
సాక్షి, హైదరాబాద్: రచయిత అయిన తనపై ఆర్యవైశ్యులతో కలిసి బీజేపీ తీవ్రంగా దాడి చేస్తోందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అన్యాయం జరిగినప్పుడు ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం టీమాస్ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్ జాన్‌వెస్లీ, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో న్యాయవ్యవస్థను, పోలీసులను, రాజ్యాంగాన్ని బీజేపీ పనిచేయనివ్వడం లేదని విమర్శించారు. బీజేపీ చుట్టూ ఉన్న రచయితలు ప్రజల సమస్యలపై, దళితులు, గిరిజనుల సమస్యలపై రచనలు చేయడం లేదన్నారు.
బీజేపీ మానవ సమానత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. టీమాస్ తరఫున రైతుల సమస్యల గురించి, వారిని దోచుకుంటున్న వ్యాపారవర్గం అక్రమాల గురించి మాట్లాడుతున్నామని చెప్పారు. బీజేపీ దోపీడీ వర్గం పక్షాన నిలబడి, రైతులు, దళితులు, మైనార్టీలకు అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. కోరుట్లలో టీ మాస్ కార్యాలయంలో తాను మీడియాతో మాట్లాడుతుండగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కోరుట్ల న్యాయస్థానంలో ఐలయ్య గోబ్యాక్, అడ్డంగా నరుకుతాం అంటూ నినాదాలు చేశారని తెలిపారు. కంచె ఐలయ్యపై జరిగిన దాడిపై డీజీపీని కలిశామని, ప్రభుత్వం ఆయనకు పూర్తి రక్షణ కల్పించాలని టీమాస్ కన్వీనర్ జాన్‌వెస్లీ కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి దాడులను అరికట్టకట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కోరుట్ల కోర్టు వద్ద ఐలయ్యపై దాడికి పాల్పడ్డవారిపై కేసునమోదు చేసి, అరెస్టు చేయాలని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment