మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్‌సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.
రైల్వే, టెక్స్‌టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్‌సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు.
ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్‌ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు.
విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment