కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పగడ్బందీ వ్యూహంతో, వాస్తవిక దృష్టితో దేశం ముందుకు తెచ్చిన నూతన వ్యవసాయ సాగుచట్టాలను అనూహ్యంగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆయన మద్దతుదారులనూ, వ్యతి రేకులనూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దాదాపు సంవత్సరం రోజులు రైతుల పేరుతో ఉద్యమం నడిచింది.
ఈ ఉద్యమం రైతు సంఘాల పేరుతో నడిచిందే గానీ, పొలం మీద తమ చెమట ధారపోసే రైతులు చాలామంది ఈ ఉద్యమంలో లేరన్నది అక్షర సత్యం. ఈ ఉద్యమాన్ని నడిపింది అంతా బడా నాయకులూ, పంజాబ్, హరి యాణా రాష్ట్రాల్లో మండీలను నిర్వహించేవారు, వారి అనుయాయులు. సంవత్సరం కాలంపాటు ప్రపంచంలో ఏ ఉద్యమం ఇంత ఖరీదుతో నడవలేదు. అగ్నికి ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సర్వశక్తులూ ఒడ్డి, పాకిస్తాన్ అనుకూలవాదులనూ, చైనా అనుకూలవాదులనూ ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలిపారు.
గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట పరిసరాల్లో ఎంత హింస చెలరేగింది? రైతుల పేరుతో నడిచే ఉద్యమం 68 మంది పోలీసుల తలలు పగలగొట్టే స్థితికి ఎలా చేరింది? దీని వెనుక ఎవరున్నారు? రైతుల ప్రయోజనాల కంటే దేశాన్ని అస్థిర పరచడం, దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులను సృష్టించడం, మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి వేయడం ఉద్యమ నాయకులకు అజెండాగా ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టును అందించాయి. సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటుపై ఆశలు చంపుకోలేని కొందరు నాయకులు ఈ ఉద్యమానికి ఆర్థిక నిధులను ఇబ్బడిముబ్బడిగా అందిస్తున్నారనే విషయాన్ని మోదీ ప్రభుత్వం అప్పటికే పసిగట్టింది.
నూతన సాగు చట్టాలు వాస్తవిక దృష్టితో చూస్తే, రైతులకు మేలు చేసేవే. కానీ మండీలు నిర్వహిస్తూ, కమిషన్లను కోటాను కోట్లుగా దండుకునే బ్రోకర్లకు, వారి వెనుక ఉండే నాయకులకు ఈ నూతన సాగు చట్టాలు ఇబ్బందికరమే. ప్రకృతిని, తన శ్రమను నమ్ముకుని జీవించే రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కాక అనేక కడగండ్లను దిగమింగుకుంటూ, బతుకు బండిని లాగుకొస్తున్న రైతులకు నూతన సాగుచట్టాల వల్ల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని, కొన్ని అపోహలను, ఈ రైతు సంఘం నాయకుల ముసుగులో ఉన్న మోదీ వ్యతిరేకులు నూరిపోశారు.
పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోని కొద్దిమంది రైతులు మాత్రమే ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యమాన్ని నడిపే నాయకులను నమ్మి, దాదాపు 750 మంది రైతులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం దేశ దురదృష్టం. ఉద్యమాన్ని నడిపిన నాయకులెవరూ ప్రాణాలను బలి తీసుకోలేదనేది గమనార్హం. ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో రైతుల పేరుతో నడిచిన ఉద్యమం అంతా మోదీ వ్యతిరేకులు చేసిందే. ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో రైతుల పేరుతో నడిచిన ఉద్యమం అంతా మోదీ వ్యతిరేకులు చేసిందే.
స్వాతంత్య్రానంతరం నుండి నేటి వరకు అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాల వలన వేలాది రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులు తీర్చలేక తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. పాత చట్టాలు రైతులకు మేలు చేసేవే అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నట్లు? నూతన సాగు చట్టాల్లోని ప్రయోజనాలను వ్యవతిరేకించే వారి దగ్గర ఈ ప్రశ్నలకు జవాబులు లేవు.
నూతన సాగు చట్టాల్లోని ప్రయోజనాలను రైతులకు వివరించడంలో జాతీయవాద సంస్థల ప్రతి నిధులూ, ఆ సంస్థల కార్యకర్తలూ, పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. ఈ విషయంలో వారి ఉదాసీన వైఖరి విస్పష్టమైంది. పెద్దనోట్ల రద్దు, త్రిపుల్ తలాక్, సీఏఏ చట్టాలు, 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య సమస్య పరిష్కారం వంటి విషయాలలో లభించిన సానుకూలతతో, నూతన సాగు చట్టాల ద్వారా వచ్చే వ్యతిరేకతను పూడ్చాలనే వ్యూహం బెడిసికొట్టింది.
ఇక మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కొన్నిచోట్ల ఓటమిపాలైంది. యూపీ శాసన సభకు జరుగబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాలు కోల్పోవలసి ఉంటుందని రిపోర్టులు రావడంతో నూతన సాగు చట్టాలను రద్దును ప్రధాని ఆకస్మికంగా ప్రకటించారని కొందరు వాదించడం, ఇది రైతుల విజయం ఉంటూ కాంగ్రెస్, వామపక్ష నాయకులు ప్రకటించడం పూర్తిగా నిజం కాదు. సిఏఏచట్టం అమలు, ఎన్‌ఆర్సీ అమలు పాక్‌లోని తీవ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్ వంటి సాహసోపేతమైన చర్యల విషయంలో మోదీ ప్రభుత్వం సీట్లు, ఓట్లు లెక్కించలేదు. రైతుల పేరుతో నడిచిన ఉద్యమం ద్వారా, హిందువులకు సిక్కులకు మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నాన్ని కొందరు నిర్మాణం చేశారు.
దేశ అంతర్గత, బాహ్య శత్రువుల ప్రయత్నాలకు చెక్ పెట్టడంకోసమే నూతన సాగు చట్టాలను రద్దు చేసి ఉండవచ్చు. పైగా గురునానక్ జయంతి సిక్కులకు అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నూతన సాగు చట్టాల రద్దును ప్రకటిం చడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రద్దు వెనుక దేశ విశాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇక రైతుల పేరుతో ఉద్యమం నడిపి, రైతులను రెచ్చగొట్టి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని తల పూసే వారి ఆశలు అడియాసలయ్యాయి. వారి నిజస్వరూపాన్ని దేశ ప్రజల ముందు ఉంచడానికి దొరికే ఏ చిన్న అవకాశాన్ని మోదీ ప్రభుత్వం జారవిడుకోదు.
ఉల్లి బాల రంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు
మొబైల్ : 94417 37877
Comments
Please login to add a commentAdd a comment