ఆందోళనజీవులంటే ఇంత కంపరమా? | Professor Kanche Iylaiah Article On Protests In India | Sakshi
Sakshi News home page

ఆందోళనజీవులంటే ఇంత కంపరమా?

Published Thu, Mar 11 2021 12:48 AM | Last Updated on Thu, Mar 11 2021 3:32 AM

Professor Kanche Iylaiah Article On Protests In India - Sakshi

తాను స్వయంగా ఓబీసీల నుంచే వచ్చానని చెప్పుకుంటున్న ప్రధాని ఇప్పుడు దేశంలోని రైతులను ఆందోళనజీవులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. వీరి నుంచి దేశాన్ని కాపాడాలంటున్నారు. ఆహార ఉత్పత్తిదారులు లేని దేశం గతేంటి? ప్రధానే స్వయంగా రైతుల్ని జాతివ్యతిరేకులని ముద్రిస్తున్నప్పుడు జైకిసాన్‌కు అర్థమేంటి? దేశంలో ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్ర ఓబీసీలు, కరోనా కాలంలోనూ దేశానికి తిండిపెట్టిన ఓబీసీలు ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. అలాగే తాము మద్దతిస్తున్న రాజకీయ పార్టీల స్వభావం ఏంటో తాము మద్దతిస్తున్న పార్టీలు తమకు ఎలాంటి స్థాయిని ఇస్తున్నాయో తప్పకుండా ఆలోచించుకోవాలి. 

దేశ చరిత్రలో తొలి ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆందోళనజీవులను గుర్తించి జాతిని కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భారతీయులకు ఆహార ధాన్యాలను పండించి ఇచ్చే ఏకైక సామాజిక శక్తి అయిన రైతులను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు. ఇంతకూ రైతులు చేసిందల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమే. ఆందోళన అనే భావనకు రెండు అర్థాలున్నాయి. ఒకటి చింత మరొకటి నిరసన లేక ఆందోళన. తెలుగులో ఈ పదాన్ని గ్రామస్తులందరూ చింతలను వర్ణించే సందర్భంలో ఉపయోగిస్తుంటారు. అదొక పెద్ద ఆందోళన అని వారు అన్నారంటే చాలా కలవరం కలిగించే అంశమని అర్థం. తరచుగా మాత్రమే దీన్ని నిరసన లేక ఆందోళన అనే అర్థంలో వాడుతుంటారు.

విషాదకరమైన అంశం ఏమిటంటే, భారతీయ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో పాల్గొనే శ్రామిక ప్రజారాసులు తమ రోజువారీ జీవితంలో నిత్యం ఆందోళనకు గురవుతూనే ఉంటారు. ప్రత్యేకించి రైతులు.. అనేక కారణాలతో ప్రతిరోజూ కలవరపడుతూనే ఉంటారు. మొట్టమొదటిగా కుల వ్యవస్థ రైతుల జీవితాల గురించి కలతపడేలా చేస్తుంటుంది. బ్రాహ్మణవాద భావజాలంలో వ్యవసాయ ఉత్పత్తికి పవిత్రమైన లేక ఉన్నత స్థాయిని ఇవ్వలేదు. రెండోది, భారతీయ తత్వశాస్త్రం అని వారు చెబుతున్న దానిలో వ్యవసాయానికి చారిత్రకంగానే అత్యంత నిమ్న దృష్టితో  చూస్తూవచ్చారు. చారిత్రకంగానే కాదు.. ఇప్పుడు సైతం భారతీయ ఆహార ఉత్పత్తిదారులు ప్రధానంగా శూద్రులు,  దళితులు, ఆదివాసులే. అయితే పశువులు, ఇతర వ్యవసాయ వనరులు వంటి ఆర్థిక సంపదలను ఉన్నత శూద్ర కులాల వారి యాజమాన్యంలో ఉంటున్నాయి కాబట్టి వీరే ఉత్పత్తిలో కీలక సామాజిక శక్తిగా గుర్తింపు పొందుతున్నారు.

మన దేశంలో ఆహార ఉత్పత్తి దారులు శూద్రులు, దళితులు, ఆది వాసీలేనని ప్రధాని మోదీకి తెలుసు. ఆధిపత్య కులాలలో దాదాపుగా ఎవరూ భూమిని దున్నడం, పశువులను మేపడం వంటి పనుల్లో కనిపించరు. వీరు రైతులలాగా ఆందోళన జీవులు కారు. ఎందుకంటే వీరి ప్రాధమ్యాలు వేరు. వీరు చాలావరకు నగరీకరణ చెందిన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గానికి చెంది ఉన్నారు. వీరితో పోలిస్తే రైతులు నిత్యం కలవరపడుతూనే ఉంటారు. ఉత్పత్తి చేయని వ్యతిరేక వర్గంలో ఉంటూ, తమ పౌర, ఆధ్యాత్మిక, ఆర్థిక జీవనాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండేవారి వల్లే రైతులు నిత్య ఆందోళనతో గడుపుతుంటారు. ఒక ఓబీసీ తరగతికి చెందినవాడిగా మోదీ శూద్ర ఆహార ఉత్పత్తి దారుల ఈ ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉండింది. రైతుల్లో నిత్యం ఏర్పడుతున్న చింతలు, కలవరపాటే వారిని ఆందోళనా కార్యకలాపాలకు కొన్ని సార్లు ఆత్మహత్యలకు పాల్పడటానికి దారి తీస్తుం టాయి. ప్రధాని ఈ తరహా ఆందోళనను పట్టుకునే ఆందోళనజీవులు అని పదప్రయోగం చేశారు. ప్రాథమికమైన ఆహార ఉత్పత్తిలో ఎన్నడూ పాల్గొనకున్నప్పటికీ శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఆందోళన జీవులను దోపిడీ చేస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విమర్శించలేదు. అదే సమయంలో నా జీవిత కాలంలోనే అనేక సందర్భాల్లో హిందుత్వ శక్తులు ఆందోళనల్లో పాల్గొన్నాయి. నరేంద్రమోదీ సైతం ఆరెస్సెస్, బీజేపీల్లో భాగమై అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటూవచ్చారు. ఆయన పాల్గొన్న అతిపెద్ద ఆందోళనల్లో రామజన్మభూమి ఆందోళన ఒకటి. ఆ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నది రైతులు కాదు.. అసంఖ్యాకంగా సాధువులు, సన్యాసులు ఇందులో పాల్గొన్నారు.

విద్య, ఉపాధి కోసం కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించడానికి శూద్ర ఓబీసీ కమ్యూనిటీలకు ఈ దేశంలో రిజర్వేషన్‌ హక్కు కల్పించినప్పుడే రామజన్మభూమి ఆందోళన చెలరేగిందని గుర్తించాలి. ఆరెస్సెస్, బీజేపీ శ్రేణులలో ఓబీసీ నేతగా ఉంటూవచ్చినప్పటికీ మోదీ ఎన్నడూ రిజర్వేషన్‌కు అనుకూలంగా మాట్లాడలేదని కూడా గుర్తిం చాలి. అదే సమయంలో మండల్‌ ఉద్యమాన్ని తోసిపుచ్చడానికి చాలామంది ఓబీసీలు ప్రారంభించిన కమండల ఉద్యమంలో మాత్రం మోదీ చాలా చురుకుగా పాల్గొన్నారు. వాస్తవానికి మండల్‌ ఉద్యమం ద్వారా లాభపడిందెవరు? ఈ దేశ ఆహార ఉత్పత్తిదారులకు ఎక్కువగా లబ్ధి కలిగించిన ఉద్యమం ఇది. కానీ హిందూ ఇండియన్లకు రిజర్వేషన్లను ఆరెస్సెస్, బీజేపీలు ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చాయి? చివరకు ఓబీసీలకు చెందిన మోదీ సైతం మండల్‌ ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకించారు. ఈ ఓబీసీలే తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆందోళనజీవులుగా ఉంటూ వచ్చారు.

హిందుత్వ శక్తులు పాల్గొన్న ఇతర ఆందోళనలు కూడా చాలానే ఉన్నాయి. 1966 నవంబర్‌ 6న ఇందిరాగాంధీ సాపేక్షంగానే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో గోవధను దేశవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ నాగా సాధువుల బృందం పార్లమెంటులోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక పోలీసును నిరసకారులు చంపేశారు. పోలీసులు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు గోరక్షకులు చనిపోయారు. వలసపాలన తర్వాత భారత పార్లమెంటుపై జరిగిన తొలి పెనుదాడిగా ఈ ఘటన నిలిచిపోయింది. భారతీయ జనతాపార్టీ పూర్వ రూపమైన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్, జన సంఘ్‌లు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. పార్లమెంటుపై దాడికి అనుకూలంగా పలు సభలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్పహించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేశారు.

పైగా ఆహారం పండే బురద నేలలో ఈ తరహా ఆందోళన జీవులు ఏరోజూ చేయి పెట్టి ఎరగరు. అలాగని ఆవు వేసే పేడను కూడా వీరు ఎత్తడం చేయరు. ఆరెస్సెస్‌ తీసుకొచ్చిన చరిత్ర గ్రంథాల్లో శూద్రుల గురించి ఒక్కటంటే ఒక్క సానుకూలమైన ప్రతిపాదన కూడా చేసినట్లు కనపడదు. కానీ ఇదే శూద్ర రైతుల పిల్లలు విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో తమకు కాసింత రిజర్వేషన్లు కల్పించాలని కోరినప్పుడు ఆరెస్సెస్‌ అధికార వాణి ఆర్గనైజర్‌ ఏం రాసిందో చూడండి. ‘‘శూద్ర విప్లవం కలి గించే ఫలితాలను ఎదుర్కోవడానికి నైతిక, ఆధ్యాత్మిక శక్తులను తక్షణం నంఘటితం చేయవలసిన అవసరం వచ్చిపడింది.’’ (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2021 ఫిబ్రపరి 10).  ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆందోళనను హిందూజాతీయవాద అందోళనగా నిర్వచించినప్పుడు శూద్ర ఆహార ఉత్పత్తిదారులు, ప్రాంతీయ పార్టీ నేతలు, కార్యకర్తలు వారి గుప్పిట్లోకి వెళ్లిపోయారు. హిందుత్వ శక్తులు వర్ణిస్తున్న దేశంలో తమను కూడా ద్విజులకు మల్లే సమానస్థాయిని ఇస్తారని వీరు భ్రమించారు. కాంగ్రెస్‌ మైనారిటీలను బుజ్జగిస్తోందన్న ప్రచారాన్ని వీరు నమ్మేశారు. మండల రిజర్వేషన్‌ ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం ద్వారా శ్రామికులను దొరలుగా మార్చేస్తుందని జాట్లు, పటేళ్లు, మరాఠాలు, కుర్మీలు, కమ్మ, రెడ్డి తదితర కులాల వారు భావించారు.

కరోనా మహమ్మారి కాలంలో ప్రధాని మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించినప్పుడు నిజమైన శూద్ర విప్లవం మొదలైంది. స్థానిక మార్కెట్లలో తమ పంటలను తామే అమ్ముకునే హక్కును రైతులనుంచి హరించి అగ్రి–మార్కెట్లకు, గుత్తాధిపత్య సంస్థలకు కట్టబెట్టే చట్టాలివి. తాను స్వయంగా ఓబీసీల నుంచే వచ్చాననీ చెప్పుకుంటున్న ఇప్పుడు దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను ఆందోళన జీవులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. వీరి నుంచి దేశాన్ని కాపాడాలంటున్నారు. ఆహార ఉత్పత్తిదారులు లేని దేశం గతేంటి? జైకిసాన్‌కు అర్థమేంటి? ఇప్పుడు ఉత్తరాదిలో రైతుల ఆందోళనను నడుపుతున్న జాట్లు 2019 ఎన్నికల్లో బీజేపీ సరసన నిలిచారు. దేశంలోని ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్ర ఓబీసీలు ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. అలాగే తాము మద్దతిస్తున్న రాజకీయ పార్టీల స్వభావం ఏంటో తాము ఉంటున్న పార్టీలు తమకు ఏ స్థాయినిస్తున్నాయో తప్పకుండా ఆలోచించుకోవాలి.

ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత,
సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement