భారమంతా 'భూమి మీదే'.. | Land acquisition is the main issue for Kaleshwaram | Sakshi
Sakshi News home page

భారమంతా 'భూమి మీదే'..

Published Wed, Jan 2 2019 1:55 AM | Last Updated on Fri, Aug 30 2019 8:19 PM

Land acquisition is the main issue for Kaleshwaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ప్రాజెక్టు పనులన్నీ పూర్తయి ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి ఎంతమేర గోదావరి నీటిని తమ ఆయకట్టుకు మళ్లిస్తారోనని రైతులు కోటికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. బీడువారిన భూముల్లో సిరులు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో 50% పూర్తి కాగా, మరో 50% పనులు మిగిలున్నాయి. మిగతా పనుల పూర్తికి భూసేకరణ అడ్డంకిగా మారుతోంది. ప్రాజెక్టు పరిధిలో ఇంకా 27వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి నిధుల కొరతతోపాటు.. కోర్టు కేసులను దాటడం అత్యవసరంగా మారింది. 

జూన్‌ నాటికి  ఎల్లంపల్లి 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంప్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో ఇప్పుడిప్పుడే పనులు వేగవంతమయ్యాయి. ఇక్కడ ఇంకా 4.87లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయడం పెద్ద సవాల్‌. అయితే మొత్తం పని పూర్తవకపోయినా.. గోదావరి నుంచి కనిష్టంగా 100 టీఎంసీల మేర నీటిని తీసుకునే ఆస్కారం ఉంది. ఈ పనులను మరింత వేగవంతం చేసేందుకు.. సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. మిగతావాటిని అమర్చే ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌ల పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకు గానూ 2, సుందిళ్లలో 2 మోటార్లు సిద్ధం చేయగా, మే నాటికి మిగతా మోటార్లు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు.

ఈ పంప్‌హౌస్‌ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరతాయి. ఎల్లంపల్లి దిగువన 6,7,8 ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే మూడు సిద్ధమయ్యాయి. మరో మోటార్‌ రెడీ అవుతోంది. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. లైనింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్‌ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్‌ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్‌ పంపులు 4 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15–20 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. మార్చి లేక ఏప్రిల్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ప్యాకేజీలు పూర్తి చేసి జూన్‌ నాటికి మిడ్‌మానేరుకు కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. 

మిడ్‌మానేరు కింద అంతా సిద్ధం
ఇక మిడ్‌మానేరు కింద కొండపోచమ్మ సాగర్‌ వరకు 10,11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్‌ చానల్, గ్రావిటీ కెనాల్‌ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. కేవలం 800 మీటర్ల టన్నెల్‌ లైనింగ్‌ మిగిలి ఉంది. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉంది. ఇందులో 2 పూర్తవగా.. మరో రెండింటిని ఏప్రిల్‌లో పూర్తి చేయనున్నారు. 3.5 టీఎంసీల అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. వీటిని జూన్‌ నాటికి పూర్తి చేస్తారు. ప్యాకేజీ–11లో అన్ని పనులు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్‌ పనులు, లైనింగ్‌ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో 3 పూర్తవగా, ఒకటి మార్చి నాటికి సిద్ధం కానుంది. ఇక్కడ 3 టీఎంసీల రంగనాయక్‌ సాగర్‌ రిజర్వాయర్‌ పని పూర్తయింది. ప్యాకేజీ–12లో 16.18 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తవగా 800 మీటర్ల లైనింగ్‌ మిగిలుంది. ఈ పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. ఇక్కడ 8 పంపుల్లో 2 సిద్ధమవగా, 4 స్లాబ్‌ దశలో ఉన్నాయి. ఇవన్నీ జూన్‌ నాటికి పూర్తవుతాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్‌ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌ పనులు పూర్తికాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్‌ చానల్‌ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
సబ్‌స్టేషన్లు 'సిద్ధం'..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లకు అవసరమైన విద్యుత్‌కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్‌మిషన్‌ (సబ్‌స్టేషన్‌) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు. గోలివాడ గ్రామ శివారులో 400/220/11 కేవీ సామర్థ్యంతో దీన్ని రెడీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఎస్‌టీపీపీ) నుంచి గోలివాడ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది. ప్రాజెక్టులో భాగంగా 19 సబ్‌స్టేషన్లు నిర్మిస్తుండగా గోలివాడ సబ్‌స్టేషన్‌ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి మూడు పంప్‌హౌజ్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన 28 మోటార్లకు 40 మెగావాట్ల చొప్పున 1,120 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. 

ఈ ఖరీఫ్‌లోనే 89 లక్షల ఎకరాలకు.. 
మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్‌ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్‌ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా మేడిగడ్డ నుంచి తరలించే గోదావరి నీటిలో 60 టీఎంసీల నీటినైనా ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మే నాటికి 2 పంప్‌హౌస్‌లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నీటితో 6 లక్షల ఎకరాల మేర స్థిరీకరణ జరగనుండగా, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మ సాగర్‌ వరకు 400 చెరువులు నింపడం, అదనంగా కాల్వల ద్వారా కలిపి మొత్తంగా మరో 2–3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. 

భూసేకరణే 'కీలకం'..
ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యంత కీలకమైన సమస్య భూసేకరణే. ప్రాజెక్టుకు కేంద్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చినా.. వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 63,159.22 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా.. 35,643.37 ఎకరాల మేర సేకరణ మాత్రమే పూర్తయింది. మరో 27,516.13 ఎకరాల సేకరణ మిగిలి ఉంది. ఇందులో అత్యంత ముఖ్యంగా మల్లన్నసాగర్‌ పరిధిలోనే 900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఈ సేకరణకు కోర్టుల్లో ఉన్న 190కి పైగా కేసులు అడ్డుగా మారాయి. వీటి పరిష్కారం దిశగా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇటీవలి సమీక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇక కొండపోచమ్మ సాగర్‌కింది కాల్వలు, పిల్ల కాల్వలు, పూర్వ నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల కింద 13వేల ఎకరాల సేకరణ ఇబ్బందికరంగా ఉంది.

ఈ రిజర్వాయర్‌ల పరిధిలో ఎకరాకి రూ.30 లక్షల – 50 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి తోడు  ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలని, చదువుకోని వారికి ఉపాధి హామీ అవకాశం, ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలని నిర్వాసితుల నుంచి డిమాండ్‌లు వస్తున్నాయి. ఈ డిమాండ్ల పరిష్కారం ఎంతవరకు అన్నది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగానే భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుత అంచనాల మేరకు భూసేకరణకు రూ.2,696.13 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.856కోట్లు తక్షణావసరం ఉందని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించారు. సమస్యల పరిష్కారంతో పాటు, నిధులు సమీకరించి ఇస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగిరం కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement