భారతీయ వైద్య చరిత్రలో ప్లేగు వ్యాధిపై పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన తొలి వైద్యుడు డాక్టర్ యశ్వంత్‌రావు పూలే. 1896–97లో బ్యూబోనిక్ ప్లేగు విరుచుకుపడినప్పుడు బొంబాయిలో ప్రత్యేక క్లినిక్ ప్రారంభించి, కులమతాలకు అతీతంగా ప్లేగు రోగులకు సేవ చేస్తూన్న క్రమంలోనే తన తల్లి సావిత్రీబాయి పూలేతో పాటు డాక్టర్ యశ్వంతరావు కన్నుమూశారు. ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఉన్న విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు సాగిస్తున్న కాలంలో ఖండాంతరాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇంకా ఎక్కువ ప్రమాదకారిగా మారనుంది. డాక్టర్ యశ్వంతరావు, సావిత్రీబాయి పూలే వంటి సాహసోపేతులైన వైద్యులు, నర్సులతో కూడిన ఆసుపత్రులు చేసే త్యాగాలు మాత్రమే ప్రపంచాన్ని, భారత్‌ని కాపాడగలవు.
కోవిడ్–19 అటు సంపన్నుల్లో, ఇటు పేదల్లో ప్రపంచవ్యాప్త సంక్షోభాన్ని సృష్టించిందనడంలో సందేహమే లేదు. ప్రతి మనిషిలోనూ ఇప్పుడు నెలకొన్న మృత్యు భయం ప్రపంచవ్యాప్తంగా మానవుల్లోని మంచి, చెడు ప్రవర్తనకు పరీక్షకు గురిచేస్తోంది. విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడిన అన్ని సంస్థలూ, చివరకు మతాలు, మఠాలు, పీఠాలు, సన్యాసులు, సాధువులు, బిషప్‌లు, ముల్లాలు తది తరులందరూ కరోనా విషయమై పరీక్షకు నిలబడాల్సి వస్తోంది. ఈ ప్రాణాంతక సంక్రమణ వ్యాధికి వీరివద్ద ఏ మందూ లేదు మరి. ప్రపంచంలోని మానవులందరూ ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులే తమ ప్రాణరక్షకులని, ఆసుపత్రులు మాత్రమే తమని ప్రాణాలతో నిలిపే దేవాలయాలు అని నమ్మడం మొదలుపెట్టేశారు.
ప్రతి క్షణం, ప్రతి గంటా కరోనాకు సంబంధించిన ప్రమాదాన్ని, ఆందోళనను ఎదుర్కొంటూనే కోవిడ్–19 రోగులకు సేవ చేయడంలో మునిగిపోయిన డాక్టర్లు, నర్సులందరికీ మనం తప్పక సెల్యూట్ చేయాలి. వాటికన్, మక్కా, తిరుపతి, షిర్డీ వంటి అన్ని ఆలయాలూ, చర్చిలూ, మసీదులూ, ప్రపంచంలోని అతి పెద్ద బౌద్ధ విహారాలు కూడా ప్రస్తుతం మూతపడిపోయాయి. భూమ్మీద నిజమైన దేవుడు లేక దేవత అయిన డాక్టర్, నర్సు కోసమే మనం ఇప్పుడు చూస్తున్నాం. నిస్సందేహంగానే, కోవిడ్–19 ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. అదేమిటంటే సైన్స్, మందులతో కూడిన సరికొత్త ప్రపంచం.
ఈ సందర్భంగా భారతీయ వైద్య చరిత్రలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మొట్టమొదటి డాక్టరు గురించి మనం తెలుసుకోవలసి ఉంది. 1897లో భారతదేశంలో బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి విజృం భించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలే, సావిత్రీబాయి పూలేల దత్తపుత్రుడు డాక్టర్ యశ్వంతరావు పూలే నిజంగానే చరిత్రకెక్కారు. 1896–97 కాలంలో బొంబాయిలో ప్రత్యేక క్లినిక్ ప్రారంభించి ప్లేగు రోగులకు సేవ చేస్తూన్న క్రమంలోనే తనను దత్తత తీసుకున్న తల్లి సావిత్రీబాయి పూలేతో పాటు డాక్టర్ యశ్వంతరావు కన్నుమూశారు. సమకాలీన వైద్యులు కూడా అనుసరిం చాల్సిన గొప్ప ఉదాహరణగా ఆయన నిలిచిపోయారు.
తన తల్లిదండ్రుల సామాజిక సంస్కరణోద్యమంలో భాగంగా అన్ని కులాలు, కమ్యూనిటీలకు చెందిన ప్లేగ్ రోగులకు సేవచేసిన మొట్టమొదటి వైద్యుడిగా డాక్టర్ యశ్వంతరావు పూలే చరిత్రలో నిలిచిపోయారు. బ్రిటిష్ పాలకులు కులాలకు అతీతంగా వైద్యసేవలందించడాన్ని తప్పనిసరి చేయడంతో బ్రాహ్మణులు వైద్య వృత్తిని చేపట్టడం నిలిపివేశారు. వర్ణధర్మానుసారం.. బ్రాహ్మణులు చికిత్స సమయంలో కూడా దళితులను, శూద్రులను తాకడానికి ఇష్టపడేవారు కాదు. అప్పుడే పూలే సత్యశోధక్ ఉద్యమం మానవ అస్పృశ్యత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా భారీ ప్రచారాన్ని చేపట్టింది.
పూలే దంపతులకు సంతానం లేకపోవడంతో బ్రాహ్మణ వితంతువు అయిన కాశీబాయి పుత్రుడిని దత్తత తీసుకున్నారు. భర్త మరణానంతరం ఆమె గర్భం దాల్చడంతో పూనాలోని ఛాందస బ్రాహ్మణులు ఆ వితంతువును చంపాలనుకున్నారు. బాలగంగాధర్ తిలక్ సైతం వారి ఈ ప్రయత్నాన్ని బలపర్చడం గమనార్హం. పూలే ఆమెను కాపాడి తమ ఇంట్లోనే ఆశ్రయమిచ్చి తల్లి, బిడ్డలను క్షేమంగా చూసుకున్నారు. 1874లో ఆ వితంతువు కుమారుడు యశ్వంతరావును పూలే దంపతులు దత్తత తీసుకున్నారు. అతడిని విద్యావంతుడిని చేసి వైద్యుడిని చేశారు. తాము ప్రారంభించిన సంఘ సంస్కరణోద్యమంలో పనిచేస్తున్న వ్యక్తి కుమార్తె రాధతో యశ్వంతరావుకు పెళ్లి చేశారు. అది కులాంతర వివాహం. బ్రాహ్మణ పండితులు జరిపే పెళ్లి పద్ధతికి భిన్నంగా దండలు మార్చుకునే సాధారణ పద్ధతిలో ఈ ఇద్దరి పెళ్లి చేశారు. దీంతో పూజారులు ఈ పెళ్లిని కోర్టుకు లాగారు కూడా.
జ్యోతిబా పూలే 1890లో చనిపోయారు. తర్వాత సావిత్రి, ఆమె కుమారుడు తమ సామాజిక, వైద్య సేవలను కొనసాగించారు. సావిత్రీబాయి జీవిత చరిత్రకారుడొకరు ఇలా రాశారు: ‘ప్రపంచ మంతటా వ్యాపించిన మూడవ బ్యూబోనిక్ ప్లేగు సంక్రమణ వ్యాధి 1897లో మహారాష్ట్రలోని నల్లస్పోరా ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు సావిత్రీబాయి, యశ్వంతరావు సాహసోపేతంగా పూనా శివార్లలో ఒక క్లినిక్ ప్రారంభించి ప్లేగ్ వ్యాధికి గురైన రోగులకు సేవ చేశారు. రోగులను సావిత్రీబాయి క్లినిక్‌వద్దకు తీసుకువస్తే యశ్వంతరావు వారికి చికిత్స చేసేవారు. రోగులకు సేవ చేస్తున్న క్రమంలోనే సావిత్రీబాయికి కూడా ప్లేగు సంక్రమించి 1897 మార్చి 10న కన్నుమూశారు’.
ఈ విషాదం అంతటితో ముగియలేదు. అదే సంవత్సరం ప్లేగు వ్యాధికి గురైన డాక్టర్ యశ్వంతరావు కూడా మరణించారు. బ్యూబోనిక్ ప్లేగు అనే ఈ సాంక్రమిక వ్యాధి మానవులు నివాసమున్న అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ఈ వ్యాధి బారినపడి భారత్, చైనాల్లో కోటి 20 లక్షలమంది చనిపోయారు. ఒక్క భారత్‌లోనే కోటిమంది రోగులు చనిపోయారు. ఆ సమయంలో డాక్టర్ యశ్వంత రావు త్యాగం నుంచే భారతదేశంలో వైద్య చికిత్సలు రూపుదిద్దుకున్నాయి. ఆయనలాగే మరొక భారతీయ వైద్యులు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ 1930లలో చైనాలో రోగులకు సేవలు చేసి చరిత్రలో మిగిలిపోయారు. 1938లో రెండో సీనో–జపనీస్ యుద్ధ కాలంలో వైద్యసేవలందించడానికి భారత్‌నుంచి వెళ్లిన అయిదుగురు వైద్య బృందంలో కోట్నీస్ ఒకరు. చైనాలో వైద్యసేవలందిస్తూనే కోట్నీస్ అమరుడయ్యారు.
ఇప్పుడు ఎయిర్ కండిషన్ ఉన్న విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణాలు సాగిస్తున్న కాలంలో ఖండాంతరాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇంకా ఎక్కువ ప్రమాదకారిగా మారనుంది. డాక్టర్ యశ్వంతరావు పూలే, సావిత్రీబాయి పూలే వంటి సాహసోపేతులైన సుశిక్షితులైన వైద్యులు, నర్సులతో కూడిన ఆసుపత్రులు చేసే త్యాగాలతో మాత్రమే ప్రపంచాన్ని, భారత్‌ని కాపాడగలవు. కొన్ని పాలకవర్గ శక్తులు కరోనా వైరస్ గురించి అనేక మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్న పరిస్థితుల్లో, మన సాహసోపైతమైన, త్యాగపూరితమైన వైద్య చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి. మన వైద్య చరిత్రలో త్యాగానికి, బాధను భరించడానికి సంబంధించి డాక్టర్ యశ్వంత్‌రావు ఉత్తమ ఉదాహరణగా నిలబడతారు.
మానవాళిపై కొత్తగా విరుచుకుపడుతున్న కరోనా సాంక్రమిక వ్యాధికి గోమూత్రం, గోవు పేడ టీకా మందుగా ఉపయోగపడతాయని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వీరు అలా నమ్ముతున్నట్లయితే నిక్షేపంగా వాటిని సేవించి నిజమైన క్షేత్రరంగంలో కోవిడ్–19 వైరస్ బారినపడిన వారికి సేవ చేసేందుకు ముందుకు ఉరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రజలు మాత్రం పరీక్షకు నిలబడి.. నిరూపితమైన సైన్సు, మందులు, ప్రయోగశాలలు, డాక్టర్లు, నర్సులపై మాత్రమే ఆధారపడాలి. భారత్ ఇప్పుడు 130 కోట్లమంది ప్రజలున్న దేశం. భారత ప్రజారాశుల్లో చాలామంది తరతరాలుగా తమను వెంటాడుతున్న నిరక్షరాస్యత, అలక్ష్యంతో కూడిన వారసత్వానికి లోబడిపోయి మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, ముక్కును కవర్ చేసుకోవడం, నోటిని తాకకుండా ఉండటం వంటి సంరక్షణ పద్ధతుల గురించి మీడియా, మొబైల్ నెట్‌వర్క్ ప్రజలకు సమాచారం అందిస్తున్నాయి.
అయినప్పటికీ కులతత్వం, అనాగరికత్వం మన నైతిక జీవనానికి మరింత నష్టం కలిగిస్తున్నాయి. సైన్స్, మందులపై విశ్వాసం ఉంచుతున్న కేరళ ప్రభుత్వం కోవిడ్–19 సాంక్రమిక వ్యాధితో ఉత్తమంగా పోరాడుతోందని ప్రధాని నరేంద్రమోదీ సైతం ఆమోదించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తమతమ ప్రాంతాల్లో వైరస్ అంత విస్తృతంగా వ్యాప్తిలో లేనప్పటికీ తగిన సన్నాహక చర్యలను తప్పకుండా చేపట్టాలి. కరోనా వైరస్ నిరోధక పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెడుతున్న నర్సులకు, డాక్టర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మెరుగైన పనిపరిస్థితులను అందచేయాలి. గ్రామస్థాయిలో వైద్యపరమైన వసతిసౌకర్యాలను నెలకొల్పడానికి భారతదేశం మరింత డబ్బును ఖర్చు చేయాలి, మరింతగా వైద్య, పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ అంశంలో మనం చైనానుంచి తప్పక నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటగా చైనాలోనే కరోనా వైరస్ పుట్టినప్పటికీ సైన్స్, మెడిసిన్‌పై అపార విశ్వాసం ఉంచినందుకే ఆ దేశం తక్కువ నష్టాలతో బయటపడటమే కాకుండా వైరస్‌ను పూర్తిగా అరికట్టింది కూడా.
వ్యాసకర్త : ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ
Comments
Please login to add a commentAdd a comment