సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్)
ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ...
ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్‌ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్‌ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది.
ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్)
మిడ్‌మానేరు దిగువన...
ఇక మిడ్‌మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్‌డ్యామ్‌ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది.
ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్‌సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్‌పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. మల్లన్నసాగర్‌లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్‌పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment