సేదతీరుతున్న నిర్వాసితులు
మంచిర్యాల టౌన్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను గురువారం అధికారులు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ఇప్పటికే 145.5 మీటర్లకు వరద నీరు చేరి, ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు సమీప గ్రామాలైన చందనాపూర్, కొండపల్లి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లోని నిర్వాసితులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. కొండపల్లి నిర్వాసితులను కర్ణమామిడి పునరావాస కేంద్రంలో నిర్మించిన పాఠశాల భవనంలోకి, చందనాపూర్ నిర్వాసితులను చందనాపూర్ పునరావాస కేంద్రంలోనే నిర్మించిన పాఠశాల భవనంలోకి తరలించారు. వరద నీరు మరింత చేరితే కర్ణమామిడి, పడ్తన్‌పల్లి, రాపల్లి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.