క్షమాపణతో కష్టాలు తీరవు
-
సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి
-
భూనిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇవ్వాలి
-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
-
మిడ్‌మానేరు గండి పరిశీలన.. ముంపు బాధితులకు పరామర్శ
బోయినపల్లి/వేములవాడరూరల్ : మధ్యమానేరు నిర్మాణంతో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారి కన్నీళ్లను ఒక్క క్షమాపణ చెప్పి తీర్చలేరని, డబుల్ బెడ్‌రూమ్ విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మధ్యమానేరు గండిని పరిశీలించారు. మండలంలోని కొదురుపాక ఎస్సీ కాలనీలో వరద ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శించారు. వేములవాడ మండలం రుద్రవరంలో మానేరు ముంపు బాధితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వీరు కూడా ముంపు గ్రామాలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. 2008లో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, 2016 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పరిహారంతోపాటు ఇళ్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. డబుల్‌బెడ్‌రూమ్ హామీపై నాడు అవగాహన లేక మాట్లాడానని, క్షమించాలని సీఎం కోరడం సిగ్గుచేటన్నారు. మిడ్‌మానేరు వరదతో పంటలు దెబ్బతిన్న భూములను సేకరించి ఎకరానికి రూ.20లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, వర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. వర్షాలతో పంటలు నష్టపోయి, మానేరు నీటితో రుద్రవరం గ్రామంలో బాధితులు ఆవేదన చెందుతుంటే ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు గ్రామంవైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలపై ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతోందని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతీ నాయకుడు ఆపదలో ఉన్న ముంపు గ్రామాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పాలని సూచించారు. రుద్రవరం సర్పంచ్ పిల్లి రేణుక గ్రామంలోని సమస్యలతోపాటు ముంపు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, లింగంపల్లి శంకర్, శ్రీధర్, ఆకుల విజయ్, మేకల ప్రభాకర్‌యాదవ్, గుడి రవీందర్‌రెడ్డి, కన్నం అంజయ్య, గంటల రమణారెడ్డి, మహిళామోర్చ జిల్లా అధ్యక్షురాలు గాజుల స్వప్న, సుజాతారెడ్డి తదితరులున్నారు.