Maneru Dam
-
కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్‌లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్‌లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్ /కరీంనగర్: ప్రజాభాగస్వామ్యంతోనే నగరాల్లో పరిశుభ్రత సాధ్యమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్మించిన కౌన్సిల్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ.. నాలాలు శుభ్రం చేస్తుంటే సోఫాలు, పరుపులు, కుర్చీలు వస్తున్నాయని, ఈ తీరు మారాలని సూచించారు. సిద్దిపేట స్ఫూర్తిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో స్వచ్ఛబడి ఏర్పాటు చేయాలని ఆదేశించామని, ఇందుకు రూ.79 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తూ హైదరాబాద్ నగరం ఏటా రూ.200 కోట్లు, సిరిసిల్లలో స్వశక్తి సంఘాలు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాయని వివరించారు. సిద్దిపేటలో దీప్తి అనే కౌన్సిలర్ స్వచ్ఛబడి నిర్వహిస్తోందని, అలా ఇతర కార్పొరేటర్లు ప్రయత్నించాలని సూ చించారు. తాను జపాన్ వెళ్లినప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండడంపై ఆరా తీయగా.. తాము అపరిశుభ్రం చేయకపోవడమే కారణమని అక్కడి ప్రజ లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సపాయిమిత్ర సురక్షలో దేశంలోనే కరీంనగర్‌కు మొదటి స్థానం రావాల్సి ఉన్నా.. కుట్రతోనే ఆ స్థానం గుజరాత్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. నేను పుట్టింది కరీంనగర్‌లోనే.. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. తొమ్మిదేళ్లలో నగరం ఎలా మారిందో ప్రజలు చూస్తున్నారన్నా రు. 1976లో తాను ఇక్కడి మిషన్ హాస్పిటల్లో జ న్మించానని, కరీంనగర్, ఎల్ఎండీలో మూడునా లుగేళ్లు చదివానని గుర్తు చేశారు. నగరంలో పర్యటించినప్పుడు అంతర్గత రోడ్లు చూశానని, చాలా బాగున్నాయని అభినందించారు. రూ.225 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని, రూ.480 కోట్లతో నిర్మిస్తున్న రివర్‌ఫ్రంట్ పనులు వేగంగా జ రుగుతున్నాయని వెల్లడించారు. మూడు నాలుగు నెలల్లో రివర్‌ఫ్రంట్ పూర్తయ్యాక ప్రజలు ఆశ్చర్యపోయే స్థాయికి కరీంనగర్ చేరుతుందన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి హౌసింగ్‌బోర్డుకాలనీలో 24 గంటల నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేసుకున్న తొలినగరం కరీంనగర్ అని తెలిపారు. కౌన్సి ల్ హాల్ అసెంబ్లీ హాల్లాగా ఉందని ప్రశంసించా రు. టీవీల్లో కనిపించాలన్న ఆత్రంతో కొందరు కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు దిగజారి దూషణలకు దిగుతున్నారని, అందుకే కౌన్సిల్ మీటింగ్‌కు మీడియాను అనుమతించొద్దన్నానని స్పష్టంచేశారు. లైటింగ్ కోసం రూ.20 కోట్లు సాయంత్రం మానేరు తీరాన తీగల వంతెన ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తీగల వంతెన నుంచి మానకొండూరు వరకు లైటింగ్ కోసం మంత్రి గంగుల కమలాకర్ తనను కోరారని, వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రెండు నెలల్లో మానేరు రివర్ ఫ్రంట్ తొలిదశ పూర్తవుతుందన్నారు. శ్రీవేంకటేశ్వర ఆలయం, మెడికల్ కాలేజీలతో జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. వచ్చే దసరా నాటికి రివర్‌ఫ్రంట్‌పై నగర ఆడపడుచులు బతుకమ్మ ఆడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను లండన్‌లా మారుస్తానన్న సీఎం కేసీఆర్ తన మాటలను నిజం చేసి చూపించారన్నారు. వచ్చేవారం సింగపూర్, సియోల్ నగరాలకు వెళ్లి పర్యటించి నగరానికి కావాల్సిన సదుపాయాలపై మంత్రి కేటీఆర్‌కు నివేదిక ఇస్తామని వెల్లడించారు. తీగల వంతెన ఆలోచనకు కారణమైన ఈఎన్సీ రవీందర్రావును ప్రశంసించారు. ప్రైవేట్ రంగాల్లోనూ రాణించొచ్చు విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ రంగంలోనూ రాణించొచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.7 కో ట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న మోడ్రన్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. లైబ్రరీలో ఉన్న వి ద్యార్థులతో మాట్లాడారు. ఇక్కడున్న వస్తువు భారతీయులది కాదని, విదేశీయుల వస్తువులు వాడే దుస్థితి మనకు ఉండొద్దని సూచించారు. ఉద్యోగాలు రాలేదని బాధపడొద్దని, మనమే ప్రపంచానికి కొత్త వస్తువులను అందించే స్థాయికి ఎదగాలని సూచించారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా కష్టపడి చదవాలని, ప్రైవేట్ వ్యాపార రంగాలపైనా దృష్టి సారించాలన్నారు. గ్రంథాలయ ఐడీ కార్డును కేటీఆర్‌కు అందించారు. కార్యక్రమాల్లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రశిశంకర్, సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన సాగిందిలా.. రూ.10 కోట్లతో నిర్మించనున్న కాశ్మీర్‌గడ్డ సమీకృత మార్కెట్, రూ.7కోట్లతో నిర్మించనున్న మోడ్రన్ లైబ్రరీ, నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటిజన్ సర్వీస్ సెంటర్, నూతన సమావేశ మందిరం, ఆధునీకరించిన సమావేశమందిరం, కమాండ్ కంట్రోల్ సిస్టంను ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ గురించి వివరాలు తెలుసుకున్నారు. నూతన కౌన్సిల్ హాల్లో మేయర్ యాదగిరి సునీల్‌రావును సీటులో కూర్చొబెట్టి అభినందించారు. -
మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..
సాక్షి, కరీంనగర్: మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కే.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఘటన విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. -
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్‌హౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్‌హౌస్ నుంచి నీళ్లు మలక్‌పేట రిజర్వాయర్‌కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్‌హౌస్‌లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్‌హౌస్‌లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్‌డ్యామ్‌లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్‌లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఫ్రెండ్ మాట్లాడటం లేదని ఓ యువతి..
సాక్షి, కరీంనగర్ : స్నేహానికన్న మిన్నా, ఈ లోకాన లేదురా అనే సినిమా పాటను ఒంట పట్టించుకున్న ఓ యువతి, స్నేహితుడు దూరం కావడంతో ఆత్మహత్యకు యత్నించింది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ వద్ద సెల్పీ తీసుకుంటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా లేక్ పోలీసులు ఆమెను కాపాడారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా అక్కడే పని చేసే యువకుడితో సన్నిహితంగా మెదిలి మంచి మిత్రులు గా మారారు. అయితే ఆ యువకుడు ఇటీవల ఆమెతో మాట్లాడకుండా దూరంగా ఉండడంతో ఎడబాటును తట్టుకోలేకపోయింది. స్నేహితుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మంచి మిత్రుడు దూరమయ్యాడనే మనస్థాపంతో డ్యాం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. డ్యాం వద్ద లేక్ పోలీసులు ఆ యువతిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంచి మిత్రుడు దూరం అయ్యాడనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు యువతి తెలిపారు. తనకు ఏ సమస్య లేదని, మిత్రుడు దూరమై తనతో మాట్లాడ లేకపోవడంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. -
ఎల్ఎండీ మూడు గేట్లు తెరిచిన మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్: దిగువ మానేరు జలా శాయంలో జలదృశ్యం సాక్షాత్కరించింది. డ్యాంలో నీటిమట్టం 23 టీఎంసీలకు చేరడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మూడు గేట్లు ఏత్తి నీటిని దిగువకు వదిలారు. ఉదయం వరకు 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలుకాగా.. 23.200 టీఎంసీలకు నీరు చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం డ్యాం వద్దకు చేరుకున్నారు. నీటి లెవల్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఇన్‌ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 9 వేలకు తగ్గింది. అయినా అల్పపీడన ప్రభావంతో వరద వచ్చే అవకాశం ఉందని మూడు గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. పూజలు చేసిన మంత్రి ఎల్ఎండీ దిగువకు నీటిని విడుదల చేసే ముందు మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం 6 గంటలకు గేట్ల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం 9వ నంబర్ గేటు మోటార్ స్విచ్ ఆన్ చేసి అడుగు ఎత్తు వరకు గేటు ఎత్తారు. ఈ సందర్భంగా పాల నురగలా దిగువకు దుంకుతున్న నీటికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పూలు చల్లారు. అనంతరం 10, 11వ నంబర్ గేట్లను కూడా ఫీటు వరకు పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఒక్కో గేటు నుంచి 2 వేల క్యూసెక్కుల చొప్పు 6 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈ సమాచారం నిమిషాల్లో కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో డ్యాం వద్దకు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. సుందరంగా నగరం.. కరీంనగర్‌ను ఏడాదిలో స్మార్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో వేసవిలోనే చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మధ్యమానేరు, దిగువ మానేరుతోపాటు ఇప్పటికే చేపట్టిన చెక్ డ్యాంలతో కరీంనగర్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు మత్తడి తూకుతూ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. కరీంనగర్ చుట్టూ జల సవ్వడి నెలకొందని పేర్కొన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్, కేసీఆర్ ఐలాండ్, తీగల వంతెనను త్వరలో పూర్తిచేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి , నగర మేయర్ వై.సునీల్ రావు , డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావు, కార్పొరేటర్లు, రాజేందర్రావు, బండారి వేణు, దిండిగాల మహేష్ జంగిలి ఐలేందర్‌యాదవ్ నాయకులు నందెల్లి మహిపాల్, సుంకిశాల సంపత్‌రావు, ఎస్సారెస్పీ ఎస్ఈ శివకుమార్, ఈఈ శ్రీనివాస్, డీఈ సమ్మయ్య పాల్గొన్నారు వంతెనపై నిలిచిన ట్రాఫిక్.. దిగువ మానేరు జలాశయం మూడు గేట్లు ఎత్తడంతో ఈ సుందర దశ్యాన్ని చూసేందకు రాజీవ్ రహారిపై వెళ్లేవారంతా కాసేపు మానేరు వంతెనపై ఆగారు. దీంతో వంతెనపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనదారులు సెల్ఫీలు దిగారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. గేట్లు మూసివేత.. దిగువ మానేరు జలాశయంలోకి శనివారం అర్ధరాత్రి వరకు ఇన్‌ఫ్లో బాగా తగ్గడంతో అధికారులు రెండు గేట్లను మూసివేశారు. శనివారం వర్షాలు కురవకపోవడంతో ఆదివారానికి ఎల్ఎండీలోకి ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో ఉదయం 10 గంటలకు మిగిలిన ఒక్క గేటును కూడా మూసివేశారు. కాగా, శనివారం గేట్లు తెరిచారన్న సమాచారంతో ఆదివారం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే అప్పటికే గేట్లు మూసి ఉండడంతో నిరాశగా వెనుదిరిగారు. మోయ తుమ్మెద వాగు నుంచి ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు మళ్లీ తెరుస్తామని ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి నుంచి గేట్లు ఎత్తడం అనేది నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
చీకటిపూట.. నీటివేట
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పురపాలక పరిధిలో 23రోజులుగా తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. మానేరు ఏడారిగా మారింది. నీటిసరఫరాకు ఆటంకం ఏర్పడింది. విషయం తెలిసిన మంత్రి ఈటల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. జమ్మికుంటకు నీటిసరఫరా చేస్తున్న పైప్‌లైన్‌ను శనివారం సాయంత్రం పరిశీలించారు. ముత్తారం టు మానేరు.. శంకరపట్నం మండలం ముత్తారం చెరువులో నీటిని కల్వల ప్రాజెక్ట్‌లోకి మళ్లించి, అక్కడి నుంచి వీణవంక, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కల్లుపల్లి వాగు నుంచి మానేరులోని చెక్‌డ్యాంకు నీటిని తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం నీళ్లు శివారుకు చేరుకున్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ విలాసాగర్‌లోని మానేరు వాగును సందర్శించారు. కాలినడకన.. నీరు చేరుకున్న చోటికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో మంత్రి ఈటల కాలినడకన వెళ్లా రు. మానేరు సంప్‌హౌస్‌లోకి నీరు నింపేలా చర్య తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ఈకి ఫోన్లో సూచించారు. ముత్తారం చెరువు నుంచి కల్వల ప్రాజెక్ట్ లోకి మరింత నీరు వదలాలని ఆదేశించారు. ఆదివారం వరకు వాగులో నీటిప్రవాహవేగం పెరిగేలా చూడాలని తెలిపారు.అనంతరం జమ్మికుంటకు సరఫరా అయ్యే మంచినీటి బావులను పరిశీలించారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేలా చూడాలని మున్సిపాల్ చైర్మన్ పొడేటి రామస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిళి రమేష్, పురపాలక కమిషనర్ అనిసూర్ రషీద్‌ను అదేశించారు. పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలి జమ్మికుంటరూరల్: వేసవి కాలం పూర్తయ్యే నాటికి చెక్‌డ్యాం పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ అధికారులను, గుత్తేదారును ఆదేశించారు. శనివారం మండలంలోని విలాసాగర్ మానేరు వా గుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను పరిశీలించా రు. పదిహేను రోజుల్లో చెక్‌డ్యాం పనులు పూర్తయితే రబీలో రైతుల పంటలకు నీటికి కొదవ ఉండదని తెలిపారు. -
సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండింది!
-
కేసీఆర్ నాటిన మొక్కపై వివాదం
కరీంనగర్: సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క వాడిపోతుండటంపై వివాదం రేగింది. సీఎం నాటిన మొక్క వాడిపోవడానికి కొందరు యువకులు కారణమని కార్పొరేషన్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్ మానేరు కట్ట దిగువన సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవల మహాఘని మొక్క నాటారు. అయితే అది కాస్తా వాడిపోతోంది. కొందరు యువకులు ఈనెల 9న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి మొక్క దగ్గర నిలబడి ఏదో చేస్తున్నట్లు అనిపించిందని, అనుమానం రావడంతో తాను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ వారు వెళ్లిపోయారని బల్దియా వాచ్‌మన్ చెప్పారు. అప్పటి నుంచి మొక్క క్రమంగా వాడిపోతోందని, ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్కు సమాచారమిచ్చినట్టు వాచ్మెన్ పోలీసులకు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
నగర శివారులో క్రిమినల్ గ్యాంగ్
శివారు ప్రాంతాల్లో అడ్డా యువతులపై అఘాయిత్యాలు నియంత్రించలేకపోతున్న పోలీసులు ఫిర్యాదు చేయడానికి జంకుతున్న బాధితులు కరీంనగర్ క్రైం : నగరంలో చిల్లర గ్యాంగ్ రెచ్చిపోతోంది. శివారు ప్రాంతాల్లో అడ్డావేసి ఒంటరిగా, జంటగా వెళ్లే యువతులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాయి. ధన, మానా లు దోచుకునేందుకు, చివరకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని ఈ గ్యాంగ్‌లను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. గ్యాంగ్‌ల ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నారు. నగరంలోని 2009 నుంచి చిల్లర గ్యాంగ్ కల్చర్ మొదలైంది. మానేరు డ్యాం, పరిసరాల్లోని పార్కులకు వస్తున్న ఒంటరి మహిళలు, జంటలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపొవడంతో వారి ఆగడాలు హద్దుమీరుతున్నాయి. మహిళలు, యువతులపై అఘాయిత్యాలతోపాటు ఓ పార్టీ అండదండలతో భూకబ్జాలు, పోలీసులపై దాడులు చేసేవరకు ఎదిగారు. 2011లో వన్‌టౌన్ సీఐ సాయిమనోహర్ వీరి అగడాలకు బ్రేకులు వేశారు. దీనిని జీర్జించుకోని ఓ వర్గం పనికట్టుకుని సదరు సీఐ బదిలీ చేయించారని ప్రచారంలో ఉంది. సీఐ బదిలీ కావడంతో మళ్లీ ఈ గ్యాంగ్ ఆగడాలు ఊపందుకున్నాయి. ఎంతోమంది మహిళపై అఘాత్యాలు చేసినా బాధితుల నుంచి ఫిర్యాదులు మాత్రం పోలీసులకు అందడంలేదు. 2012లో ఓ వ్యక్తిపై దాడిచేసిన కేసులో వీరిని రిమాండ్ చేశారని సమాచారం. ఈ గ్యాంగుల సమాచారం పోలీసుల వద్ద ఉన్నా కేసులు విషయం వచ్చే సరికి నీళ్లు నలుముతున్నారు. గ్యాంగ్ కల్చర్ హద్దుమీరుతున్నా రాజకీయ స్వప్రయోజనాల కోసం నాయకులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానేరు డ్యాం నుంచి మకాం మార్చిన ఈ గ్యాంగ్ కొంతకాలంగా నగర శివారు ప్రాం తాల్లో అడ్డాలు వేసి మహిళలు, యువతులను టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది. సమాచారం సేకరణలో ముందుంటామని పేర్కొనే పోలీస్‌శాఖ ఈ గ్యాంగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదు వస్తేనే స్పందిస్తామని గ్యాంగ్ సమాచారం సేకరించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోసారి వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ నాలుగు రోజుల క్రితం తన బంధువుతో బైక్‌పై నగరానికి వస్తున్న ఓ బాలికతో ఈ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడిచేశారు. మరో నలుగురు వీరికి సహకరించారు. అనంతరం ఈ విషయంలో ఆరుగురి మద్య గొడవ జరుగడంతో గ్యాంగ్‌లోని ఐదుగురు కలిసి దూం ఖలీద్‌ను చితకబాదినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన ఖలీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాలికపై లైంగికదాడి విషయం బయటకు రావడంతో గ్యాంగ్ సభ్యులు ఓ పార్టీ నాయకుడితో కేసులు కాకుండా బాలిక బంధువులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రంగంలోకి దిగిన ఓ వర్గం నాయకులు కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం గ్యాంగ్‌లోని ముగ్గురు పరారీలో ఉండగా, మరో ఇద్దరు దర్జాగా తిరుగుతున్నట్లు తెలి సింది. నగరం శివారు ప్రాంతాల్లో నివాసం ఉం డే ఎవరిని అడిగినా ఈ గ్యాంగ్ ఆగడాల గురిం చి కథలు కథలుగా చెబుతారు. కానీ, పోలీ సులు వద్ద చిన్న సమాచారం కూడా ఉండదు. చివరకు ఈ గ్యాంగ్ సభ్యుల ఫొటోలు కూడా సంపాందించలేని పరిస్థితుల్లో మన పోలీసులు ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు గ్యాంగ్ సభ్యులు పోలీసుల వాచ్‌లిస్టు, అనుమానితులు లిస్టులో కూడా లేరని తెలిసింది. ధూం ఖలీద్‌పై మాత్రం అలవాటు పడ్డ నేరగాడు(డోసర్ క్రిమినల్, డీసీసీ) రికార్డు మెయింటెన్ చేస్తున్నారని సమాచారం. విచారణకు అదేశించిన పోలీస్ బాస్ నగరంలో శివారులో ఓ బాలికపై లైంగికదాడి సంఘటన బయటకు పొక్కడంతో విచారణ చేపట్టి వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జోయల్ డేవిజ్ పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. కొంతకాలంగా ఈ గ్యాంగ్ ఆగడాల వివరాలు తెలుసుకున్న ఎస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు గ్యాంగ్ సభ్యులను పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది.