రేవంత్, మోదీ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌కు మోదీ.. ఇప్పుడు మోదీకి రేవంత్ సహకరిస్తున్నడు
తెలంగాణకు ఏం చేశారని బీజేపీకి ఓటెయ్యాలి
రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం: బీఆర్‌ఎస్ శ్రేణుల సమావేశంలో కేటీఆర్
వికారాబాద్: ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఇద్ద రూ తెలంగాణకు సమాధి కట్టేందుకు కలిసి పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ’’అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ రేవంత్‌కు సహకారం అందించిండు.. .ఇప్పుడు రేవంత్ మోదీకి సహకరిస్తున్నడు’’అని ఆరోపించారు. బుధవారం వికారాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఓ గుంపు మేస్త్రీ.. ప్రధాన మంత్రి ఓ తాపీ మేస్త్రీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
’’ప్రధానిగా మోదీ పదేళ్ల పాలన వెలగబెట్టిండు.. పేదలకే కాదు దేశానికి కూడా చేసిందేమీ లేదు.. అందుకే ఇప్పుడు ఎన్నికలు రాగానే రాముని పేరుతో ఓట్లడుగుతుండు. రాముడు మన క్కూడా దేవుడే.. రాముడికి మనం కూడా మొక్కుదాం.. కానీ బీజేపీని పండబెట్టి తొక్కుదాం’’అని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసిన మోదీకి ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు.
మోదీ మన ప్రియమైన ప్రధాని కాదు.. ఆయన ఓ పిరమైన ప్రధాని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీకి ఓట్లేయాలి.. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చారని ఓట్లేయాలా...? రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా...? రూ. 15 లక్షలు పేదల అకౌంట్లో వేశారా..? అని నిలదీశారు. బీజేపీ నాయకులు చెబుతున్నట్టు మోదీ హవా ఉంటే పక్క పార్టీల నుంచి ఎందుకు క్యాండెట్లను తెచ్చుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
పదేళ్ల నిజానికి, అబద్ధాలకు పోటీ ఇది
కాంగ్రెస్ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు.. పదేళ్ల నిజానికి వందేళ్ల అబద్ధాలకు మధ్య జరుగుతున్న పోటీ ఇది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను మోసం చేసి వెళ్లిపోయిన వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. ’’బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల లిస్టు చూడండి అందరూ మన పార్టీ నుండి పోయిన వారేనని’’అన్నారు. ’’సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా పరిపాలన నాచేతిలో లేదు.. ఎన్నికల కమీషన్ చేతిలో ఉంది అంటున్నాడు.
రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నడు.. ఓడిపోతామని తెలిసే మల్కాజ్‌గిరి, చేవెళ్లలో డమ్మి అభ్యర్థులను పెట్టిండు.. కత్తెర జెబులో పెట్టుకుని తిరిగేందుకు రేవంత్ ఏమైనా బోటి కొట్టెటోడా..?’’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విశ్వేశ్వర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఇద్దరూ విశ్వాస ఘాతకులే అని కేటీఆర్ విమర్శించారు. కష్టకాలంలో పోటీకి సిద్ధమైన బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు
బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొన్నారు. పార్టీ నేతలు మహమూద్ అలీ, ఫారుక్ హుస్సేన్‌లకు కేటీఆర్ ఖర్జూరం తినిపించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేత పద్మారావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment