సర్వేజనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ!..
సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిత్ దుఃఖ మాప్నియా!!
లోకః సమస్తా సుఖినో భవంతు...
అంటే సర్వజనులు ఎలాంటి బాధలు లేకుండా సుఖశాంతులతో జీవించాలని హిందుత్వం అభిలాషిస్తుంది. అంటే భారతీయులో, హిందువులో మాత్రమే సుఖ శాంతులతో జీవించాలని హిందుత్వం కోరుకోవడం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే విశాల దృక్పథాన్ని ప్రబోధించేది హిందుత్వం. కాబట్టే 1983లో చికాగో (అమెరికా)లో జరిగిన సర్వమత సమ్మే ళనంలో స్వామి వివేకానంద హిందుత్వం గొప్పతనాన్ని చాటి చెప్పిన తర్వాత ఎంతోమంది క్రైస్తవ మత ప్రబో ధకులు తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రొ. కంచ ఐలయ్య రాసిన ‘మరి మతం మారితే అభ్యంతరమేల?’ అనే వ్యాసం (అక్టోబర్ 10, 2019) చదివిన తర్వాత ఆయన వైఖరి సమాజంలో భేద భావాలు పెంచే విధంగా ఉండటంతో నేను కొన్ని వాస్త వాలు తెలియజేయాలని ఈ వ్యాసం రాస్తున్నాను.
విదేశీయులెందరో ముఖ్యంగా పాశ్చాత్యులు హిందు త్వంలోకి మారి హిందూ ఆరాధనా పద్ధతులు ఆచరిం చడం, హిందూ దేవుళ్లను పూజించడం సాధారణమైంది. అందుకే ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్, ఇస్కాన్ లాంటి సంస్థలెన్నో విదేశాల్లో ప్రాచుర్యం, ప్రజాదరణ పొందుతు న్నాయి. ఎంతోమంది విదేశీయులు భారతీయ విధానంలో వివాహాలు చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. ఇలా ఆచరిస్తున్న వారెవ్వరినీ ఇంకెవరో ప్రలోభపెట్టో, మోసం చేసో, మరే విధంగానైనా ఒత్తిడి చేసో హిందుత్వ విధానాలు ఆచరింప జేయట్లేదనేది అక్షర సత్యం.
ఇక కంచ ఐలయ్య పేర్కొన్న ఆరెస్సెస్ పుస్తకం విష యానికి వస్తే అందులో అలాంటి విషయాలెన్నో ఉన్నా కేవలం క్రైస్తవ మహిళల అక్షరాస్యత అంశాన్ని మాత్రమే తీసుకొని తన భావాలకు అనుగుణంగా వక్రీకరించి రాయ డం ఆయన హ్రస్వ దృష్టిని సూచిస్తోంది. హిందుత్వం ఎక్కడ మంచి ఉన్నా తనలో ఇనుమడింపజేసుకుంటుంది. అలాగే ఆరెస్సెస్ కూడా. అందుకే 1925లో విజయదశమి రోజు కేవలం 10–18 మంది చిన్నపిల్లలతో కలిసి డా. హెడ్గేవార్ నాటిన విత్తు క్రమపద్ధతిలో పెరిగి మొక్క అయి, వృక్షమై, ప్రస్తుతం వట వృక్షమై విశ్వవ్యాప్తమైంది. అలాంటి ఆరెస్సెస్ గతంలో కూడా ఎన్నో మంచి విషయాలను లోకానికి తెలియజేసింది. వాటిని కూడా ఆయన పేర్కొంటే బాగుండేది.
క్రిస్టియానిటీ స్త్రీ–పురుష అసమానత్వానికి చెందిన అనేక అడ్డంకులను దాటుకుంటూ వచ్చింది అని రాశారు. అందులో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది. తప్పులేదు. కానీ హిందుత్వంలో స్త్రీ పురుష అసమానత్వం అనే ఆలో చనే లేదు. కాబట్టే ‘యత్ర నార్యన్తు పూజ్యతే రమంతే తత్రదేవతా’ అంటే ఎక్కడ నారీమణులు పూజింపబడ తారో అక్కడే దేవతలు విహరిస్తారు అని హిందుత్వం స్పష్టంగా ప్రబోధిస్తుంది. త్రిమూర్తులే కాదు. భారతీయు లంతా భూమిని భూదేవిగా, భారతమాతగా, గంగానదిని గంగామాతగా, ప్రకృతిని ప్రకృతి మాతగా పిలుస్తారు. అంటే స్త్రీని తల్లిగా భావించి గౌరవించడం, పూజించడం ఒక్క హిందుత్వంలోనే ఉంది. అంటే పురుషుడికంటే ఉన్న తమైన స్థానంలో అనాదిగా మహిళలు గౌరవింపబడుతు న్నది భారతదేశంలోనే.
అంతేకాదు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా ఒక సంద ర్భంలో భారత దేశంలో మహిళల పరిస్థితిని గురించి వివ రిస్తూ, పురుషుల కంటే ఉన్నత స్థానంలో ఉన్నారని, కాబట్టి స్త్రీ పురుష అసమానత్వం అనేది భారతదేశంలోని మహి ళలకు వర్తించదనడం భారత్‌లో మహిళలకు ఉన్న గౌరవ ప్రతిష్టలను తెలియజేస్తుంది. బ్రిటిష్ పరిపాలనకు పూర్వం భారత్‌లో అక్షరాస్యత అధికంగా ఉండేది. ప్రతి ఒక్కరికి గురుకులాలు అందుబాటులో ఉండేవి. బ్రిటిష్‌వారు ఇక్కడి విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. వేద విజ్ఞానాన్ని నాశనం చేశారు. గణితంలో కీలకమైన ‘0’ (సున్నా)ని కను గొన్నది భారతీయుడే. ప్రపంచంలో తొలిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేసింది శుశ్రూతుడు కాగా, ఆర్యభట్ట పేరు గడించిన ఖగోళ శాస్త్ర వేత్త అనే విషయం మనకు తెలిసిందే.
బ్రిటిష్ వారి కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి మత మార్పి డులకు పాల్పడ్డారు. వారి పాపకార్యం ఇప్పటికీ కొనసాగు తోంది. నిరక్షరాస్యులైన, అమాయకులైన దళితులను, గిరి జనులను, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి కష్టాల్లో ఉన్న వారిని వివిధ రకాలుగా ప్రలోభపెట్టి, మోస పూరిత విధానాలతో వారిని క్రైస్తవులుగా మారుస్తున్నది నిజం కాదా? భారత రాజ్యాంగంలో ప్రతిపౌరుడూ తనకి ష్టమైన మతాన్ని, పూజా విధానాన్ని ఆచరించే అవకాశం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొంది.
క్రైస్తవుల్లో అక్షరాస్యత ఎక్కువుంటే అందరూ క్రైస్తవులుగా మారితే తప్పేంటి? ఆరెస్సెస్ ఇందుకు అంగీకరించాలి. దేశంలో ఉన్న మత మార్పిడుల నిషేధ చట్టాలన్నీ తొలగించాలంటున్నారు. మతమార్పిడులకు ఆరెస్సెస్ ఎందుకు అనుమతించాలి. ఆరెస్సెస్ ప్రారంభం నాటి నుంచి నేటి వరకు స్పష్టమైన, భారతదేశానికి అవసరమైన విధానాలనే ఆచరిస్తుంది, తెలి యజేస్తుంది. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ సంపదను దోచుకుతింటూ విదేశాలకు జైకొట్టే, విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన దేశ వ్యతిరేకులెవరైనా, వారు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా చివరికి హిందువు లైనా ఆరెస్సెస్సే కాదు దేశభక్తులెవరూ సహించరు.
ప్రతి వ్యక్తిలో, ప్రతి మతంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి విషయంలో మంచి చెడులుండటం సహజం. అలాగే క్రైస్తవంలో ఉన్న ఒకే ఒక మంచి విషయాన్ని పట్టుకొని మిగిలిన మతాలవారు క్రైస్తవంలోకి రావాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చరిత్రలో ఎన్నో ఆటుపోట్లకు లోనై కూడా ఇప్పటికీ అజరామరంగా విరాజిల్లుతున్న, అత్యున్నతమైన జీవన విధానాన్ని అందిస్తున్న హిందుత్వం లోకే క్రైస్తవులు (గతంలో వీరంతా హిందువులే) తిరిగి వస్తే తప్పేంటి? కంచ ఐలయ్య లాంటి వారు మతం మారినంత మాత్రాన హిందువులుగా మరణించిన వారి పూర్వీకుల ఆత్మలు ఘోషించవా? ఇప్పటికైనా మతం మారాలనుకునే ప్రతి ఒక్కరూ వారి పూర్వీకుల మతం పరిస్థితి ఏంటి? అనే విషయం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (ప్రొఫెసర్ కంచ ఐలయ్య 10–10–2019(గురువారం) సాక్షి సంచికలో రాసిన వ్యాసానికి స్పందన)
వ్యాసకర్త: శ్యాంసుందర్ వరయోగి, సీనియర్ జర్నలిస్ట్,
ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ
రాఘవ్స్ ఫౌండేషన్, హైదరాబాద్
చదవండి: మరి మతం మారితే అభ్యంతరమేల?
Comments
Please login to add a commentAdd a comment