ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 వేల చెక్కుల చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది. పంట పెట్టుబడికి ప్రోత్సాహకంగా రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్న ‘రైతుబంధు’ చెక్కుల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చెక్కుల గడువు పొడగింపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వీటిని నగదుగా ఉపసంహరించుకోవడానికి మరికొన్ని నెలల గడువు ఇచ్చే అంశంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది.
రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ.8 వేలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండు నెలల క్రితం చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా 2,87,307 మంది రైతులకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యవసాయశాఖ.. ఇందులోభాగంగా ఇప్పటివరకు 2,48,104 మందికి చెక్కులను జారీ చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్యకు అనుగుణంగా చెక్కులను ముద్రించింది.
ఈమేరకు వీటిని పంపిణీ చేయాలని భావించినప్పటికీ 39,203 మంది చెక్కులను స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఇందులో అధికశాతం ప్రవాస భారతీయులేనని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. విదేశాల్లో స్థిరపడినవారి సంఖ్య గణనీయంగా ఉండడం.. సంపన్న వర్గాలు, ఇతర సెలబ్రిటీలకు జిల్లా పరిధిలో భారీగా వ్యవసాయ భూములుండడంతో రైతుబంధు కింద సాయం తీసుకునేందుకు ఆయా వర్గాలు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
ఎన్‌ఆర్‌ఐలు మాత్రం అందబాటులో లేకపోవడం.. పాస్ పుస్తకాలను ఎప్పుడైనా తీసుకోవచ్చనే ధీమాలో చెక్కులను అంతగా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటి కోసమే స్వగ్రామాలకు రావాలనే ఆలోచన లేకపోవడంతో ఇవి వ్యవసాయ శాఖ అధికారుల వద్దే మూలుగుతున్నాయి. ఏప్రిల్ 19, మే 1, 10, 15వ తేదీల్లో చెక్కులను ప్రింట్ చేసిన ప్రభుత్వం వాటి చెల్లుబాటు గడువు మూడు నెలలు అంటే.. జూలై 19, ఆగస్టు 1, 10, 15వ తేదీతో ముగియనుంది. ఈనేపథ్యంలో వ్యవధి ముగుస్తున్న చెక్కుల పరిస్థితి ఏంటనే ప్రశ్న అధికారుల మదిని తొలుస్తోంది.
రూ.31.05 కోట్లు పెండింగ్!
గురువారం నాటికీ 2.81 లక్షల చెక్కుల పంపిణీ చేసిన యంత్రాంగం.. దాదాపు రూ.252 కోట్ల మేర సాయాన్ని రైతుబంధు కింద అన్నదాతకు అందజేసింది. మరో 39,203 చెక్కులు పెండింగ్‌లో ఉండడంతో రూ.31.05 కోట్ల సొమ్ము బ్యాంకులో భద్రంగా ఉంది. ప్రవాస భారతీయలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చెక్కులు తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంతో మగ్గుతున్న చెక్కుల విషయంలో ముందడుగు వేసే అంశంపై ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం లేఖ రాసింది.
విత్‌డ్రా గడువు ముగిసిన తర్వాత చెక్కులను రిటర్న్ చేయాలని ఇదివరకే స్పష్టం చేసినందున.. ఈ అంశంపై స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చెక్కుల వినియోగంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. చెక్కులను మళ్లీ ముద్రించడం.. వాటిలో తప్పొప్పులను పరిశీలించడం పెద్ద ప్రహసనం కావడంతో ఇవే చెల్లుబాటు అయ్యే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా చెక్కుల కాలం ఆధారపడి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కొత్తగా 10,456 పాస్ పుస్తకాలు
వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టిన పాస్ పుస్తకాల జారీకి రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా కొత్తగా 10,456 పట్టాదారు పాస్ బుక్కులను త్వరలోనే రైతులకు పంపిణీ చేయనుంది. ఈమేరకు ఈ రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించేందుకు చెక్కుల ముద్రణ చేపట్టడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ తయారు చేస్తోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదలాయింపు(సక్సేసన్) తదితర కేటగిరీల కింద 10,456 పాస్ పుస్తకాలను ఇవ్వాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు ఈ పాస్‌పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణం లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment