మానేరు కట్ట వద్ద మొక్కను నాటుతున్న కేసీఆర్ ( ఫైల్ పొటో)
కరీంనగర్: సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క వాడిపోతుండటంపై వివాదం రేగింది. సీఎం నాటిన మొక్క వాడిపోవడానికి కొందరు యువకులు కారణమని కార్పొరేషన్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరీంనగర్ మానేరు కట్ట దిగువన సీఎం చంద్రశేఖర్‌రావు ఇటీవల మహాఘని మొక్క నాటారు. అయితే అది కాస్తా వాడిపోతోంది.
కొందరు యువకులు ఈనెల 9న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి మొక్క దగ్గర నిలబడి ఏదో చేస్తున్నట్లు అనిపించిందని, అనుమానం రావడంతో తాను ప్రశ్నించగా దుర్భాషలాడుతూ వారు వెళ్లిపోయారని బల్దియా వాచ్‌మన్ చెప్పారు. అప్పటి నుంచి మొక్క క్రమంగా వాడిపోతోందని, ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ సూపర్‌వైజర్‌కు సమాచారమిచ్చినట్టు వాచ్‌మెన్ పోలీసులకు తెలిపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.