రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రపంచ దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన చేపట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. సోమవారం తెల్లాపూర్‌లోని అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేస్తుందని దానిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం విద్యాభివృద్ధికి రూ.పదివేల కోట్లను ఖర్చు చేయాలని సూచించారు.
ధనవంతులు మాత్రమే ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే చైనా లాంటి దేశాలతో పోటీ పడగలుగుతామని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల కొత్తగా ఎనిమిది లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చేరారని తెలిపారు. అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కుల, మతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పెద్దపెద్ద విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో రాజకీయ నాయకులకు సైతం పలు సబ్జెక్టులో శిక్షణ ఇవ్వడంతో పాటు వారు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా శిక్షణ ఇస్తామన్నారు. (క్లిక్: వారు నమ్మనివే... నేడు జీవనాడులు)
Comments
Please login to add a commentAdd a comment