
హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని టీ మాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ‘టీ మాస్ ఉద్యమ లక్ష్యం– కుల, ప్రజా సంఘాల భాగస్వామ్యం అవసరం’అనే అంశంపై సదస్సు జరిగింది. కంచ ఐలయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎక్కువగా త్యాగాలు చేసింది దళితులేనని అన్నారు. రాష్ట్ర ఫలాలను దళితులకు అందించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం టీ మాస్ చేస్తున్న పోరాటంలో కుల, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. దళిత సంఘర్షణ సమితి జాతీయ కో–ఆర్డినేటర్ నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మార్చి 15న తిరుపతిలో జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ నీరుడు కృష్ణ, మహిళా అధ్యక్షురాలు కురపాటి సుధారాణి, కోశాధికారి పీజీ సుదర్శన్, పద్మారావు ముదిరాజ్, పి.జయరాం, డి.ప్రభాకర్‌రావు, వినిత, నాగమణి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment