సీపేజీ ప్రాంతంలో రాక్టో తొలగింపు
సాక్షి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్ట భద్రతపై నెలకొన్న సందేహాలకు పుల్‌స్టాప్‌పడనుంది. నిండుకుండలా ఉండాల్సిన మిడ్‌మానేరు 2 టీఎంసీల నీటి నిలువలకు పడిపోవడం వెనుక రిజర్వాయర్ కట్ట పటిష్టంగా లేకపోవడమే కారణమని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రతినిధి బృందం పలుమార్లు కట్టను సందర్శించి, రిజర్వాయర్ నుంచి లీకవుతున్న నీరుకు అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంలో కట్ట అడుగుభాగాన్ని పునర్నిర్మించడం ఒక్కటే మార్గమని తేల్చారు. ఈ మేరకు బోగంఒర్రె ప్రాంతంలో 200 మీటర్ల పొడవున కట్ట అడుగుభాగంలో పునాదిగా వేసిన రాతి కట్టడాల(రాక్టో నిర్మాణాలు)ను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి పనులు ప్రారంభించిన అధికారులు శనివారం కూడా కొనసాగించారు. కట్ట అడుగు భాగంలో పదిమీటర్ల లోతు, పది మీటర్ల వెడల్పులో తవ్వకాలు జరిపి, తిరిగి పటిష్టవంతంగా మట్టితో నింపాలని నిర్ణయించినట్లు సమాచారం.
చర్చనీయాంశంగా రాక్టో తొలగింపు
మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై గత ఆగస్టు నెలలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పెరగడంతో నీటిని దిగువన ఉన్న మిడ్‌మానేరుకు వదిలిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాజన్న సిరిసిల్ల ఎస్‌పీ రాహుల్ హెగ్డే సహకారంతో 25 గేట్లు ఎత్తి నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేశారు. అంత అర్జెంట్‌గా నీటిని ఎందుకు విడుదల చేశారన్న అంశంపై అనుమానాలు వ్యక్తమైనా.. ఎల్లంపల్లి నుంచి మళ్లీ నీటిని నింపేందుకే అనుకున్నారు. 10 టీఎంసీల నీటిని దిగువకు వదిలిన అధికారులు మళ్లీ మిడ్‌మానేరు నింపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ బృందం స్పందించారు. ‘మిడ్‌మానేరుకు ఏమైంది?’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టు భద్రతపై పడింది. ఈ నేపథ్యంలో లీకేజీ కాదు సీపేజీ అంటూ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి స్పందించారు. ‘సాక్షి’ దినపత్రికలో మిడ్‌మానేరు ప్రాజెక్టు భద్రత, రిజర్వాయర్ నీటిని పూర్తిగా దిగువకు వదలడం అంశాలపై వరుస కథనాలు ప్రచురించడంతో అందరి దృష్టి ప్రాజెక్టుపై పడింది.
ఆసక్తి రేపిన కట్ట నాణ్యత పరీక్షలు
మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట భద్రతపై పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, అధికారులు ప్రాజెక్టుకు పలు పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో కట్టపైన ఫిజోమీటర్లను ఏర్పాటు చేశారు. బోగెంఒర్రె పరిసరాల్లో కట్ట నాణ్యత, భద్రత అంశాలు పరిశీలించడానికి ఢిల్లీకి చెందిన పర్సాన్ అనే సంస్థతో నీటిపారుదల శాఖ అధికారులు పలు రకాల జియో ఫిజికల్ టెస్టులు(పరీక్షలు) చేయించారు. ఇందులో భాగంగా కట్ట కింద 25 మీటర్ల లోతులో పలు చోట్ల ఎలక్ట్రికల్ సర్వే చేశారు. ఎలక్ట్రికల్ సర్వేలో భూమి అడుగు భాగానా.. తవ్వే అవసరం లేకుండా భూమి కింద 25 మీటర్ల లోపల కట్ట పరిస్థితి ఎలా ఉంది అనే విషయం తెలుస్తుంది. దీనికోసం అధికారులు కట్ట కింద ఎలక్ట్రికల్ సర్వేలు, సెప్మో రిట్రాక్టివ్(కట్ట స్కానింగ్) టెస్టులు చేశారు. దీంతో లోపల కట్ట బలంగా ఉందా..? రాక్ ఉన్నదా.. మట్టి బలంగా ఉందా.. లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఈ టెస్టులన్నీ ఇటీవల పూర్తి చేశారు. టెస్టులపై ఢిల్లీ సంస్థ ఇచ్చిన నివేదిక అనంతరం డ్యాం సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును సందర్శిస్తారని అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చర్యలకు శ్రీకారం చుట్టారు.
200 మీటర్లు వెడల్పు... 10 మీటర్ల లోతు
ప్రాజెక్టు కట్ట నుంచి సీపేజీ జరుగుతున్న బోగం ఒర్రె ప్రాంతంలో 2475 నెంబర్ నుంచి 2675 నెంబర్ వరకు 200 మీటర్ల పొడవున కట్ట కింద సుమారు రాతి కట్టడాల(రాక్టో)ను తొలగిస్తున్నారు. 10 మీటర్ల లోతు, వెడల్పులో రాతి నిర్మాణాలను తొలగించి తిరిగి పనులు చేస్తున్నారు. కట్టకింద భాగంలో తొలగించడం వల్ల కట్ట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నందున 200 మీటర్ల మేర పూర్తిగా కొత్త నిర్మాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాక్టో తొలగింపునకు పెద్ద మొత్తంలో జేసీబీలు, టిప్పర్లు వాడుతుతున్నారు. 200 మీటర్ల మేర కట్ట కిందనే తొలగిస్తారా? లేదా మొత్తం తొలగిస్తారా..? రాక్టో తొలగింపుల అనంతరం డ్యాం సేఫ్టీ, సెంట్రల్ డిజైనింగ్ అధికారులు ఏమంటారు..? తదితర సందేహాలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కాగా శనివారం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్, మిడ్‌మానేరు ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్ కట్టను సందర్శించారు. కట్టకు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాగా రిటైర్డ్ ఇంజినీర్ల బృందం కూడా శనివారం మరోసారి మానేరు కట్టను సందర్శించింది. 200 నుంచి 300 మీటర్ల పొడవున కట్టను పునర్నిర్మించాలని అధికారులు సూచించారు.
గతంలో ఓసారి తెగిన కట్ట
మిడ్‌మానేరు రిజర్వాయర్ నిర్మాణం సమయంలోనే ఓసారి గండిపడింది. 2016, సెప్టెంబర్ 24న మిడ్‌మానేరు ఎగువన కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఎడమవైపు కట్ట తెగింది. కట్ట తెగిన తరువాత మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉండగా, లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు జరగలేదని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. గతంలో తెగిన ఎడమవైపే బోగం ఒర్రె ప్రాంతంలో కట్ట సీపేజీ రావడం, దానిని పునర్నిర్మించాలని నిర్ణయించి పనులు ప్రారంభించడం గమనించాల్సిన విషయం. కాగా, ఇంత జరుగుతున్నా... రిజర్వాయర్ కట్ట విషయంలో అధికారులు వాస్తవాలు తెలియజేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని విషయం.
Comments
Please login to add a commentAdd a comment