కేబినెట్‌ పొందికపై ఇంత చర్చా? | Kanche Ilaiah Article On Cabinet Reshuffle | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ పొందికపై ఇంత చర్చా?

Published Sat, Jul 17 2021 12:28 AM | Last Updated on Sat, Jul 17 2021 4:00 AM

Kanche Ilaiah Article On Cabinet Reshuffle - Sakshi

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ చేయడం తెలిసిందే. కొత్తగా 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఆదివాసీలకు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మొత్తం మీద తాజాగా కేంద్ర మంత్రిమండలిలో 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు చోటు లభించింది. ఈ 47 మందిలో ప్రధాని కూడా ఉన్నారో లేదో నాకు తెలీదు. కానీ, కేబినెట్‌లో కొత్తగా చేరిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి జాతీయ మీడియా పదేపదే ప్రస్తావించింది. మరోవైపున రవిశంకర్‌ ప్రసాద్, ప్రకాష్‌ జవదేకర్, హర్షవర్ధన్‌ల రాజీనామాలపై ఇదే మీడియా తెగ బాధపడిపోయింది. ఈ ముగ్గురినీ కేబినెట్‌ లోంచి తొలగించడాన్ని మన మీడియా ఏమాత్రం జీర్ణం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు వీరి కులం తప్పనిసరిగా పరిగణించాల్సిన చిహ్నంగా మారిపోయింది. అయితే మోదీ మంత్రివర్గంలోంచి వైదొలిగిన ముగ్గురు ప్రతిభావంతులైన మంత్రుల కుల నేపథ్యం గురించి ఒక్కసారైనా మన మీడియా పేర్కొనలేదు. ఎన్నటికీ పేర్కొనదు కూడా. రవిశంకర్‌ ప్రసాద్‌ కాయస్థుడు, ప్రకాష్‌ జవదేకర్‌ బ్రాహ్మణుడు, హర్షవర్ధన్‌ వైశ్యుడు. రవిశంకర్, జవదేకర్‌ రాజ్యసభ సభ్యత్వం ద్వారానే మంత్రివర్గంలో ప్రవేశించారు.

సాధారణంగా జాతీయ మీడియా జాట్, గుజ్జర్, పటేల్, మరాఠా, రెడ్డి (తెలంగాణ నుంచి జి. కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించిన ఏకైక రెడ్డి అని గుర్తుంచుకోవాలి), కమ్మ, కాపు, లింగాయత్, వొక్కలిగ, నాయర్, నాయికర్లు, మహిస్యా (బెంగాల్‌ నుంచి) తదితర పలు కులాలకు చెందినవారిని ఓబీసీ కేటగిరీలో చేరుస్తుంటుంది. అయితే శూద్ర ఓబీసీలు (రిజర్వుడ్, రిజర్వుడ్‌ కాని వారు కూడా), ఎస్సీలు, ఎస్టీలు కలిసి భారత జనాభాలో 77 శాతంగా ఉన్నారని మనం మర్చిపోకూడదు. వీరిలో 52.2 శాతం మంది ఓబీసీలు (1980 నాటి మండల్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం) కాగా, 16.2 శాతం మంది ఎస్సీలు, 8.2 శాతం మంది ఎస్టీలు (2001 జనాభా లెక్కల ప్రకారం) ఉంటున్నారు. వీరినుంచి కేంద్ర మంత్రిమండలిలో సగం కంటే ఎక్కువమందికి మంత్రిపదవులు లభిస్తే.. ఇది కూడా ఎందుకింత ప్రతికూల వార్తగా మారిపోతోంది?

రాజీవ్‌ గాంధీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ పార్టీలోనూ, అటు బీజేపీలోనూ... విదేశాల్లో చదువుకుని వచ్చి (ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్‌ వాలాలు) చేరినవారు ఎవరూ ఒక ఎన్నికలోనూ నేరుగా గెలవలేదు. రాజ్యసభ ద్వారానే వీరు ప్రభుత్వంలో భాగమవుతూ వచ్చారు. కానీ మన జాతీయ మీడియా మాత్రం ఇలాంటివారిని మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య ప్రతినిధులుగా పేర్కొంటూ వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం పునాది ఏదంటే క్షేత్ర స్థాయి ఎన్నికలే.

వీపీ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ నివేదికను 1990లో అమలు చేసినప్పుడు మోదీతోసహా ఓబీసీలు బీజేపీలో భాగంగా ఉండేవారు. వీరు మండల్‌ కమిషన్‌ జాతి వ్యతిరేక ఎజెండాను కలిగి ఉన్నదని ఆలోచించారు. కానీ ఇది గ్రామీణ వ్యవసాయ, హస్తకళల కమ్యూనిటీల్లో భారీ స్థాయిలో అధికారిక చైతన్యాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ తన ఓబీసీ కార్డును చక్కగా ఉపయోగించుకుని దేశ ప్రధాని కాగలిగారు. కానీ ఓబీసీ, దళిత, ఆదివాసీలకు  చోటు లేనిచోట, రాజ్యసభ ద్వారా అధికారాన్ని సాధించుకోవడం కుతంత్రపు రాజకీయాలకు ఒక మార్గంలా మారిపోయింది.

మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ 20 ఏళ్లపాటు పార్లమెంటులో కొనసాగారు. మేధోవర్గానికి చెందినవారిగా పేరొందిన పి. చిదంబరం (కొన్నిసార్లు ఎన్నికల్లో గెల్చినప్పటికీ), జైరాం రమేష్, తదితరుల చరిత్ర కూడా ఇలాంటిదే. రవి శంకర్‌ ప్రసాద్, ప్రకాష్‌ జవదేకర్‌ రాజ్యసభలో హీరోలుగా వెలిగిపోయారు. కాగా వీరికోవకే చెందిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇంగ్లిష్‌ ప్రెస్‌కి మిత్రులైన బీజేపీ క్యాంప్‌కి చెందిన అరుణ్‌ జైట్లీ, ప్రమోద్‌ మహాజన్, అరుణ్‌ శౌరీలు కూడా ఎన్నడూ ఎన్నికల్లో గెలవలేదు. కానీ రాజ్యసభ ద్వారానే వీరు అగ్రశ్రేణి మంత్రులై ప్రముఖ నేతలుగా మారిపోయారు.

అదే సమయంలో శూద్ర, దళిత, ఆదివాసీ నేతలకు ఇలాంటి భాగ్యం ఎన్నడూ సిద్ధించలేదు. అయితే, కేంద్ర మంత్రివర్గంలో చేరిన ఈ 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చాలావరకు క్షేత్రస్థాయి ఎన్నికల్లోనే గెలుపొందుతూ వచ్చారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఏ పార్టీ పాలనలో అయినా సరే ప్రచ్ఛన్న మేధోతత్వంతో రాజ్యసభ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగం కావడం ప్రజాస్వామిక పద్ధతి కానేకాదు. రవిశంకర్‌ ప్రసాద్, ప్రకాష్‌ జవదేకర్‌లను నిర్దాక్షిణ్యంగా మంత్రివర్గం నుంచి తొలగించడం ద్వారానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మంత్రులకు అవకాశం దొరికిందని మీడియా తెగ బాధపడిపోతోంది. ఇది ప్రతిభకు అన్యాయం చేయడమేనని మన జాతీయ మీడియా భావిస్తోంది. మన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లిష్‌ మాట్లాడే మేధావితనం అనే కదా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చిన శూద్రులకు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చడం కూడా ప్రజాస్వామ్యమే. వీరిలో చాలామంది పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుంటారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యవస్థనే రద్దు చేస్తే సరిపోతుంది కదా.

మనం ఇప్పుడు అస్తిత్వాల యుగంలో నివసిస్తున్నాం. వివిధ ప్రజా బృందాలు తమదైన దార్శనికత, సమర్థతతో ప్రజాస్వామ్య పాలనలో భాగం కావాలనే తమ హక్కును ఇప్పుడు నొక్కి చెబుతూ వస్తున్నాయి. విభిన్న సెక్షన్ల ప్రజానీకం ఇప్పుడు ‘సమర్థత’ను విభిన్న అర్థాలతో చూస్తోంది. కమ్యూనిటీ అస్తిత్వాలు అధికారం కోసం మన పాలనకు సంబంధించిన చర్చల బల్లపైకి నిరంతరం తోసుకువస్తూనే ఉంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా కుల, కమ్యూనిటీ అస్తిత్వాలను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. కానీ భవిష్యత్తులో ఈ వ్యూహం పనిచేయదు. కులాన్ని ఒక అస్తిత్వ చిహ్నంగా గుర్తించని కారణంగానే కమ్యూనిస్టు పార్టీలు మన దేశంలో రానురానూ అడుగంటిపోతున్నాయి.

భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏకైక మార్గం ఏదంటే, ఇన్ని సంవత్సరాలుగా ఢిల్లీ అధికార కేంద్రాల్లో పక్కకు నెట్టివేయబడిన పై కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం కల్పించడమే. కులం కీలకమైన సామాజిక ఆర్గనైజర్‌గా ఉంటున్న దేశంలో, సెక్యులర్‌ ఉదారవాదం అనేది ద్విజ, ఇంగ్లిష్‌ విద్యావంతులైన కులీనుల చేతిలో అధికారం దుర్వినియోగం కావడంగానే మిగిలిపోయింది. పీడిత కులాలు తమ ఓట్లకున్న అధికార బలం పట్ల చైతన్యవంతంగా ఉంటున్నారని ఆరెస్సెస్, బీజేపీలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. అధికార చట్రంలో తమ ప్రతినిధులకు చోటు లేకపోతే వీరు మరో దారి చూసుకుంటారు కూడా. కాంగ్రెస్‌లో మాత్రం అధికారమనేది ఎప్పుడూ దిగుమతైన మేథావుల చేతుల్లోనే ఉంటూ వచ్చింది కాబట్టి కుల విశ్లేషణను ఎన్నడూ తీవ్రంగా తీసుకోలేదు.

వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను కుల అస్తిత్వం ప్రాతిపదికన మాత్రమే పాలనా వ్యవస్థల్లోకి తీసుకురావాలని నేను సూచించడం లేదు. దళిత బానిసలను పాలనలో, ప్రభుత్వంలో లాంఛనప్రాయంగా చొప్పించడాన్ని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ మండల్‌ అనంతర కాలం... విద్యావంతులైన దళిత, ఆదివాసీ, ఓబీసీ నేతలను, మేధావులను రూపొందిస్తూ వచ్చింది. గతకాలం మహానేతల ఘనతను మాత్రమే భవిష్యత్తు ఇకపై కీర్తించదు. ఇప్పుడు యువ గళాలు మార్పును నిజంగానే తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాయని అందరూ గుర్తించాల్సి ఉంది.


ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, షెపర్డ్‌
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement