yellampally project
-
రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించేలా పంప్‌హౌస్‌లు, కాల్వలు, రిజర్వాయర్లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్‌బే, వెలగటూరు వద్ద మొదటి పంప్‌హౌస్ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్‌హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్ 17 వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. -
భారమంతా 'భూమి మీదే'..
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో రైతుల ఆశలన్నీ కాళేశ్వరం ద్వారా మళ్లించే గోదావరి జలాలపైనే ఉన్నాయి. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ప్రాజెక్టు పనులన్నీ పూర్తయి ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ఎంతమేర గోదావరి నీటిని తమ ఆయకట్టుకు మళ్లిస్తారోనని రైతులు కోటికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే.. బీడువారిన భూముల్లో సిరులు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో 50% పూర్తి కాగా, మరో 50% పనులు మిగిలున్నాయి. మిగతా పనుల పూర్తికి భూసేకరణ అడ్డంకిగా మారుతోంది. ప్రాజెక్టు పరిధిలో ఇంకా 27వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉంది. దీనికి నిధుల కొరతతోపాటు.. కోర్టు కేసులను దాటడం అత్యవసరంగా మారింది. జూన్ నాటికి ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు పంప్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో ఇప్పుడిప్పుడే పనులు వేగవంతమయ్యాయి. ఇక్కడ ఇంకా 4.87లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేయడం పెద్ద సవాల్. అయితే మొత్తం పని పూర్తవకపోయినా.. గోదావరి నుంచి కనిష్టంగా 100 టీఎంసీల మేర నీటిని తీసుకునే ఆస్కారం ఉంది. ఈ పనులను మరింత వేగవంతం చేసేందుకు.. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. మిగతావాటిని అమర్చే ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌ల పనులు వేగంగా సాగుతున్నాయి. అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకు గానూ 2, సుందిళ్లలో 2 మోటార్లు సిద్ధం చేయగా, మే నాటికి మిగతా మోటార్లు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ పంప్‌హౌస్ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరతాయి. ఎల్లంపల్లి దిగువన 6,7,8 ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే మూడు సిద్ధమయ్యాయి. మరో మోటార్ రెడీ అవుతోంది. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఎడమ వైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటినైనా మళ్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్ పంపులు 4 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15–20 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. మార్చి లేక ఏప్రిల్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు ప్యాకేజీలు పూర్తి చేసి జూన్ నాటికి మిడ్‌మానేరుకు కనిష్టంగా 90–100 టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్‌మానేరు కింద అంతా సిద్ధం ఇక మిడ్‌మానేరు కింద కొండపోచమ్మ సాగర్ వరకు 10,11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయి. కేవలం 800 మీటర్ల టన్నెల్ లైనింగ్ మిగిలి ఉంది. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉంది. ఇందులో 2 పూర్తవగా.. మరో రెండింటిని ఏప్రిల్‌లో పూర్తి చేయనున్నారు. 3.5 టీఎంసీల అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. వీటిని జూన్ నాటికి పూర్తి చేస్తారు. ప్యాకేజీ–11లో అన్ని పనులు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్ పనులు, లైనింగ్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో 3 పూర్తవగా, ఒకటి మార్చి నాటికి సిద్ధం కానుంది. ఇక్కడ 3 టీఎంసీల రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ పని పూర్తయింది. ప్యాకేజీ–12లో 16.18 కిలోమీటర్ల టన్నెల్ పూర్తవగా 800 మీటర్ల లైనింగ్ మిగిలుంది. ఈ పనులు ఈ నెలలో పూర్తి కానున్నాయి. ఇక్కడ 8 పంపుల్లో 2 సిద్ధమవగా, 4 స్లాబ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ జూన్ నాటికి పూర్తవుతాయి. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులు పూర్తికాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సబ్స్టేషన్లు 'సిద్ధం'.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్‌లకు అవసరమైన విద్యుత్‌కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్మిషన్ (సబ్‌స్టేషన్) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు. గోలివాడ గ్రామ శివారులో 400/220/11 కేవీ సామర్థ్యంతో దీన్ని రెడీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎస్టీపీపీ) నుంచి గోలివాడ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రాజెక్టులో భాగంగా 19 సబ్స్టేషన్లు నిర్మిస్తుండగా గోలివాడ సబ్‌స్టేషన్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి మూడు పంప్‌హౌజ్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన 28 మోటార్లకు 40 మెగావాట్ల చొప్పున 1,120 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. ఈ ఖరీఫ్‌లోనే 89 లక్షల ఎకరాలకు.. మేడిగడ్డ మొదలు కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించడం ద్వారా 8–9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఏర్పడుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఊపిరిలూదేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని కాళేశ్వరంతో పాటే ఈ జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూన్ నుంచే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు జరుగుతున్న నేపథ్యంలో అదే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పూర్తి చేసి కనిష్టంగా మేడిగడ్డ నుంచి తరలించే గోదావరి నీటిలో 60 టీఎంసీల నీటినైనా ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మే నాటికి 2 పంప్‌హౌస్‌లలో పూర్తిగా ఎనిమిదేసి మోటార్లను అమర్చి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నీటితో 6 లక్షల ఎకరాల మేర స్థిరీకరణ జరగనుండగా, మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మ సాగర్ వరకు 400 చెరువులు నింపడం, అదనంగా కాల్వల ద్వారా కలిపి మొత్తంగా మరో 2–3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. భూసేకరణే 'కీలకం'.. ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యంత కీలకమైన సమస్య భూసేకరణే. ప్రాజెక్టుకు కేంద్రం అన్ని రకాల అనుమతులు ఇచ్చినా.. వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 63,159.22 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా.. 35,643.37 ఎకరాల మేర సేకరణ మాత్రమే పూర్తయింది. మరో 27,516.13 ఎకరాల సేకరణ మిగిలి ఉంది. ఇందులో అత్యంత ముఖ్యంగా మల్లన్నసాగర్ పరిధిలోనే 900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఈ సేకరణకు కోర్టుల్లో ఉన్న 190కి పైగా కేసులు అడ్డుగా మారాయి. వీటి పరిష్కారం దిశగా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇటీవలి సమీక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇక కొండపోచమ్మ సాగర్‌కింది కాల్వలు, పిల్ల కాల్వలు, పూర్వ నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ల కింద 13వేల ఎకరాల సేకరణ ఇబ్బందికరంగా ఉంది. ఈ రిజర్వాయర్ల పరిధిలో ఎకరాకి రూ.30 లక్షల – 50 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలని, చదువుకోని వారికి ఉపాధి హామీ అవకాశం, ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని నిర్వాసితుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ల పరిష్కారం ఎంతవరకు అన్నది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగానే భూసేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుత అంచనాల మేరకు భూసేకరణకు రూ.2,696.13 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఇందులో రూ.856కోట్లు తక్షణావసరం ఉందని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదించారు. సమస్యల పరిష్కారంతో పాటు, నిధులు సమీకరించి ఇస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగిరం కానున్నాయి. -
జూన్‌లో ఎల్లంపల్లికి మేడిగడ్డ నీళ్లు
మంథని/రామగుండం/కాళేశ్వరం: జూన్ నాటికి మేడిగడ్డ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తామని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఆరుగురు సభ్యుల విశ్రాంత ఇంజనీర్ల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు కన్నెపల్లి, అన్నారం, గోలివాడ పంపుహౌస్‌లను సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్–4లో పనులు వెనుకబడ్డాయని, రెండు నదుల కలయికతో అసౌకర్యం ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. నీటిని మళ్లిస్తున్నామని, మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారన్నారు. 11 మోటార్లు, పంపులు, 87 గేట్లు బిగింపు పూర్తవుతుందన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 పంపులకు గాను 4 బిగించారని తెలిపారు. 2 టీఎంసీకి డిజైన్‌తోపాటు అదనంగా మరో టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో 5 మోటార్లు రావాల్సి ఉందని,2 జనవరి, మరో 3 ఫిబ్రవరి వరకు చేరుతాయని ఏజెన్సీ వారు చెబుతున్నారని, సమయానికి చేరితే మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్ నాటికి రాష్ట్ర మంతటికి సాగునీరు అందుతుందన్నారు. కన్నెపల్లి పంపుçహౌస్, మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి కావచ్చన్నారు. అన్నారం బ్యారేజీ పూర్తయిందని, 66 గేట్లు బిగింపు, వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. సుందిళ్ల బ్యారేజీలోనూ 74 గేట్ల బిగింపు పూర్తయిందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై నివేదికను సీఎంకు అందిస్తామన్నారు. బ్యారేజీ డిజైన్, మ్యాప్‌లను పరిశీలించినన బృందం సభ్యులు సాంకేతికకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమౌళి, సభ్యులు వేణుగోపాల్, రాంరెడ్డి, సత్తిరెడ్డి, వెంకట్రామరెడ్డి ఉన్నారు. -
శ్రీశైలానికి ఆగని వరద
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగింది. ఆల్మట్టిలోకి మంగళవారం సాయంత్రం 95,680 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 92,680 క్యూసెక్కులు దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు 60వేల క్యూసెక్కుల వరద రాగా, అది మరోమారు పుంజుకొని 1.12 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండి ఉండటంతో అక్కడి నుంచి 1.18లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, 50 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నీటికితోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి 95,680 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 150.81 టీఎంసీల నిల్వలున్నాయి. దిగువ నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 64,449 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 17,226 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకు గానూ 153.69 టీఎంసీలకు చేరింది. గోదావరిలో తగ్గిన ప్రవాహం.. : ఇక గోదావరిలో ప్రవాహాలు తగ్గిపోయాయి. ఎల్లంపల్లిలో నిన్నమొన్నటి వరకు భారీ ప్రవాహాలురాగా, మంగళవారం 15,719 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగానూ 19.04 టీఎంసీల నిల్వ ఉంది. ఇక కడెంలోకి 2,366 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎస్సారెస్పీలోకి 2,300 క్యూసెక్కులు వస్తుండగా నిల్వ 90 టీఎంసీలకు గానూ 16.91 టీఎంసీలకు చేరింది. సింగూరు, నిజాంసాగర్, ఎల్‌ఎండీల్లోకి ఎలాంటి ప్రవాహాలు నమోదు కావడం లేదు. -
ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు
అల్గునూర్(మానకొండూర్): ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు ఈ ఖరీఫ్‌లో నీరందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో తగినన్ని నీటి నిలువలు లేనందున ఇప్పటికిప్పుడే నీటి విడుదల సాధ్యం కాదని, రైతులు దీనిని అర్థం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో మంగళవారం మంత్రి.. అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీతోపాటు, ఎల్లంపల్లి, మధ్యమానేరు ప్రాజెక్టుల కింద చేపట్టిన పనులు, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ పనుల వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, నెలరోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో పనులు నత్తనడకన సాగడంపై మంత్రి అసం తృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఎస్సారెస్పీ అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. వేగం పెంచకుంటే కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు కాలువల పనులుపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీలో కల్పించిన సౌకర్యాలు, ఇంకా కల్పించాల్సిన వసతులు, పరిహారం తదితర అంశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పనులు, కాలువల నిర్మాణం, నీటి విడుదల, ఆయకట్టు పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎల్లంపల్లి ఆయకట్టుకు సాగునీరు.. ఎల్లపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు. ఈ నెలలో మంచి వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపాలని సూచించారు. ఎస్సారెస్పీలోకి ఈనెలలో భారీగా నీరు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నుంచి ఇప్పుడే నీటి విడుదల సాధ్యం కాదు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల నీరుమాత్రమే ఉందని, ఈ పరిస్థితుల్లో పంటలకు నీరివ్వడం సాధ్యం కాదని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. ఉన్న నీటిలో మిషన్ భగీరథ కోసం 6 టీఎంసీలు వినియోగిస్తామని, మరో నాలుగు టీఎంసీలు ఆవిరి నష్టాలు ఉంటాయని తెలిపారు. ఈ తరుణంలో నీటిని విడుదల చేస్తే తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విపక్షాలు నీటి విడుదలపై రాజకీయం చేయడం సరికాదని సూచించారు. ప్రాజెక్టు పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గతేడాది 40 టీఎంసీల నీరు చేరితే రెండు పంటలకు నీరు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈనెలాఖరులోగా ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుందనే నమ్మకం ఉందన్నారు. రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. -
నువ్వు చేసిందెక్కడ.. మేము ఆపిందెక్కడ..
వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టులు పూర్తి.. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సాక్షి, కరీంనగర్: ‘మూడేళ్ల పాలనలో నువ్వు చేసిందేంటి.. మేము ఆపింది ఎక్కడో చెప్పాలి’అని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కేసీఆర్‌పై మండిపడ్డారు. వరదకాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించి.. కాంగ్రెస్ హయాంలోనే ప్రారం భించామని, వాటిని ఆధారం చేసుకొనే నేడు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుట్టారన్న సంగతి మరిచిపోవద్దని అన్నారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరదకాలువ పనులను కాంగ్రెస్ హయాంలో పూర్తిచేస్తే వాటిని ఆధారం చేసుకొని ఇప్పుడు ఎస్సారెస్పీ పునరుజ్జీవం అంటూ కొత్త పాట పాడుతున్నారని’ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి, వరదకాలువ లేకపోతే పునరుజ్జీవం ఎలా సాధ్యమయ్యేదని ప్రశ్నించారు. ‘మేము ప్రాణహిత–చేవెళ్ల అని పేరుపెడితే రీడిజైన్ పేరుతో కాళేశ్వరం బ్యారేజీగా మార్పుచేసి ఏదో అద్భుతం చేసినట్లు కొత్త పాట పాడుతున్నారని’ విమర్శించారు. ప్రాజెక్టులను బలోపేతం చేస్తే సంతోషిస్తామని, దానిపేరుతో అడ్డగోలుగా భూసేకరణ చేయడం తగదన్నారు. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి చేపట్టే రివర్స్ పంపింగ్ చొప్పదండి మండలం రేవెళ్ల వద్ద వరద కాలువ క్రాసింగ్ అవుతున్న విషయాన్ని గమనించకుండా, నీటిని ఎస్సారెస్పీకి తీసుకెళ్లి మళ్లీ వరద కాలువ ద్వారా ఎల్ఎండీకి తరలించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ప్రతీ విషయానికి గత పాలకుల వైఫల్యమేనంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలని.. అనవసర పైపులైన్ వేయడం మానుకోవాలని హితవు పలికారు. -
నిర్వాసితులకు అండగా నిలుస్తాం..
బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ముంపు గ్రామాల సందర్శన మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ముంపు గ్రామాల బాధితులకు అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హామీ ఇచ్చారు. శనివారం ఎల్లంపల్లిలో ముంపునకు గురవుతున్న చందనాపూర్ గ్రామాన్ని సందర్శించి ఉద్వేగానికి లోనయ్యారు. గ్రామ పరిసరాల్లో వచ్చిన వరదనీటితోపాటు పంట పొలాలు కూడా నీట మునిగి పోవడాన్ని గుర్తించి ఆయన ప్రభుత్వ తీరు, అధికారుల అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుని ఓ వైపు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, కర్ణమామిడి, పడ్తనపల్లి, కొండపల్లి గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వక పోవడం దారుణమని పేర్కొన్నారు. చందనాపూర్ నీట మునుగుతున్నా అధికారులు పరిహారాలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే చందనాపూర్ గ్రామానికి ఉన్న దారులు మూసుకుపోగా రాపల్లి మీదుగా దాదాపు 20 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాస కేంద్రంలో ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చురించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్‌రావు, ఓబీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త సుంకి సత్యం, మాజీ కౌన్సిలర్లు బుద్దార్ధి రాంచందర్, పడాల మాధవి, నాయకులు పడాల శ్రీనివాస్, హేమలత, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. -
ఎల్లంపల్లి నిర్వాసితుల తరలింపు
మంచిర్యాల టౌన్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను గురువారం అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ఇప్పటికే 145.5 మీటర్లకు వరద నీరు చేరి, ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సమీప గ్రామాలైన చందనాపూర్, కొండపల్లి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లోని నిర్వాసితులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. కొండపల్లి నిర్వాసితులను కర్ణమామిడి పునరావాస కేంద్రంలో నిర్మించిన పాఠశాల భవనంలోకి, చందనాపూర్ నిర్వాసితులను చందనాపూర్ పునరావాస కేంద్రంలోనే నిర్మించిన పాఠశాల భవనంలోకి తరలించారు. వరద నీరు మరింత చేరితే కర్ణమామిడి, పడ్తన్‌పల్లి, రాపల్లి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.