బుధవారం మిడ్‌మానేరు నుంచి ప్యాకేజీ–10 పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోసిన నీరు అనంతగిరి రిజర్వాయర్‌కు తరలివెళ్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ఎత్తిపోతల ద్వారా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ నుంచి మిడ్‌మానేరు (రాజరాజేశ్వరి) రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాల ప్రయాణం కొండలు, కోనలు, వాగులు, వంకలు, కాల్వలు, సొరంగ మార్గాలు దాటుకుంటూ కాళేశ్వర గంగమ్మ (గోదావరి), అనంతగిరి (అన్నపూర్ణ) రిజర్వాయర్ చేరింది. బుధవారం మిడ్‌మానేరు దిగువన పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా నీటిని అనంతగిరి తరలించే ట్రయల్ రన్ ప్రక్రియ విజయవంతమైంది. 164.15 కి.మీ. ఎగువకు గోదావరి నీళ్లు ప్రయాణించాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజీ పూర్తయినట్లయ్యింది. ఈఎన్‌సీ హరిరామ్, నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ ఆనంద్ పర్యవేక్షణలో 106 మెగావాట్ల (1.40 లక్షల హెచ్‌పీ) సామర్థ్యంగల మోటారు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని మధ్యాహ్నం 1.30 గంటలకు ఎత్తిపోసింది. ఇక్కడ నుంచి నీటిని రంగనాయక్‌సాగర్ మీదుగా ఈ నెల 25 నాటికి గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్‌కు చేరనున్నాయి.
90 మీటర్లు ఎగిసిపడిన జలాలు..
మధ్యమానేరు జలాశయం నుంచి 3.50 కి.మీ. కాలువ ద్వారా నీరు ఒబులాపూర్ చేరింది. అక్కడి నుంచి 7.65 మీటర్ల సొరంగ మార్గం ద్వారా తిప్పాపూర్ సర్జిపూల్ (మహాబావి)లోకి చేరాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్ ద్వారా 90 మీటర్ల ఎత్తునకు నీటిని ఎత్తిపోశారు. దీంతో అనంతగిరికి నీరు చేరింది.
సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై
కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి దశలో మేడిగడ్డ, అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నుంచి నీరు ఇప్పటికే ఎల్లంపల్లి చేరగా రెండో దశలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు తరలించారు. గతేడాది నవంబర్ నుంచి మిడ్‌మానేరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ నాలుగో దశ ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు తరలించాలంటే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా అక్కడ కోర్టు కేసుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఇటీవల నిర్వాసితుల తరలింపు ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆగమేఘాలపై ఎస్సీ కాలనీని ఖాళీ చేయించారు. అయినప్పటికీ మరో పదిగృహాలు ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఆ గృహాలకు ఇబ్బంది లేకుండా 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల అనంతగిరిలోకి ప్యాకేజీ–10లోని 4 మోటార్ల ద్వారా 0.8 టీఎంసీల నీటిని తరలించాలని ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరామ్‌ను ఆదేశించారు. దీంతో హుటాహుటిన బుధవారం ఉదయం 106 మెగావాట్ల సామర్థ్యంగల ఒక మోటార్ ద్వారా తొలి ఎత్తిపోతలు చేశారు. ఇది విజయవంతం కావడంతో ఆ మోటార్‌ను 10 గంటలపాటు నిరంతరాయంగా నడిపించి రాత్రికి రెండో మోటార్ ఆన్ చేశారు. గురు, శుక్రవారాల్లో మరో రెండు మోటార్లను సైతం నడిపించి మొత్తంగా 0.8 టీఎంసీ నీటిని అనంతగిరికి తరలిస్తారు. అనంతరం అనంతగిరి నుంచి ప్యాకేజీ–11లోని 134.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్ల ద్వారా నీటిని రంగనాయక్ సాగర్‌కు తరలిస్తారు. ఈ పంపులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. రంగనాయక్ సాగర్‌కు ఈ వారంలోనే నీటిని తరలించే ప్రక్రియ మొదలవుతుందని, మరో నాలుగైదు రోజుల్లో 3 టీఎంసీల ఈ రిజర్వాయర్‌ను నింపుతామని ఈఎన్‌సీ హరిరామ్ తెలిపారు.
25 నాటికి కొండపోచమ్మకు..
రంగనాయక్ సాగర్ నుంచి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–12లో 16.18 కి.మీ. టన్నెల్ పనులు పూర్తికాగా 8 పంపుల్లో అన్నీ సిద్ధమయ్యాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్నసాగర్ పనులు మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కి.మీ. మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్యాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించేలా ప్యాకేజీ–13 పనులు పూర్తవ్వగా, ప్యాకేజీ–14లో రెండు పంప్‌హౌస్‌ల్లోని ఆరేసి మోటార్లను సిద్ధం చేశారు. అయితే వాటికి విద్యుత్ కనెక్షన్ పనులు మరో నాలుగు రోజుల్లో పూర్తవుతాయని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి 15 టీఎంసీల సామర్థ్యంగల కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ నెల 25 నాటికి కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరతాయని, కనీసంగా 240 కిలోమీటర్ల గోదావరి తరలి రానుందని ఈఎన్‌సీ హరిరామ్ వెల్లడించారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు..
గోదావరి జలాలు అనంతగిరికి చేర్చే ప్రక్రియ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనంతగిరి నిర్వాసితులను అధికారులు ఖాళీ చేయించారు. నీరు రావడంతో మిగతా వాళ్లు ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోపాలకృష్ణ, డీఈఈ దేవేందర్, తహసీల్దార్లు రాజిరెడ్డి, ప్రసాద్, ప్రాజెక్టు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
కేసీఆర్ పర్యవేక్షణలోనే పనుల పూర్తి
ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహంతోనే నాలుగో దశ పూర్తయింది. ఆసియాలోనే అతిపెద్దదైన 92 మీటర్ల లోతైన సర్జ్‌పూల్ నుంచి నీటిని 101.20 మీటర్లు ఎత్తి అనంతగిరికి తరలించే ట్రయల్ రన్ బుధవారం పూర్తయింది. సీఎం సూచనల మేరకు ఈ నెలాఖరుకు కొండపోచమ్మ సాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరతాయి. – హరిరామ్, ఈఎన్‌సీ
Comments
Please login to add a commentAdd a comment