అన్నదాత హక్కు గెలిచినట్లే...! | Kancha Ilaiah Shepherd Article On Farm Laws Repeal | Sakshi
Sakshi News home page

అన్నదాత హక్కు గెలిచినట్లే...!

Published Sat, Nov 27 2021 12:46 AM | Last Updated on Sat, Nov 27 2021 12:49 AM

Kancha Ilaiah Shepherd Article On Farm Laws Repeal - Sakshi

కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలపై పంజాబ్‌ రైతులు సాధించిన అద్భుత విజయానికి మూలాలు గురునానక్‌ బోధనల్లో ఉన్నాయి. రైతుల హక్కుల కోసం సిక్కులు సాగిస్తున్న పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ రంగాన్ని మొత్తంగా భారత గుత్తపెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని వీరు భావించారు.

కానీ, చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్‌ రైతులు దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడారు. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్‌ చేస్తోంది. పోరాడి గెలిచిన రైతులు మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను లిఖింపజేసుకున్నారు. 

నవంబర్‌ 19న గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. తన ప్రభుత్వం ఏడాదిక్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ సిక్కు రైతులు యుద్ధం ప్రకటించారు. లక్షలాది రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివెళ్లారు. సంవత్సరం పైగా సాగిన ఈ ఆందోళనల క్రమంలో 750 మంది రైతులు ప్రాణత్యాగాలు చేశారు.

ప్రభుత్వం వందలాదిమంది రైతులపై నానా రకాల కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టింది. సిక్కురైతుల్లోని మిలిటెంట్‌ విభాగం, నిరంకారీలు ఈ జనవరి 26న సాక్షాత్తూ ఎర్రకోటపైకి ఎక్కి విజయధ్వానం చేశారు. ఈ క్రమంలో పలువురు జర్నలిస్టులపై, రచయితలపై పలు కేసులు పెట్టారు, పోలీసులు ఉద్యమకారులను, ఇతరులను దారుణంగా హింసించారు. అయినా సరే ఆరెస్సెస్, దాని రాజకీయ పక్షమైన పాలక బీజేపీ ఏమాత్రం చలించలేదు. 

ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు విస్తరించాయి. అదే సమయంలో రాకేష్‌ తికాయత్‌ నేతృత్వంలో సిక్కుయేతర భారీ రైతు ఉద్యమం మొదలైంది. యూపీలోని గ్రామాలు సైతం రైతుల ఉనికికోసం సాగిస్తున్న పోరాటంలో భారీఎత్తున పాల్గొన్నాయి. ఎట్టకేలకు విజయం సిద్ధించింది. ప్రధాని నరేంద్రమోదీ అన్నదాతల ముందు తలవంచి క్షమాపణ చెబుతూ సాగు చట్టాలను ఉపసంహరిం చుకుంటున్నట్లు చెప్పాల్సివచ్చింది. ఏదేమైనా, గురునానక్‌ నుంచీ, సిక్కు సమాజం నుంచీ హిందుత్వ శక్తులు నైతిక పాఠం నేర్వాల్సిన అవసరం ఉంది.

ఆరెస్సెస్‌ తీసుకొచ్చిన మరో గురువు హెగ్డేవార్‌ బోధనలతో పోలిస్తే గురునానక్‌ బోధనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. హిందూ వర్ణ ధర్మ సంస్కృతి, ముస్లిం పీడక పాలనతో కూడిన సంక్లిష్ట కాలంలో గురునానక్‌ తన ఆధ్యాత్మిక భావాలను వెలువరించారు. ఈయన 1469లో ఖాత్రిలో పట్వారీ కటుంబంలో పుట్టినప్పటికీ, మానవ మనుగడకు వ్యవసాయ ఉత్పత్తే ప్రాణాధారమని గుర్తిం చారు. ఈ ఉత్పాదక శ్రామికుల రూపకర్త దేవుడని గ్రహించారు. ఆయన దృష్టిలో దేవుడు యుద్ధ వీరుడు కాదు.

జాతి అంటే మానవ సంకుచితత్వంలో ఇరుక్కుపోయిన నేల కాదని ఆయన భావన. ఈ భావనతోటే నానక్‌ అనుయాయులు శ్రమించే హస్తాలతోనే ప్రపంచం నలుమూలలకు విస్తరించారు. అక్కడి ఉత్పాదక క్షేత్రాల్లో పనిచేసి మనుగడ సాగించారు. వీరు భారతీయ వ్యవసాయాన్ని సానుకూల ఉత్పాదితంగా చేయడమే కాదు... కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇదే స్ఫూర్తితో వారు పనిచేశారు. తమ జాతీయవాదాన్ని ఇతరులకు వ్యతిరేకంగా సిక్కులు ఎన్నడూ ప్రోత్సహించలేదు

ఆహారధాన్యాలను ఉత్పత్తిచేసే రైతులకోసం సిక్కులు సాగించే పోరాట సంప్రదాయాన్ని ఆరెస్సెస్, బీజేపీ చాలా తక్కువగా అంచనా వేశాయి. వ్యవసాయ ఉత్పత్తిని మొత్తంగా భారత గుత్త పెట్టుబడిదారుల పరం చేయడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను సిక్కులు గ్రహించలేరని ఆరెస్సెస్, బీజేపీ పాలక శక్తులు భావించాయి. ప్రతిరంగంలోనూ అనైతిక ధనాన్ని కొల్లగొడుతూ ఆ రంగాల వెనుకబాటుతనాన్ని, బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడమే భారతీయ గుత్తపెట్టుబడి వర్గం లక్షణం.

కేంద్రప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కల్లోలంలో ముంచెత్తినప్పుడు పంజాబ్‌ రైతులు తమ హక్కుల కోసం పోరాడారు. ఒక్కమాటలో చెప్పాలంటే చరిత్రలో ఏ దశలో కంటే ఇప్పుడే పంజాబ్‌ రైతులు దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. భారతీయ వ్యవసాయాన్ని అణగదొక్కడానికి పార్లమెంటులో మంద మెజారిటీని దుర్వినియోగపర్చదలిచిన పాలకవర్గాన్ని పంజాబ్‌ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పార్లమెంటరీ పంథానుంచే దేశం పక్కకు వెళ్లే ప్రమాదం ఉందని పంజాబ్‌ రైతులు చాలా త్వరగా గ్రహించారు.

ఢిల్లీ స్థాయిలో అనేక సందర్భాల్లో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణులు ప్రబలుతూ వచ్చిన విషయం తెలిసిందే. వీటిని నిరోధించే క్రమంలో, తమిళనాడు బీసీ వర్గాలు ఓబీసీల హక్కులకోసం నిత్యం పోరాడుతూ వచ్చాయి. అదేవిధంగా, పంజాబ్‌ రైతులు తమ వ్యావసాయిక హక్కులకోసం తుదికంటా పోరాడారు. ఇక దళిత హక్కుల విషయానికి వస్తే మహారాష్ట్ర దళిత శక్తులు దేశానికే దారి చూపాయి. గురునానక్, పెరి యార్‌ రామస్వామి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, బహుళ సంస్కృతిని పరిరక్షించే శక్తులను దేశంలో నిర్మిస్తూ వచ్చారు.

కానీ ఈ ముగ్గురి భావాలను ఆమోదిస్తున్నట్లు పైకి నటిస్తూ ఆచరణలో సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో నడిచేటటువంటి సంస్థను ఆరెస్సెస్, హెగ్డేవార్‌ ఏర్పర్చారు. దేన్నయినా సరే వ్యతిరేకించే ఆధ్యాత్మిక, సామాజిక భావజాలాన్ని గురునానక్‌ సృష్టించలేదు. ఆరెస్సెస్‌కి చెందిన హెగ్డేవార్‌ మాత్రం ముస్లిం వ్యతిరేక, గొడ్డు మాంసం వ్యతిరేక భావజాలాన్ని, హిందూ ధర్మ పరంపర పేరుతో స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకంగా నిలిచే సంస్థాగత నిర్మాణాలను ఏర్పర్చారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతులను, వ్యవసాయ ఉత్పత్తిని కైవసం చేసుకోవాలన్నదే హిందుత్వ శక్తుల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడది ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వ అమేయ శక్తిని ఢీకొని భారతీయ వ్యవసాయ రంగాన్ని కాపాడిన సిక్కు రైతులకు జాతి మొత్తంగా సెల్యూట్‌ చేస్తోంది.

భారతీయ సిక్కులకు మతం కేంద్రంగా ఉండే రాజకీయపార్టీ అకాలీదళ్‌ ఉంది. కానీ మనకు తెలిసినంత వరకు అది పంజాబ్‌లో నివసిస్తున్న ఏ ఇతర మతాల ప్రజలకూ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అక్కడి ఏ ఇతర సామాజిక వర్గాల ఆహార హక్కుల్లోనూ అకాలీదళ్‌ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. కేరళలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకున్న ఆరెస్సెస్, బీజేపీ లాగా, 12 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న మహిళలను గురుద్వారాల్లోకి ప్రవేశించకుండా అకాలీదళ్‌ ఎన్నడూ అడ్డుకోలేదు. 

సమాజాన్ని విభజించడం కాకుండా, సమానత్వ ప్రాతిపదికన సమాజాన్ని స్థాపించడానికి ఆధ్యాత్మిక నైతికత అనేది రాజకీయాల ద్వారానే కదలాల్సి ఉంటుంది. అత్యంత నిరాశాపూరిత పరిస్థితులగుండా సాగిన రైతుల ఉద్యమం, వారి ఈ అద్భుత విజయం జాతికి నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి. రైతుల నిరవధిక పోరాటం చివరకు ఏమౌతుందని గత సంవత్సర కాలంగా మొత్తం ప్రపంచం వేచి చూస్తుండి పోయింది. రైతు ఉద్యమం తుది విజయం వరకు కొనసాగుతుందని ఎట్టకేలకు ఆరెస్సెస్‌ బీజేపీ కూటమికి అర్థమైపోయింది.

ఢిల్లీలో సాగిన సిక్కు రైతుల ఉద్యమం వారు ఎంత శాంతికాముకులో ప్రపంచానికి చూపించింది. తమ గురుద్వారాల్లో ఆకలిగొన్న ప్రతి స్త్రీకీ, పురుషుడికీ వారు ఎలా తిండి పెడతారో, చివరకు తమను రోడ్లపై దారుణంగా కొట్టిన పోలీసులకు కూడా వారు ఎలా తిండి పెట్టారో ఈ ఉద్యమం ప్రపంచానికి విడమర్చి చూపింది. ఇది తమ గురువు గురునానక్‌ నుంచి వారు పొందిన కారుణ్య దృష్టి. ఏ మతమైనా సరే ఇతర మతాలను, ఇతర జీవన పద్ధతులనూ తప్పక గౌరవించాలని, భారతదేశంలో సిక్కు రైతులు ప్రదర్శించి చూపారు.  

మతం అంటే పొలాల్లో శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడమే తప్ప మరే అర్థమూ దానికి లేదని సిక్కులు యావత్‌ ప్రపంచానికి ప్రదర్శించి చూపారు. హిందుత్వ శక్తులతోపాటు, భారతదేశంలోని ఇతర మతాలు అన్నీ సిక్కులు, వారి గురువుల నుంచి దీన్నే తప్పక నేర్చుకోవాలి. ఉత్పత్తి చేయని వారు ఆహార ఉత్పత్తిదారులపై తీర్పు చెప్పకూడదు. ఈ ఉద్యమంలో పోరాడి గెలిచిన రైతులు... మన స్కూళ్లు, కాలేజీ పుస్తకాల్లో శాశ్వతంగా ఉండిపోయే గొప్ప చరిత్రను తమ పేరిట లిఖింపజేసుకున్నారు.


వ్యాసకర్త: కంచె ఐలయ్య షెపర్డ్‌, ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement