టీఆర్‌ఎస్‌కూ కాంగ్రెస్ గతే..
బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్
► రాష్ట్రంలో బీజేపీకి అండగా ఉంటా: కేంద్రమంత్రి హన్స్‌రాజ్
► బీజేపీలో పలువురి చేరిక
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టినగతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కూ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ సమక్షంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, న్యూ డెమోక్రసీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పటిదాకా చేరికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు.
వివిధ పార్టీలకు చెందిన చాలామంది ముఖ్యనేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. నిజాంపాలన, రజాకార్ల దౌర్జన్యాల గురించి అన్ని వర్గాల ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ముడివడిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవటం దారుణమని లక్ష్మణ్ విమర్శించారు. రజాకార్ల వారసత్వంతో వచ్చిన పార్టీ మజ్లిస్ అని, బీజేపీ మినహా అన్ని పార్టీలు మజ్లిస్‌కు దాసోహమంటున్నాయని మండిపడ్డారు.
మతపర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి సంకల్పం తీసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచనదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. కేంద్రమంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారి వివరాలను గ్రామ స్థాయిలో సేకరించి, వారికి తగిన గౌరవం కల్పిస్తామని ప్రకటించారు. తమ పూర్వీకులు కూడా తెలంగాణకు చెందినవారేనని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాకా అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.