శరీరంలోని ఒక భాగం పాడైతే మొత్తం శరీరానికి ఎంత బాధ ఉంటుందో, సమాజంలో ఒక భాగం వివక్షకు గురైతే యావత్ సమాజానికీ అంతే బాధగా ఉంటుంది. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదు. – కేసీఆర్
►దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న 8 లక్షల దళిత కుటుంబాలను దశల వారీగా అభివృద్ధిపరచడమే లక్ష్యంగా ఈ పథకం కింద వివిధ కార్యక్రమాలు చేపడతాం.
►సమృద్ధిగా పంటలు పండుతూ తెలంగాణ ధాన్యాగారంగా మారింది. పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసుకోవడంపై దృష్టిసారించాలి. 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేయాలి.
►పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేయాలి. 2, 3 ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని ఎంపిక చేసుకుని పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలి. పట్టణ ప్రగతిలో భాగంగా ‘మ్యాప్ యువర్ టౌన్’ ప్రకారం పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ 10 రోజుల్లో పట్టణాల్లో లోపాలను సరిచేసుకోవాలి.
►వ్యవసాయ శాఖ, పోలీసు అధికారుల సమన్వయంతో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించి కల్తీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం (ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం)’కు ఏటా రూ.1,000 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రైతుబంధు, వృద్ధాప్య పింఛన్ల పంపిణీ తరహాలో పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగనుందని స్పష్టంచేశారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్‌తో సంబంధం లేకుండా ఈ పథకానికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
దళితుల్లో వెనుకబాటుతనాన్ని, బాధలను తొలగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. జూలై 1 నుంచి 10 రోజుల పాటు మలి దశ పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థ)లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించిన నాడే దళిత సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, ఆదివారం నిర్వహించనున్న (అఖిలపక్ష) సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు
‘ప్రగతి’ కార్యక్రమాల్లో చురుగ్గా..
పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, ప్రజలను చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల కింద నిర్దేశించిన ఏ పనికూడా వీటి ముగింపు తర్వాత అపరిష్కృతంగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నా, పనులు 100శాతం ఎందుకు పూర్తి కావడం లేదన్న అంశంపై పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థల పేరు మీద రిజిస్ట్రేషన్..
లేఅవుట్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన భూమిని విధిగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను నిర్దేశించారు.
పట్టణాలకు క్లీనింగ్ ప్రొఫైల్...
పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకొని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. జూలై చివరికల్లా శాఖల నడుమ ఉన్న పరస్పర బకాయిలను ‘బుక్ అడ్జస్ట్ మెంట్’ ద్వారా పరిష్కరించాలని, ఇక నుంచి అన్ని శాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను వెంట వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ఇళ్లపై నుంచి విద్యుత్ లైన్లను తొలగించాలి
గ్రామాల్లో ఇళ్లపై నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో వి ద్యుత్ సమస్యలను అధిగమించడానికి పవర్ డేను పాటించాలన్నారు. ప్రజలను చైతన్యపరిచి కరెంటు సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు
‘ప్రభుత్వ అండతో తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా పరిణామం చెందింది. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణ అవసరం. రైస్ మిల్లుల సంఖ్యను పెంచాలి. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఆ పరిధిలో లే అవుట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఆ స్థలాలను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలి
నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్న జిల్లాల్లోని ప్ర భుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకుని వాటిని ప్రజా అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘రాష్ట్ర చాంబర్’ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిప్యాడ్‌లను నిర్మించాలని చెప్పారు.
జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలను జూలై చివరిలోగా సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల వివరాలు రికార్డు చేయడానికి, సంరక్షణ, పర్యవేక్షణ కోసం జిల్లాకో ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించాలని, వీరు సం బంధిత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేయా ల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రస్థాయి ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించి సీఎస్ పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment