చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం | Ramesh Vinayak Article On Farm Laws Repeal | Sakshi
Sakshi News home page

చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం

Published Sun, Nov 21 2021 12:52 AM | Last Updated on Sun, Nov 21 2021 12:52 AM

Ramesh Vinayak Article On Farm Laws Repeal - Sakshi

సిక్కుల ఆరాధ్య గురువు గురునానక్‌ 552వ జయంతి గురుపూరబ్‌ (కార్తీక పౌర్ణమి) సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాల వల్ల లభించే ప్రయోజనాల గురించి రైతుల్లో ఒక సెక్షన్‌ సమాధానపడక పోవడంతోనే తన ప్రభుత్వం సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని మోదీ విచారం వ్యక్తం చేశారు.

మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మేం మొదలుపెడతామని ప్రధాని పేర్కొన్నారు. ఒక సంవత్సరం పైగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగ నిరసనలకు కేంద్రబిందువుగా మారిన పంజాబ్‌ మొత్తం ఉద్యమానికి ప్రతీకగా మారింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని చేసిన ఈ ఆకస్మిక ప్రకటనతో పంజాబ్‌ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రభావ ఫలితాలను చూద్దాం.

బీజేపీకి ఉపశమనం
దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న రైతాంగం ఆందోళన ముగింపునకు చేరువవడం కాషాయ పార్టీకి పెద్దగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ సంవత్సర కాలంలో పంజాబ్‌లో క్షేత్రస్థాయిలో బీజేపీ రైతుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసింది. మిత్రపక్షాలతో కనీసం చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాల కారణంగా 24 సంవత్సరాలుగా శిరోమణి అకాలీదళ్‌తో కొనసాగిన ఎన్నికల పొత్తు బదాబదలైపోయింది. ఈ మూడు సాగు చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీదళ్‌ గత సంవత్సరమే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకుంది.

సుదీర్ఘమైన పొత్తు రద్దుతో గ్రామీణ పంజాబ్‌ రైతాంగ ఆగ్రహానికి కేంద్రాన్నే లక్ష్యంగా చేయడంలో శిరోమణి అకాలీదళ్‌ విజయం సాధించింది. ఇప్పుడు మోదీ ఆకస్మిక నిర్ణయం ప్రభావంతో పంజాబ్‌లో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. పాకిస్తాన్‌కి సిక్కు భక్తులు వెళ్లడానికి వీలుగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ని తిరిగి తెరవడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రెండురోజుల్లోపే ప్రధాని మోదీ సాగు సంస్కరణ చట్టాల రద్దు గురించి ప్రకటించారు. దీంతో సిక్కు నియోజకవర్గాల్లో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.

పరపతి యుద్ధంలో కాంగ్రెస్‌కు పైచేయి
పంజాబ్‌లో పాలక కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ సంస్కరణ చట్టాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడమే కాకుండా, కేంద్ర శాసనంపై రెండు సార్లు శాసనసభలో తీర్మానాలు ఆమోదించింది. మోదీ ప్రభుత్వం మెడలు వంచేలా చేసిన ఘనత పూర్తిగా తనదేనని పంజాబ్‌ ప్రభుత్వం వెంటనే ప్రకటించేసుకుంది. ఇప్పటికే గ్రామీణ ఓట్ల కోసం జనరంజక పథకాలను వరుసగా ప్రకటిం చిన పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగును తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వేగంగా పథకాలు పన్నుతోంది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే రైతులకు విజయం దక్కేలా చేయడంలో తమ పాత్ర కూడా ఉందని చెబుతూ కాంగ్రెస్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. 

పంజాబ్‌లో నూతన రాజకీయ సమీకరణలు
సాగుచట్టాల రద్దుతో పంజాబ్‌లో నూతనంగా రాజకీయ ఏకీకరణలు, పొత్తులకు అవకాశాలు ఏర్పడ్డాయి. బీజేపీతో పొత్తును తెంచుకుని ప్రతిష్ఠను పెంచుకున్న శిరోమణి అకాలీదళ్‌కు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది. మొదట్లో వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సులను బలపర్చి రైతాంగం నుంచి పెనువిమర్శలకు గురైన శిరోమణి అకాలీదళ్‌కు ఆ చట్టాల రద్దుతో నెత్తిన పాలు పోసినట్లయింది. ఎన్నికల లెక్కలు సరిచేసుకోవడానికి వెంపర్లాటలో అకాలీలు బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకొని 117 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లను తన జూనియర్‌ భాగస్వామికి ఇవ్వడానికి అంగీకరించింది.

అయితే చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని పంజాబ్‌ తొలి దళిత ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో బీఎస్పీ ద్వారా కులం కార్డును ప్రయోగించాలనుకున్న శిరోమణి అకాలీదళ్‌ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు రైతుల సాంప్రదాయిక కంచుకోటల్లో తాను కోల్పోయిన రాజ కీయ భూమికను తిరిగి చేజిక్కించుకోవడంపై అకాలీలు ఆశలు పెట్టుకోవచ్చు. అయితే పంజాబ్‌ రాజకీయాల్లో ఇప్పుడు కీలకప్రశ్న ఏమిటంటే శిరోమణి అకాలీదళ్, బీజేపీ తమ సంబంధాలు పునరుద్ధరించుకుని, మళ్లీ పొత్తు కుదుర్చుకుం టాయా అన్నదే! ఈ రెండు పార్టీల పొత్తు వల్ల సిక్కులు, హిందువులు మెజారిటీ ఉండే నియోజకవర్గాల్లో ఈ కూటమికి గట్టి పునాది పాతుకుపోయిన విషయం తెలిసిందే. అలాంటి అవకాశాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు కూడా!

కెప్టెన్‌–బీజేపీ పొత్తుకు మార్గం కుదిరినట్లే!
వ్యవసాయ చట్టాల రద్దుతో, కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకుని కొత్త పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను నెలకొల్పిన మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు, బీజేపీకి మధ్య పొత్తుకు ద్వారాలు తెరిచినట్లయింది. రైతుల సమస్యలు పరిష్కారమైతే బీజేపీతో స్థానాలు పంచుకుంటానని అమరీందర్‌ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే కెప్టెన్‌ కొత్త పార్టీ ఇంకా పుంజుకోనప్పటికీ, తనకు ఇప్పటికీ రాజకీయ ప్రాధాన్యం ఉంది. పంజాబ్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమరీందర్‌కి పట్టు ఉంది. పైగా కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తితో వేగిపోతున్న నేతలను అమరీం దర్‌ తమ కూటమి వైపు ఆకర్షించగలడని కూడా నమ్ముతున్నారు.

రైతు సంఘాలు అదనపు కారణం
సంయుక్త కిసాన్‌ మోర్చాలోని 32 రైతు సంస్థల్లో చాలా వాటికి పంజాబ్‌లో మూలాలున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దుతో ఈ సంఘాలు ఇప్పుడు విజయోత్సాహంతో  ఉన్నాయి. కానీ తమ ఈ విజయాన్ని ఎన్నికల రూపంలో ఇవి క్యాష్‌ చేసుకోగలవా అన్నదే ప్రశ్న. అయితే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఇవి ఇప్పటికే తోసిపుచ్చాయి. సంయుక్త కిసాన్‌ మోర్చాకు పట్టు ఉన్న కొన్ని నియోజక వర్గాల్లో భారతీయ కిసాన్‌ యూనియన్‌కి చెందిన రాజేవాల్‌ ఫ్యాక్షన్‌కి రాజకీయ ఆకాంక్షలు ఉన్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్, ఆప్‌ – రెండు పార్టీలూ ఈ ఫ్యాక్షన్‌ని ఆకర్షించగలవు కూడా. తమ సుదీ ర్ఘమైన మొండి పోరాటంలో విజయం సాధిం చిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న రైతు సంఘాలు పంజాబ్‌ ఎన్నికల్లో జయాపజయాలకు సంబంధించి అదనపు అంశంగా ఉండబోతున్నాయి. – రమేష్‌ వినాయక్, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement