LPG Price Hike: BRS To Stage Protests Against Gas Price Hike In Telangana - Sakshi
Sakshi News home page

గ్యాస్‌ మంటపై రేపు నిరసనలు 

Published Thu, Mar 2 2023 2:05 AM | Last Updated on Thu, Mar 2 2023 9:08 AM

BRS to hold protest rallies across TS on Friday against cylinder price hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాన మంత్రి మోదీ వంటగ్యాస్‌ ధరలు పెంచారంటూ భారత రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో వినూత్న కార్యక్రమాలతో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో ఆయన బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన వెంటనే ప్రతిసారీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. గృహావసరాల సిలిండర్‌ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్‌ ధరను రూ. 350 మేర భారీగా పెంచడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన కానుకా..? అని ప్రశ్నించారు.

మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్‌ ధర ఈరోజు రూ. 1160 దాటి రూ.1200 వరకు పెరిగిందన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీమ్‌ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారీగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ, వారిని సిలిండర్‌లకు దూరం చేస్తోందని విమర్శించారు. ఈ పథకంలో సిలిండర్లు పొందిన మహిళలు ఇప్పుడు వాటిని కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేయాల్సిన పరిస్థితులు తలెత్తాతయని ఆందోళన వ్యక్తం చేశారు.

పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అడ్డగోలుగా గ్యాస్‌ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు అన్ని వర్గాల వారూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజల కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విధంగా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ శుక్రవారం నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement