ణణాలు, గ్రామాల్లో కొత్త జీవితం గడపడానికి లక్షలాదిమంది ప్రజలు మహానగరాల నుంచి తరలిపోవడం ప్రారంభించారు. పాలనా యంత్రాంగాలను, ఇతర ప్రభుత్వ కార్యకలాపాలను వికేంద్రీకరించడం వల్ల భవిష్యత్తులో సాంక్రమిక వ్యాధుల నిరోధానికి చక్కగా ఉపయోగపడుతుంది.

హైదరాబాద్‌ వంటి అధిక జనసాంద్రత కలిగిన నగరాలపై సాంక్రమిక వ్యాధి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనందరికీ తెలుసు. ఒక ప్రాణాంతక వైరస్‌ దాడి చేయగానే ప్రసిద్ధిగాంచిన మన మెట్రో రైల్‌ వ్యవస్థలు, ప్రజా రవాణా వ్యవస్థలు తామెందుకూ పనికిరామని ఇప్పటికే నిరూపించేసుకున్నాయి. వికేంద్రీకరణ జరిగిన వరంగల్‌ వంటి చిన్న పట్టణాల్లో సైకిళ్లు, మోటార్‌ సైకిళ్లు కూడా వ్యక్తిగత రవాణాకు ఉపయోగపడటం చూస్తున్నాం.

తెలంగాణలో కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చిరకాలం మనగలిగిన సచివాలయ భవంతులను కూల్చి వేసే కార్యక్రమం మొదలుపెట్టింది. సచివాలయ భవంతి నిర్మాణం కోసం కొత్త నమూనాను ప్రజ లకు అందుబాటులో ఉంచింది. నిజానికి ఈ కొత్త నమూనా చూడ్డానికి బాగానే ఉంది. పైగా బహుళ సంస్కృతి నిర్మాణ శైలులను కలిగి ఉంది. అయితే రూపురేఖలు ఎలా ఉన్నా కొత్త సచివాలయాన్ని నిర్మించడం మాత్రం ఖాయం. అదే సమయంలో చరిత్రాత్మకమైన అసెంబ్లీ భవన నిర్మాణం సాంస్కృతిక కళాఖండంగా ఉన్నందున దీన్ని నిర్మూలించకూడదు. పబ్లిక్‌ గార్డెన్‌ని కూడా కలిగిన ఈ మొత్తం ప్రాంతాన్ని చెక్కుచెదరకుండా అలానే ఉంచాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో చక్కగా వృద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నూతన అసెంబ్లీ భవనాన్ని తప్పకుండా వరంగల్‌లోనే నిర్మించడం చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి. 

ఇప్పుడు వరంగల్‌ని శాసన రాజధానిగా ఎందుకు చేయాలి? ఎందుకంటే హైదరాబాద్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించడం అనేది ఇప్పుడొక నిర్ధారిత అంశం. తెలంగాణకే సాంస్కృతిక భవంతిగా ఉన్న హైకోర్టు భవనం నిజాం గత చరిత్రకు, నూతనంగా రూపుదిద్దుకున్న రాష్ట్రానికి మధ్య అనుసంధానంగా ఉంది కాబట్టి హైదరాబాద్‌ నుంచి న్యాయ రాజధానిని తరలించడం సాధ్యపడదు. కాబట్టి ఉన్న ఏకైక అవకాశం ఏదంటే శాసనసభ నిర్మాణాన్ని వరంగల్‌కి తరలించడమే. ఇది తెలంగాణ సమ్మక్కను, కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సంవత్సరానికి మూడు నాలుగుసార్లు శాసనసభా వ్యవహా రాలు నడుస్తాయి కాబట్టి, ముఖ్యమంత్రి, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడే విడిది చేస్తారు కాబట్టి వరంగల్‌ను తెలంగాణ శాసన రాజధానిగా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం.

కొత్తగా నిర్మించే చక్కటి శాసనసభా భవంతి, సీఎం కార్యాలయం, కేబినెట్‌ మంత్రుల కార్యాలయాలు వరంగల్‌ నుంచే పనిచేయాల్సి ఉంటుంది. పైగా సంవత్సరంలో కొంత కాలమైనా మొత్తం పాలనా యంత్రాంగం వరంగల్‌ వంటి ఒక చిన్న నగరంలో ఉండగలిగితే, అక్కడ భారీ పెట్టుబడులకు, అభివృద్ధికి వనరుగా, ప్రోత్సాహకంగా ఉంటుంది.

కార్యనిర్వాహక వర్గం, రాజకీయనేతలు ఆ నగరంలో విడిది చేయగలిగితే వారితో భేటీ కావడానికి భారతీయ, విదేశీ పెట్టుబడిదారులు, రాజకీయ, సాంస్కృతిక ప్రతినిధులు అక్కడికి వస్తారు. దీనివల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతుంది. వరంగల్‌ ఇప్పటికే విమానయానంతో ముడిపడి ఉంది. దాని విమానాశ్రయ అనుసంధానాలను మెరుగుపరిస్తే చాలు. అలాగే శరవేగంతో నడిచే రైళ్లు, బస్సుల కనెక్టివిటీ కూడా మెరుగుపర్చాలి. ఇక ఈ నగరం చుట్టూ ఉండే రామప్ప, లక్డవరం, పాకాల్, వరంగల్‌ కోట, సమ్మక్క అటవీ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం తన రాజధానిని కూడా వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకుంటే, ఈ అంశంపై ఇప్పటికే జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. 

మెట్రోపాలిటిన్‌ నగరాలను వికేంద్రీకరించి జనాభా ఒకే చోట గుమికూడకుండా చర్యలు తీసుకోవడం అనేది కోవిడ్‌ అనంతర ప్రపంచంలో ఒక అనివార్య ధోరణిగా మారక తప్పదు. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ కోటి జనాభా ఉన్న చైనాలోని వూహాన్‌ నగరం నుంచి శరవేగంగా విమాన ప్రయాణాల ద్వారా ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రపంచంలో ఎన్నో వైరస్‌లు పుట్టుకొచ్చాయి కానీ అవేవీ కోవిడ్‌–19 అంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించలేకపోయాయి. ప్రపంచ నగరాల మెట్రోపాలిటిన్‌ స్వభావమే ఈ శరవేగ వ్యాప్తికి కారణం. తెలంగాణలో ఒక సామెత ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? మన నగరాలు మృత్యు బేహారిలుగా మారుతున్న విపత్కర పరిణామానికి ఏకైక పరిష్కారం ఆ నగరాల జనాభాను తగ్గించేయడమే. అదే సమయంలో ఆ నగరాల పారిశ్రామిక వృద్ధి, పురోగతి విషయంలో రాజీ పడకూడదు.

ఒక మహానగరం చుట్టూ మొత్తం పాలనా, శాసన, న్యాయ, పారిశ్రామిక, విద్యాసంస్థల అభివృద్ధి మండలాలను పేర్చుకుంటూ పోవడం అంటే భారీ ఎత్తున వలస కార్మికులను తీసుకురావాల్సి ఉంటుంది. ఆస్కార్‌ అవార్డు గెల్చుకున్న స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌  సినిమా మన నగరాల్లోని మురికివాడల భయానకమైన కఠిన వాస్తవాన్ని అద్దం పట్టి చూపించింది. ఇప్పుడు కోవిడ్‌–19 కట్టడికి లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో మనుగడ కోసం భారతీయ నగరాలకు తరలివచ్చి కిక్కిరిసి ఉంటున్న వలస కార్మికులకు మెట్రోపాలిటిన్‌ చేదు వాస్తవం స్పష్టంగా కనిపించింది. నెలలతరబడి భయంకర కష్టాలను భరిస్తూ కోట్లాదిమంది వలస కార్మికులు నగరాలనుంచి తమతమ గ్రామాలకు కాలినడకన తరలిపోయారు. సంస్థలను, పాలనాయంత్రాంగ నిర్మాణాలను, పరిశ్రమలను వికేంద్రీకరించడం అనే భవిష్యత్తు దార్శనికత మాత్రమే ఇలాంటి దుర్భర పరిస్థితిని మార్చివేయగలదు.

వరంగల్‌ని శాసన రాజధానిగా నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ప్రస్తుతం ఏపీ రాజధాని విషయంలో జరుగుతున్నతీరులో తెలంగాణలో దానికి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చు. బీజేపీతో సహా ప్రతిపక్షాలు అలాంటి నిర్ణయానికి మద్దతు తెలుపవచ్చు. నిజానికి గడచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజధానుల్లో ఎలాంటి నగరాలు ఏర్పడాలి అనే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు. సచివాలయ నిర్మాణం కొనసాగనున్నందున, వరంగల్‌లో శాసన రాజధానికి చెందిన మౌలిక వ్యవస్థలను కూడా వృద్ధి చేయడాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాలి. ఒకసారి సిద్ధమయ్యాక శాసన కార్యకలాపాలు వరంగల్‌ నుంచే మొదలవుతాయి. అప్పటివరకు శాననాల రూపకల్పన వంటి పనులు హైదరాబాద్‌ నుంచే చేయవచ్చు. కేవలం తెలంగాణ ప్రయోజనాల రీత్యా మాత్రమే కాకుండా మొత్తం జాతి ప్రయోజనాల రీత్యా కూడా ఈ కోణంలో కేసీఆర్‌ ఒక కొత్త ట్రెండ్‌ను ఏర్పర్చడానికి ఇప్పుడు ఎనలేని ప్రాముఖ్యత ఉంది.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త డైరెక్టర్,
సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement