'దళితులను మాయావతి ఎదగనీయడం లేదు'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో దళితులను ఎదగనీయకుండా బహుజన సమాజ్వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దళితులను నాయకులుగా తయారుచేసేందుకు తమ పార్టీ పాటు పడుతోందని అన్నారు. అన్ని రంగాల్లో దళిత నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందన్నారు.
దేశంలో దళిత అభ్యున్నతి దశలవారీగా జరుగుతోందని వివరించారు. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. మలిదశలో రిజర్వేషన్ల ఆధారంగా దళితుల అభ్యున్నతికి బీఎస్సీ వ్యవస్థాపకుడు కాన్షీరాం పాటుపడ్డారని చెప్పారు. ప్రస్తుతం మూడో దశ నడుస్తోందన్నారు.
ఇలాంటి దశలో మాయావతి లాంటి ఒక్క నాయకురాలే సరిపోరని అన్నారు. దళిత అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్లాలంటే లక్షలాది మంది నాయకులు కావాలన్నారు. దళిత నాయకోద్యమాన్ని మాయావతి హస్తగతం చేసుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఆమె ఎవరినీ ఎదగనీయడం లేదన్నారు.