సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.
ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా..
అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్‌లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్‌హౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు.
ఈ పంప్‌హౌస్ నుంచి నీళ్లు మలక్‌పేట రిజర్వాయర్‌కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్‌హౌస్‌లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు.
ఈ నీరు దారిలోని 39 చెక్‌డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్‌లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు.
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
Published Tue, Apr 20 2021 4:56 AM | Last Updated on Tue, Apr 20 2021 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment