లక్నో: బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) పోటీచేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టిన రోజు (జనవరి 15) సందర్భంగా బీఎస్పీ-ఎస్పీ కూటమిని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఇప్పటికే మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు పలు దఫాలుగా చర్చలు జరిపారని, కాంగ్రెస్ లేకుండా 50-50 సీట్ల ఒప్పందంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని అవగహన కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీటి మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీని మూడు స్థానాల్లో పోటీలో నిలుపుతున్నట్లు సమాచారం.
గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేసి బీజేపీ యుందు బొక్కబోర్ల పడ్డ విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా గోరఖ్‌పూర్, పూల్‌పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీచేసి కమలం కంచుకోటను బద్దలుకొట్టాయి. ఉపఎన్నికల ఫలితాలను పునావృత్తం చేయాలనే ఆలోచనతో మాయా, అఖిలేష్‌లు మాత్రమే ఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారని యూపీలో పెద్దచర్చే జరగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు మాయా పుట్టినరోజున బిగ్ ఎనౌన్సమెంట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈఇద్దరు యూపీ నేతలు డుమ్మాకోట్టారు. ఎన్నికల ముందు పొత్తులకు దూరంగా ఉంటామంటూ, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను బీఎస్పీ దూరంగా ఉంచింది. ఒకవేళ బీజేపీయేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకునేందుకు మాయావతి, అఖిలేష్ సిద్ధంగా లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లే.
Comments
Please login to add a commentAdd a comment