నువ్వు చేసిందెక్కడ.. మేము ఆపిందెక్కడ..
వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టులు పూర్తి.. సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ‘మూడేళ్ల పాలనలో నువ్వు చేసిందేంటి.. మేము ఆపింది ఎక్కడో చెప్పాలి’అని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కేసీఆర్‌పై మండిపడ్డారు. వరదకాలువ, ఎల్లంపల్లి ప్రాజెక్టులను వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించి.. కాంగ్రెస్ హయాంలోనే ప్రారం భించామని, వాటిని ఆధారం చేసుకొనే నేడు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుట్టారన్న సంగతి మరిచిపోవద్దని అన్నారు.
శుక్రవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్టు, వరదకాలువ పనులను కాంగ్రెస్ హయాంలో పూర్తిచేస్తే వాటిని ఆధారం చేసుకొని ఇప్పుడు ఎస్సారెస్పీ పునరుజ్జీవం అంటూ కొత్త పాట పాడుతున్నారని’ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి, వరదకాలువ లేకపోతే పునరుజ్జీవం ఎలా సాధ్యమయ్యేదని ప్రశ్నించారు. ‘మేము ప్రాణహిత–చేవెళ్ల అని పేరుపెడితే రీడిజైన్ పేరుతో కాళేశ్వరం బ్యారేజీగా మార్పుచేసి ఏదో అద్భుతం చేసినట్లు కొత్త పాట పాడుతున్నారని’ విమర్శించారు.
ప్రాజెక్టులను బలోపేతం చేస్తే సంతోషిస్తామని, దానిపేరుతో అడ్డగోలుగా భూసేకరణ చేయడం తగదన్నారు. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి చేపట్టే రివర్స్ పంపింగ్ చొప్పదండి మండలం రేవెళ్ల వద్ద వరద కాలువ క్రాసింగ్ అవుతున్న విషయాన్ని గమనించకుండా, నీటిని ఎస్సారెస్పీకి తీసుకెళ్లి మళ్లీ వరద కాలువ ద్వారా ఎల్‌ఎండీకి తరలించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు.
ప్రతీ విషయానికి గత పాలకుల వైఫల్యమేనంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు చెప్పాలని.. అనవసర పైపులైన్ వేయడం మానుకోవాలని హితవు పలికారు.