మిడ్‌మానేరుకు ఏమైంది..? | No Godavari Water To Mid Manair Dam In Karimnagar | Sakshi
Sakshi News home page

మిడ్‌మానేరుకు ఏమైంది..?

Published Fri, Sep 27 2019 9:35 AM | Last Updated on Fri, Sep 27 2019 9:35 AM

No Godavari Water To Mid Manair Dam In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మిడ్‌మానేరు(శ్రీరాజరాజేశ్వర) ప్రాజెక్టు భద్రత చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోకి నీటిని నింపడం, అక్కడి నుంచి దిగువకు వదలడం వంటి అంశాల్లో పారదర్శకంగా ఉండాల్సిన అధి కార యంత్రాంగం గుంభనంగా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. 25.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్‌మానేరులోకి 2017 నుంచి నీటిని నింపుతున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట తొలిసారిగా 14 టీఎంసీల నీటిని నింపారు.

కానీ నింపిన నీటిని దిగువకు వదిలి 25 రోజులు కావస్తున్నా, ఇప్పటి వరకు మళ్లీ మిడ్‌మానేరులోకి గోదావరి నీటిని నింపే ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోగా, మిడ్‌మానేరులోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ,  దిగువన గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట సురక్షితం కాదనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ బుధవారం మిడ్‌మానేరు కట్టపైకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో చర్చించారు. మిడ్‌మానేరు కట్టపైన, కట్ట దిగువన బోరు మిషన్లతో డ్రిల్లింగ్‌ చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. మిడ్‌మానేరును ఎందుకు నింపడం లేదనే ఆయన ప్రశ్నకు అధికార యంత్రాంగం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మాన్వాడ, మల్లాపూర్, కొత్తపేట, బావుపేట ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాళేశ్వరానికి గుండెకాయ మిడ్‌మానేరు
కాళేశ్వరం ప్రాజక్టుకు గుండెకాయ వంటి మిడ్‌మానేరు నిండితేనే అక్కడి నుంచి ఒకవైపు లోయర్‌ మానేరుడ్యాం ద్వారా వరంగల్, ఖమ్మం జిల్లాలకు, మరోవైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్‌ల ద్వారా మెదక్, నల్గొండ, హైదరాబాద్‌ వరకు కాళేశ్వరం జలాలు తరలివెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలో గత నెలలో ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నందిమేడారం రిజర్వాయర్‌ ద్వారా లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ నుంచి మిడ్‌మానేరుకు వదిలారు.

25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్‌మానేరులో తొలిసారిగా 14 టీఎంసీల వరకు నీటిని నింపిన అధికారులు ఆగస్టు 30న సాయంత్రం 5 గంటలకు రిజర్వాయర్‌ నీటిని 10వేల క్యూసెక్కుల వరకు ఎల్‌ఎండీకి వదలాలని నిర్ణయించారు. అప్పటికే పొద్దుపోవడంతో హుటాహుటిన రెవెన్యూ అధికారులతో చర్చించి, పోలీసుల కాపలా మధ్య రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిరిసిల్ల ఎస్‌పీతో కలిసి కరీంనగర్‌ ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ నీటిని విడుదల చేశారు. 5 నుంచి 10 గేట్లు ఎత్తి మిడ్‌మానేరుకు నీటిని విడుదల చేస్తారని భావించగా, తెల్లవారే సరికి  ఏకంగా 25 గేట్లు ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు.

ఈ క్రమంలో దిగువన ఉన్న గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, కరెంటు మోటార్లు కొట్టుకుపోయాయి. రెండు మూడు రోజుల్లో ఏకంగా 10 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు వదిలేసి గేట్లు మూసివేశారు. ప్రస్తుతం మిడ్‌మానేరు ప్రాజెక్టులో కాళేశ్వరం నీరు నింపక ముందున్న 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. కాగా వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న 3,500 క్యూసెక్కుల నీటిని కూడా యధాతథంగా కిందికి వదులుతున్నారే తప్ప నిలిపే ప్రయత్నం చేయడం లేదు.

మిడ్‌మానేరు కట్టకు లీకేజా... సీపేజా..?
‘కొత్త కుండ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నిండుగా నీళ్లు నింపి ఎక్కువ సేపు ఉంచరు. కుండ గట్టిపడేదాకా నీటిని నింపి వదిలేస్తుంటారు. అలాగే మిడ్‌మానేరు విషయంలో జరిగింది’ అని ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఐఎస్‌ కోడ్‌ ప్రకారం రిజర్వాయర్‌ను రెండింట మూడొంతుల వరకు నీటితో నింపి ఆపేయాలని, ఏడాదికి కొంత చొప్పున నీటిని నింపాలని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే 2017లో ఈ ప్రాజెక్టులోకి 5.29 టీఎంసీ నీటిని నింపిన అధికారులు 2018లో 9 టీఎంసీలకు నింపారు. ఈ రెండు పర్యాయాలు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఈసారి 15 టీఎంసీల వరకు నింపినట్లు చెప్పారు. అయితే అంత మొత్తం నీటిని రాత్రికి రాత్రే వదిలేయాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. మాన్వాడ పరిధిలోని బోగంఒర్రె పూడ్చివేసి కట్ట కట్టిన ప్రాంతంలో భారీగా నీరు పైకి లేస్తుందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌ నీటి సాంధ్రత, గ్రావిటీని లెక్క కట్టేందుకు పీజో మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏ సమస్య లేకపోతే పీజో మీటర్లను భారీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిడ్‌మానేరుకు లీకేజీ లేదని చెబుతున్న అధికారులు కేవలం సీపేజీ మాత్రమేనని దాటవేస్తున్నారు. సీపేజీ అనే సాంకేతిక పదానికి అర్థం... ఏదైనాæ ద్రవం గానీ, గ్యాస్‌ గానీ చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు వెళ్లడమే. ‘నేషనల్‌ రివర్స్‌ అథారిటీ’ ఈ సీపేజీ అనే పదాన్ని ‘ప్రమాదం నుంచి నివారించేందుకు గల అవకాశం’గా పేర్కొంది.   

పీజో మీటర్‌ ద్వారా పీడన పరీక్షలు
ఏదైనా ద్రవం గ్రావిటీ కన్నా ఎత్తులో పీడనం చెందితే ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు పీజో మీటర్‌ను వినియోగిస్తారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఈ ప్రక్రియ సహజమే అయినప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణంలో గతంలో ఎక్కడా ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే మిడ్‌మానేరు నీటిని ఎల్‌ఎండీకి వదిలిన తరువాత ఇరిగేషన్‌ అధికారులు మిడ్‌మానేరు కట్ట నాణ్యత పరీక్షల్లోనే మునిగిపోయారు. సీపేజీ జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అధికారులు కట్ట పైనుంచి 30 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి, పీవీసీ పైపుల గుండా పీజో మీటర్లను ఏర్పాటు చేసి కట్ట అడుగున నీటి సాంధ్రత, పీడనాన్ని అంచనా వేసే పనిలో మునిగిపోయారు.

ఇప్పటికి కట్టకు ఇరువైపులా 8 పీజో మీటర్లు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కట్టకు దిగువన కూడా పీజో మీటర్లు ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు. కట్ట నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి 2.7 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి ‘సీపేజీలు’ జరుగుతున్నాయని గుర్తించి డ్యాం సేఫ్టీ టీం పనులు చేస్తుందని ఈద శంకర్‌రెడ్డి చెప్పారు. భూ ఉపరితలం నుంచి మట్టితో కట్ట నిర్మించిందే కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ అని, నాణ్యత లేని పనులు చేశారని కూడా ఆయన విమర్శించారు.

చెరువు కట్ట నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐడీసీ చైర్మన్‌ ఒప్పుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మిడ్‌మానేరు కట్ట ఎంత మేరకు సురక్షితమనే ఆందోళన దిగువనున్న గ్రామాల్లో మొదలైంది. దీనిపై అధికారులు గానీ ప్రభుత్వం గానీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement