2019 నాటికి అధికారమే లక్ష్యం
-
పల్లెపల్లెకు బీజేపీ...
-
గడపగడపకు నరేంద్రమోదీ
-
7న బూత్ కమిటీ సభ్యుల
-
మహా సమ్మేళనం
-
పాల్గొననున్న ప్రధాన మంత్రి
-
కేంద్రం నిధులు దుర్వినియోగం
-
కాకుండా చూస్తాం
-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
హన్మకొండ : 2019 నాటికి అధికారం లక్ష్యంగా ‘మిషన్–2019’తో ముందుకు పోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యమ్నాయ శక్తిగా ఎదుగుతుందని, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మిషన్–2019 రూపకల్పన చేశారని చెప్పారు. శనివారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, అనంతరం జరిగిన పార్టీ బూత్ కమిటీ సమ్మేళనం జిల్లా సన్నాహక సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. పల్లెపల్లెకు బీజేపీ..గడప గడపకు నరేంద్ర మోదీ అనే నినాదంతో కార్యాచరణ చేపడతామన్నారు. ప్రతి గడపను తట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే అగష్టు 7వ తేదీన బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17వ తేదీ ప్రత్యేకతను, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రధానికి వివరించనన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరుపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని లక్ష్మణ్ చెప్పారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారన్నారు. దీంతో పాటు టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటుకు, హెల్త్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తారని, మిషన్ భగీరథను ప్రారంభించనున్నారని వెల్లడించారు. మనోహరాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రం విడుదల చేసే నిధులకు కాపలా కుక్కలా ఉంటామని, నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. అనంతరం బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రఘునాథరావు, దుగ్యాల ప్రదీప్‌రావు, నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి, కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, కూచన రవళి, పెసరు విజయచందర్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, దిలీప్‌నాయక్ పాల్గొన్నారు.