సాక్షి, కరీంనగర్: దిగువ మానేరు జలా శాయంలో జలదృశ్యం సాక్షాత్కరించింది. డ్యాంలో నీటిమట్టం 23 టీఎంసీలకు చేరడంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం మూడు గేట్లు ఏత్తి నీటిని దిగువకు వదిలారు. ఉదయం వరకు 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో జలాశయం సామర్థ్యం 24.034 టీఎంసీలుకాగా.. 23.200 టీఎంసీలకు నీరు చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం డ్యాం వద్దకు చేరుకున్నారు. నీటి లెవల్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఇన్‌ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 9 వేలకు తగ్గింది. అయినా అల్పపీడన ప్రభావంతో వరద వచ్చే అవకాశం ఉందని మూడు గేట్లను ఎత్తాలని నిర్ణయించారు.
పూజలు చేసిన మంత్రి
ఎల్‌ఎండీ దిగువకు నీటిని విడుదల చేసే ముందు మంత్రి గంగుల కమలాకర్ సాయంత్రం 6 గంటలకు గేట్ల వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం 9వ నంబర్ గేటు మోటార్ స్విచ్ ఆన్ చేసి అడుగు ఎత్తు వరకు గేటు ఎత్తారు. ఈ సందర్భంగా పాల నురగలా దిగువకు దుంకుతున్న నీటికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పూలు చల్లారు. అనంతరం 10, 11వ నంబర్ గేట్లను కూడా ఫీటు వరకు పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఒక్కో గేటు నుంచి 2 వేల క్యూసెక్కుల చొప్పు 6 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈ సమాచారం నిమిషాల్లో కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో డ్యాం వద్దకు సందర్శకులు భారీగా తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు.
సుందరంగా నగరం..
కరీంనగర్‌ను ఏడాదిలో స్మార్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో వేసవిలోనే చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మధ్యమానేరు, దిగువ మానేరుతోపాటు ఇప్పటికే చేపట్టిన చెక్ డ్యాంలతో కరీంనగర్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు మత్తడి తూకుతూ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. కరీంనగర్ చుట్టూ జల సవ్వడి నెలకొందని పేర్కొన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్, కేసీఆర్ ఐలాండ్, తీగల వంతెనను త్వరలో పూర్తిచేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి , నగర మేయర్ వై.సునీల్ రావు , డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావు, కార్పొరేటర్లు, రాజేందర్‌రావు, బండారి వేణు, దిండిగాల మహేష్ జంగిలి ఐలేందర్‌యాదవ్ నాయకులు నందెల్లి మహిపాల్, సుంకిశాల సంపత్‌రావు, ఎస్సారెస్పీ ఎస్‌ఈ శివకుమార్, ఈఈ శ్రీనివాస్, డీఈ సమ్మయ్య పాల్గొన్నారు
వంతెనపై నిలిచిన ట్రాఫిక్..
దిగువ మానేరు జలాశయం మూడు గేట్లు ఎత్తడంతో ఈ సుందర దశ్యాన్ని చూసేందకు రాజీవ్ రహారిపై వెళ్లేవారంతా కాసేపు మానేరు వంతెనపై ఆగారు. దీంతో వంతెనపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనదారులు సెల్ఫీలు దిగారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
గేట్లు మూసివేత..
దిగువ మానేరు జలాశయంలోకి శనివారం అర్ధరాత్రి వరకు ఇన్‌ఫ్లో బాగా తగ్గడంతో అధికారులు రెండు గేట్లను మూసివేశారు. శనివారం వర్షాలు కురవకపోవడంతో ఆదివారానికి ఎల్‌ఎండీలోకి ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో ఉదయం 10 గంటలకు మిగిలిన ఒక్క గేటును కూడా మూసివేశారు. కాగా, శనివారం గేట్లు తెరిచారన్న సమాచారంతో ఆదివారం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే అప్పటికే గేట్లు మూసి ఉండడంతో నిరాశగా వెనుదిరిగారు. మోయ తుమ్మెద వాగు నుంచి ఇన్‌ఫ్లో పెరిగితే గేట్లు మళ్లీ తెరుస్తామని ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి నుంచి గేట్లు ఎత్తడం అనేది నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment