మీడియాతో మాట్లాడుతున్న మాయావతి, అఖిలేశ్ యాదవ్
లక్నో : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్ వాదీ పార్టీ(ఎస్‌పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) అధినేతలు, మాజీ సీఎంలు మాయవతి, అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం విలేకరులతో జరిగిన సమావేశంలో భాగంగా లోక్‌సభ సీట్ల పంపకంపై అనుసరించే విధానాలను తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యం, ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీచేయబోమని.. అయితే వారితో పొత్తు పెట్టుకునే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు.
యూపీలో కాంగ్రెస్‌కు బలం లేదు..
తమ పార్టీతో పొత్తుకు అంగీకరించినందుకు బీఎస్పీ అధినేత్రి మాయవతికి అఖిలేశ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని వెల్లడించారు. ఆర్‌ఎల్డీ పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదని, అందుకే పొత్తు విషయమై వారితో చర్చించలేదని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
మోదీ, అమిత్ షాకు నిద్రలేని రాత్రులే
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యామ్నాయం కోసం యూపీ ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, అందుకే బీఎస్పీ- ఎస్పీ చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడ్డాయని మాయవతి అన్నారు. రెండు జాతీయ పార్టీలు యూపీ ప్రజలను మోసం చేశాయని పేర్కొన్నారు. అందుకే కొత్త రాజకీయ విప్లవానికి తాము నాంది పలికామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం తమ రెండు పార్టీలు కృషి చేస్తాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతో పట్ల దేశ ప్రజలంతా విసుగు చెందారని.. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. వీరంతా కలిసి ఎన్నికల్లో మోదీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఇకపై మోదీ, అమిత్ షాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుందని మాయావతి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల స్ఫూర్తితో గెలుపు సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment