మార్పును ప్రతిబింబిస్తున్న పుస్తకాలు | Kancha Ilaiah Article On AP Government Text Books | Sakshi
Sakshi News home page

మార్పును ప్రతిబింబిస్తున్న పుస్తకాలు

Published Sat, Aug 29 2020 1:53 AM | Last Updated on Sat, Aug 29 2020 1:53 AM

Kancha Ilaiah Article On AP Government Text Books - Sakshi

భాషాభివృద్ధిలో ప్రధాన సమస్య ఏదంటే, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించే కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు సుసంపన్నం కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్‌ ఇమేజ్‌ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్‌ ఎంత సులభమో అటు విద్యార్థులు,ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్‌ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త విప్లవాత్మకమైన విద్యా పథకంతో ముందుకొచ్చింది. రెండుభాషల్లోనూ మిర్రర్‌ ఇమేజ్‌ అని చెబుతున్న స్కూల్‌ పుస్తకాలను ప్రచురించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రంలో స్కూలు పుస్తకాలని ఇంగ్లిష్, తెలుగు పాఠాలు పక్కపక్కనే ఉండేలా ప్రచురించనున్నారు. రెండు భాషల్లో ఒకే చోట పాఠాన్ని ప్రచురించడం ద్వారా ఒక భాషగా తెలుగు కంటే ఇంగ్లిష్‌ ఎంత సులభమో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులూ అర్థం చేసుకోగలరు. భారతీయ భాషల్లో కంటే అక్షరాలు, వాక్య నిర్మాణం రీత్యా ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం చాలా సులభమని వీరు గ్రహిస్తారు. దేశభాషలందు తెలుగు లెస్స అంటూ వీరాలాపన చేసే ఘనాపాఠీలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు సులువుగా పలికడానికి తగినట్లుగా తెలుగు రాత లిపిని మెరుగుపర్చడంపై ఎన్నడూ దృష్టిపెట్టలేదు. తెలుగు పుస్తకాల్లో రాతరూపంలోని పాఠం ఉత్పత్తి క్షేత్రాల్లో పరస్పరం మాట్లాడుకునే తెలుగు భాషకు సంబంధించినదిగా ఉండదు. పొలం దున్నేటప్పుడు, పంట కోసేటప్పుడు, ఇంట్లోనూ, బయట ఆహార ధాన్యాలను నిల్వచేసేటప్పుడు, ప్రజలు తమకు తెలి సిన ప్రజాభాషలోనే మాట్లాడతారు. కానీ పుస్తకాల్లో రాత పండిత భాషలో ఉంటుంది. చివరకు బ్రాహ్మణ (పురుషులు మాత్రమే పండితులుగా పేరొందుతారు) ఇళ్లలో కూడా సంస్కృతాన్ని మహిళల గృహ, వంటింటి భాషగా అనుమతించలేదు. ఒక్కసారి ఇలాంటి కృతక భాషను తెలుగు అక్షరాల్లోకి దూర్చి ఉత్పాదక వర్గాలపై బలవంతంగా రుద్దినప్పుడు అసలు తప్పు వాస్తవ రూపం దాలుస్తుంది.

ఉత్పత్తి క్షేత్రాల్లోనే వికసించిన ఇంగ్లిష్‌
సరిగ్గా ఇంగ్లిష్‌ దీనికి వ్యతిరేక దిశలో పరిణమించింది. 14వ శతాబ్ది చివరివరకు ఇంగ్లిష్‌ అనేది ఇంగ్లండ్‌లోని రైతుల భాషగా ఉండి చర్చీల్లో ఉపయోగించడానికి అనుమతించేవారు కాదు. చివరకు ఆంగ్లికన్‌ చర్చీలలో కూడా గ్రీకు, లాటిన్‌ భాషలనే దైవ భాషలుగా ఆమోదించారు. ఇంగ్లిష్‌ ఉత్పత్తి క్షేత్రాల్లో పరిణమించి, అభివృద్ధి చెంది తర్వాత పుస్తక భాషగా మారింది. రైతులు మాట్లాడే భాష దేవుని ప్రార్థించే భాషగా మారినప్పుడే, ఇంగ్లిష్‌ అటు ప్రింట్, ఇటు మాట్లాడే రూపాల్లో సుసంపన్నంగా మారిపోయింది. ఇంగ్లిష్, జర్మన్, ఫ్రెంచ్‌ వంటి యూరోపియన్‌ భాషలను ప్రార్థనా భాషలుగా ఆమోదించినప్పుడు మాత్రమే యూరప్‌ రైతులు, శ్రామికులు ఈ భాషలను చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఇది యూరప్‌ రైతాంగ జీవితంలోనే అతిపెద్ద విప్లవాత్మక పరిణామం అయి కూర్చుంది. ఒక భాషను పవిత్రమైనదిగా ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ భాష అభివృద్ధి చెందే క్రమం పూర్తిగా మారిపోతుంది. అదే హిందూ మతంకేసి చూస్తే తెలుగు కానీ మరే ఇతర భాషలు కానీ నేటికీ అతిపెద్ద ఆలయాల్లో కూడా దైవాన్ని ప్రార్థించే భాషగా ఉండవనేది స్పష్టాతిస్పష్టం. ఇది తెలుగును మొదటినుంచీ అభివృద్ధి చెందకుండా నిరోధించిన మరొక ప్రతికూల అంశంగా ఉండిపోయింది.
భాషాభివృద్ధిలో మరొక ప్రధాన సమస్య ఏదంటే, వికసిస్తున్న ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని సులువుగా వ్యక్తీకరించగల కొత్త పదజాలాన్ని స్వీకరించడమే. భాషలోని అక్షరాలను సరళతరం చేయకపోతే, ఉత్పాదక క్షేత్రాల్లో విరివిగా ఉపయోగించే పదాలను స్వీకరించకపోతే, పుస్తక భాషలో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన పదాలను చొప్పించకపోతే, తెలుగు çసుసంపన్నం కాదు, కాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న మిర్రర్‌ ఇమేజ్‌ తరహా పుస్తకాల ద్వారా ఎదిగే తరాలు తెలుగుని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయగలవు.

సెమిస్టర్‌ ఒక కొత్త అనుభవం
ఆలస్యంగా మొదలవుతున్న ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెమినార్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనుంది. పాఠశాల విద్యా స్థాయిలోనే సెమిస్టర్‌ మోడల్‌ను ప్రవేశపెట్టడం అనేది భారతీయ పాఠశాల విద్యా చరిత్రలోనే మొట్టమొదటిది. ఒక సంవత్సరంలో పిల్లల పురోగతిని రెండు అసెస్‌మెంట్ల ద్వారా లెక్కించడం వల్ల పిల్లలు తమపై అంచనా ప్రక్రియను చాలా సులభంగా నిర్వహించగలరు. అందుకే ఇది దీర్ఘకాలంలో చాలా సానుకూల ఫలితాలను అందిస్తుంది. నిజానికి దీన్ని పాఠశాల విద్యలో యూరో– అమెరికనేతర మోడల్‌గా చెప్పవచ్చు. పైగా ఇదొక విలువైన ప్రయత్నం కూడా. యూరో అమెరికన్‌ నమూనా తరహాలో భారత్‌లో ఏ స్థాయిలో కూడా పిల్లలు ఐపాడ్‌ వంటి రూపంలో సాఫ్ట్‌ బుక్స్‌ (ప్రింట్‌ పుస్తకాలు కాకుండా డిజిటల్‌ రూపంలో చదవగలగడం) చదివే అలవాటును మన పాఠశాల విద్య ఇంతవరకు అభివృద్ది చెందించలేదు. పుస్తకాల బరువును తగ్గించడం నేటి విద్యావిధాన లక్ష్యం.  ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మిర్రర్‌ ఇమేజ్‌ పుస్తకాల బరువు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒక సెమిస్టర్‌ పూర్తి చేసే కాలంలో పిల్లలు కేవలం నాలుగు నెలలకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే క్లాసుకు తీసుకురావచ్చు. తద్వారా వారు బరువు మోసే పని తగ్గుతుంది. 

పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను, నేర్చుకునే సమర్థతలను మెరుగుపర్చడంలో భారతీయ పాఠశాలల ఉపాధ్యాయులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటోంది. ఇంతవరకు భారతీయ విద్యా వ్యవస్థ పాఠాలు గుర్తు పెట్టుకునే లేక వల్లెవేయించే ప్రక్రియలోనే నడుస్తోంది తప్ప పిల్లల్లో సృజనాత్మక ఆలోచనకు అనుమతిం చడం లేదు. కాబట్టి ఇకనైనా పిల్లల్లో సృజనాత్మక చింతన ప్రారంభం కావాలి. 6వ తరగతిని పూర్తి చేసే లోపే వారు కాలంతోపాటు తప్పక ఎదగాలి. స్వయంగా ఇంగ్లిష్‌లో మాట్లాడే అభ్యాసాన్ని ఇస్తున్న మిర్రర్‌ ఇమేజ్‌ పుస్తకాలు టీచర్‌ వయసు ఏదైనా సరే వారి ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ఇది పిల్లలు మాట్లాడే ప్రక్రియకు సాయపడుతుంది. పైగా టీచర్‌ కంటే ఎక్కువగా నేర్చుకోవడంపై పిల్ల లకు ఆసక్తి ఉంటుంది కనుక ప్రతి విద్యార్థి కూడా ఒక టీచరేనని ఉపాధ్యాయులందరూ గుర్తించాల్సి ఉంటుంది.

శ్రమను గౌరవించడం నేర్పే బోధన
యూరో–అమెరికన్‌ వ్యవస్థల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత పిల్లలు తమ కుటుంబం నుంచి బయటపడి కుటుంబ ఆర్థిక ప్రతిపత్తితో  ప్రమేయం లేకుండా తమ సొంత జీవితం గడపాల్సి ఉంటుంది. భారత దేశంలో ఇది సాధ్యం కాదు. ఇక్కడ మనం చైనానుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనాలోనూ మనకు లాగే భారీస్థాయిలో పిల్లలు పాఠశాలలకు వెళుతుంటారు. పైగా ఒకేరకమైన ఆర్థిక వ్యవస్థ మన రెండు దేశాల్లోనూ ఉంది. కానీ ఆ దేశంలో శ్రమను గౌరవించే బోధన విస్తృత స్థాయిలో కనిపిస్తుంది.
భారతదేశంలోనూ శ్రమను గౌరవించడాన్ని బోధించడం అనేది పిల్లలు వంటపని చేయడంతో మొదలు కావాలి. దీన్నే కిచెన్‌ ఫ్రెండ్లీ అంటున్నారు. 6వ తరగతినుంచి పాఠాలు వంటకు సంబంధించిన పాఠ్యాంశాలతో, శ్రమ ప్రాధాన్యతను గుర్తింప జేసే అంశాలతో ఉండాలి. పిల్లల జెండర్‌తో నిమిత్తం లేకుండా కుటుంబంలోని పిల్ల లందరికీ తల్లి వంటపనిని, ఇంటి పనిని నిత్యం బోధిస్తూ రావాలి. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా తల్లికి నగదు ఇస్తోంది. ఇది తల్లి సానుకూల విద్యను పిల్లలకు బోధించడానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.

అయితే తల్లిదండ్రులు స్కూల్లో భేటీ అయే సమయంలో వారు తమ పిల్లలకు ఇంటిపనిలో ఉన్న శ్రమను గౌరవించడం ఒక పెద్ద సాంస్కృతిక సంపద అనే విషయాన్ని అర్థం చేయించాలని పాఠశాలలు తప్పకుండా కోరాలి. పిల్లలకు తల్లిదండ్రులు వంటపని, ఇంటిపని నేర్పిస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులు నిర్ధారించాలి కూడా. నేర్చుకునే ప్రక్రియలో టీచర్లు తమలోని పురుషాధిక్య ధోరణులను వదిలిపెట్టేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రతి క్లాసులోనూ మట్టి పిసకడం, వ్యవసాయ పనులు చేయడంపై కొన్ని పాఠాలు తప్పక పొందుపర్చాలి. చైనా ఈ పనిని 4వ తరగతినుంచే మొదలుపెడుతోంది. భారతదేశంలో శ్రమను గౌరవించే బోధనను సూత్ర రీత్యా, ఆచరణ రీత్యా ప్రవేశపెట్టడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ సొంత పద్ధతులను చేపట్టవచ్చు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ బోధనకు సంబంధించి భవిష్యత్తులో అత్యంత సృజనాత్మక మదుపుదారుగా మారనుంది. రేపు తన పౌరులకు దేశం గర్వించగిన స్థాయిలో శాస్త్రీయ విద్యను కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందించనుంది.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
òషెపర్డ్‌
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement