టీమాస్ జిల్లా సదస్సులో అభివాదం చేస్తున్న నాయకులు
తుర్కయంజాల్ రంగారెడ్డి : రైతుబంధు పథకం భూస్వాము లకే మేలు చేస్తుందని, పేద రైతులకు దీని ద్వారా ఎలాంటి లాభం చేకూరదని టీమాస్ ఫోరం రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. సోమ వారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీమాస్ ఫోరం) రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులతో సదస్సులు నిర్వహించాలని టీమాస్ ఫోరం నిర్ణయించిందని, అందులో భాగంగానే జిల్లా సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందనుకుంటే అందుకు భిన్నంగా ఉందన్నారు.
రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే అధికార మార్పిడి జరగాలని, ఆధిపత్య కులాలు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలతో సామాజిక న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో భూములు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయని, వారికి మాత్రమే పెద్ద ఎత్తున రైతుబంధు పథకం లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 1971 భూ సంస్కరణ చట్టం ప్రకారం 57 ఎకరాల మాగాణి, 27 ఎకరాల వరిపంట ఉండాలని, అలాంటిది ఒక ఎమ్మెల్యే 150 ఎకరాలకు గాను తనకు వచ్చిన చెక్కును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారన్నారు. అంత భూమిని ఒకే కుటుంబం ఎలా కలిగి ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
కౌలురైతుకూ వర్తింపజేయాలి..
రాష్ట్రంలో ముఖ్యంగా కౌలుదారు రైతులు పంటలను వేసి, పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారికి రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని ఐలయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతుల పక్షాన నిలబడ్డ పార్టీలకే టీమాస్ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం 20 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఎకరం భూమి మాత్రమే ఉందని, మిగతా 80 శాతం మందికి భూమి లేదన్నారు.
రైతుబంధు చెక్కుల ద్వారా ఎవరు లబ్ధి చెందారనే దానిపై సర్వే చేసి ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలను జాతీయం చేయాలని, కార్పొరేట్ కళాశాలలు శ్రీచైతన్య, నారాయణ వంటివి రాష్ట్రానికి అవసరం లేదన్నారు. సమావేశంలో టీమాస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, జిల్లా కన్వీనర్ బోడ సామ్యేల్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాగరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అరుణ్‌కుమార్, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి నర్సింహ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment