సమస్యలు వింటున్న ప్రేమ్‌సాగర్‌రావు
-
బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి
-
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు
-
ముంపు గ్రామాల సందర్శన
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ముంపు గ్రామాల బాధితులకు అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హామీ ఇచ్చారు. శనివారం ఎల్లంపల్లిలో ముంపునకు గురవుతున్న చందనాపూర్ గ్రామాన్ని సందర్శించి ఉద్వేగానికి లోనయ్యారు. గ్రామ పరిసరాల్లో వచ్చిన వరదనీటితోపాటు పంట పొలాలు కూడా నీట మునిగి పోవడాన్ని గుర్తించి ఆయన ప్రభుత్వ తీరు, అధికారుల అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుని ఓ వైపు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, కర్ణమామిడి, పడ్తనపల్లి, కొండపల్లి గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వక పోవడం దారుణమని పేర్కొన్నారు. చందనాపూర్ నీట మునుగుతున్నా అధికారులు పరిహారాలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికే చందనాపూర్ గ్రామానికి ఉన్న దారులు మూసుకుపోగా రాపల్లి మీదుగా దాదాపు 20 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు నిర్వాసితులకు పరిహారం చెల్లించి పునరావాస కేంద్రంలో ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చురించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కమలాకర్‌రావు, ఓబీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త సుంకి సత్యం, మాజీ కౌన్సిలర్లు బుద్దార్ధి రాంచందర్, పడాల మాధవి, నాయకులు పడాల శ్రీనివాస్, హేమలత, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు.